husband on wife
-
Patna High Court: భార్యను భూతం.. పిశాచి అనడం క్రూరత్వం కాదు
పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్కుమార్గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్ గుప్తా, సహదేవ్ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకు జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. -
కలిసి నడిచారు.. కలిసే తనువు చాలిచారు
మంథని: పుట్టినిల్లు.. మెట్టినిల్లు రెండూ నిరుపేద కుటుంబాలే.. కూలీపని చేసుకుంటేనే పూట గడిచే ది.. వరద మిగిల్చిన విషాదం ఆ రెండు కుటుంబా లను చిదిమేసింది.. భర్తకు అన్నింటా చేదోడువాదోడుగా, ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య.. భర్త వెంటే తాను తనువు చాలించింది.. కానీ, తన ఇద్దరు చిన్నారుల భవితవ్యం గురించి ఒక్కసారైనా ఆలోచన చేయలేదు.. విషాదం నింపిన ఈ ఘటన కన్నీరు తెప్పించింది. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచా యతీ పరిధి నెల్లిపల్లిలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి తనవు చాలించిన కటుకు అశోక్(35)అంటే ఆయన భార్య సంగీత(28)కు అమితమైన ప్రేమ అని స్థానికులు అనుకుంటున్నారు. భర్తను ఎవరైనా చిన్నమాట అంటే వారించేదని, తన కూతురు, కుమారున్ని సైతం ఎంతోఅల్లారుముద్దుగా పెంచుకుందని, అలాంటి దంపతులిద్దరూ తన ఇద్దరు చిన్నారులను వదిలి కానరాని లోకాలకు వెళ్లడంపై స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండుసార్లు పంట మునక గ్రామానికి చెందిన కటుకు రాయమల్లు– రమాదేవికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. రాయమల్లుకు ఉన్న కొద్ది పాటి భూమిని తానే సాగు చేసుకుంటున్నాడు. ఓ కుమారుడు ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండగా అశోక్ ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి సాగు చేసుకుంటున్నాడు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో అశోక్ సాగు చేసిన వరి, పత్తి పంటలు రెండుసార్లు నీటమునిగి పంటలు దెబ్బతిని నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2లక్షల వరకు అప్పు ఎలా తీర్చేదనే మనస్తాపంతో తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులు భావిస్తున్నారు. పిల్లల ముఖాలకు పసుపు ఎందుకు రాసినట్లు? దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి రామస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారి పిల్లలు సాయి, సన ముఖాలకు పసుపు ఉందని, అలా ఎవరు, ఎందుకు రాసి ఉంటారని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ పనిమానేసి.. వ్యవసాయం వైపు.. అశోక్ గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడని, రెండుమార్లు ప్రమాదం నుంచి బయటపడడంతో ఆ పనిమానేసి వ్యవసాయం వైపు దృష్టి సారించినట్లు స్థానికులు తెలిపారు. కాగా అశోక్‌కు వ్యవసాయం కూడా అచ్చిరాలేదని, గతంలో కూడా మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పలువురు గ్రామస్తులు అనుకుంటున్నారు. -
చనువుగా ఉన్న సమయంలో భర్త నాలుక కొరికిన భార్య..!
కర్నూలు: గొడవ పడి భర్త నాలుకను భార్య కొరికిన ఘటన తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్టతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పావతికి పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన చందూనాయక్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తండాలోనే నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చందూనాయక్ నాలుకకు తీవ్ర గాయమైంది. చనువుగా ఉన్న సమయంలో భార్యనే భర్త నాలుక కొరికి గాయపరిచిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని జొన్నగిరి ఎస్ఐ రామాంజినేయులు తెలిపారు. -
ప్రాణం తీసిన అనుమానం
తమిళనాడు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి నరసింహస్వామి ఆలయం వీధికి చెందిన వినాయకం(42), గిరిజ(38) దంపతులు ఏడేళ్ల నుంచి బెంగళూరులో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ అక్కడే కాపురం వుంటున్నారు. వీరి కొడుకు (9) అరక్కోణం సమీపంలోని ఉలియమంగళంలోని అమ్మమ్మ ఇంట్లో వుంటున్నాడు. గిరిజ 15 రోజుల కిందట ఉలియమంగళంలోని పుట్టింటికి వచ్చింది. వారం కిందట తిరుత్తణిలోని వినాయకం తల్లి వద్దకు వెళ్లింది. వారం రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహం చెందిన వినాయకం కత్తితో గిరిజను నరికాడు. తీవ్రంగా గాయపడిన గిరిజ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపులు మూసివుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. . డీఎస్పీ విఘ్నేష్‌తో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపల చూడగా గిరిజ రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. అక్కడే వున్న వినాయకంను అదుపులోకి తీసకున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతోనే హత్య చేసినట్టు అంగీకరించాడు. -
Anakapalle: విడాకులు కోరిందని కసితో హత్య చేసిన భర్త
అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు. -
భార్యపై అనుమానంతో దాడి
సాక్షి, భీమవరం : భార్యపై అనుమానంతో కత్తెరతో హత్యాయత్నం చేసిన భర్త ఉదంతమిది. భీమవరం వన్‌టౌన్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమ వరం పట్టణానికి చెందిన షేక్ నాగూర్‌సాహెబ్‌కు పట్టణంలోని మెంటేవారితోటకు చెందిన షేక్ లాలాసాహెబ్ కుమారై అమీనాబేగంతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా నాగూర్‌సాహెబ్ భార్య ను అనుమానించడం, చిత్రహింసలు చేస్తుండడంతో ఆరు నెలల కిత్రం పుట్టింటికి వెళ్లిపోయింది. ఐతే శుక్రవారం పట్టణంలోని రంగాబజార్ ప్రాంతంలోని టైలరింగ్ షాపులో పనిచేస్తున్న అమీనాబేగం వద్దకు వచ్చిన నాగూర్‌సాహెబ్ ఆమెతో గొడవపడి కత్తెరతో గాయపర్చాడు. బాధితురాలిని చికిత్సకోసం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లాలాసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
భర్త వీడియో కాల్ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య
అన్నానగర్: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు. రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఆరేళ్ల ప్రేమ.. ప్రేయసి పుట్టిన రోజు, రూమ్‌లో పార్టీ చేసుకుందామని పిలిచి..
కర్ణాటక: ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ప్రియుని ఉదంతం బెంగళూరు రాజగోపాలనగర పరిధిలో జరిగింది. హోంశాఖ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న నవ్య (24) హతురాలు. ఆమె రామనగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్రకు చెందినవారుకాగా, కోరమంగళలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేది. ఒకే ఊరు, దూరపు బంధువు అయిన ప్రశాంత్ బెంగళూరు లగ్గేరి రాజేశ్‌నగరలో ఉంటూ, పీణ్యలో ఫ్యాక్టరీలో ఆపరేటర్గాపని చేస్తున్నాడు. ఇద్దరూ ఆరేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. మంగళవారం నవ్య పుట్టిన రోజు. శుక్రవారం పార్టీ చేసుకుందామని ప్రశాంత్ ఆమెను తన రూంకు పిలిచాడు. చాటింగ్‌పై గొడవ జరిగి మధ్యాహ్నం మూడు గంటలకు కేక్ కట్‌చేశారు. కొంతసేపటికి నవ్య మొబైల్లో చాటింగ్ చేయడం చూసిన ప్రశాంత్ అనుమానంతో ప్రశ్నించగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఉన్మాదిగా మారిన ప్రశాంత కేక్ కోసిన కత్తితోనే నవ్య గొంతు కోశాడు. తీవ్ర రక్తసావంతో ఆమె అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఏమి చేయాలో దిక్కుతోచని ప్రశాంత్ ఆమె శరీర భాగాలను కత్తిరించి గోనె సంచిలో పెట్టి దూరంగా పడేయాలని ప్లాన్ వేశాడు. ఆదీ సాధ్యంకాకపోవడంతో గదిలోనే శవంతో పాటు సాయంత్రం వరకు ఉన్నాడు, తరువాత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. పోలీసులు నవ్య తల్లి నాగరత్నకు ఫోన్లో చెప్పి పిలిపించారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను..
పెగడపల్లి(ధర్మపురి): డబ్బు కోసం, పొలంలో వాటా కోసం కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు... కూతురిపై కూడా దాడి చేసేందుకు యత్నించేలోగా ఆమె పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. గతంలో కొడుకును హత్య చేసి ఆ కేసులో జైలుకెళ్లి వచ్చి ఇప్పుడు భార్యను పొట్టనబెట్టుకున్న ఓ కర్కోటకుడి నిర్వాకం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సీఐ వెంకట రమణమూర్తి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నక్క రమేశ్–గంగవ్వ(45) దంపతులు. వీరికి కుమారుడు జలేందర్, కూతురు స్నేహ ఉన్నారు. రమేశ్ ఉపాధి కోసం గతంలో దుబాయి వెళ్లివచ్చాడు. అక్కడ సంపాదించిన డబ్బు విషయంలో రమేశ్, గంగవ్వ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2019 నవంబర్‌లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మధ్యలో వారించిన కొడుకు జలేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు రమేశ్. ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. అప్పట్నుంచి భార్య, భర్త వేర్వేరుగానే ఉంటున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమిని ఇద్దరూ వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. అయితే, గంగవ్వ సాగు చేసుకుంటున్న భూమి తనకే ఇవ్వాలని రమేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేయాలని పథకం పన్నాడు. ఆదివారం గంగవ్వ, ఆమె కూతురు స్నేహ పొలంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు. విషయం తెలిసి రమేశ్.. పొలం వద్దకు వెళ్లి.. కత్తితో భార్య గంగవ్వపై దాడి చేశాడు. కూతురు స్నేహ అడ్డుకునేందుకు యత్నించగా ఆమెపైనా దాడికి యత్నించాడు. కూతురు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. భార్య గంగవ్వను కత్తితో కడుపు, వీపు భాగంలో గట్టిగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్ పరారీలో ఉన్నాడనీ మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..
హుజూర్నగర్ రూరల్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల గోపయ్యకు 35ఏళ్ల క్రితం గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ(50)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. గతంలో ఓ కుమారుడు మృతిచెందగా మరో కుమారుడు జానకిరామయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గోపయ్య ఏడాదిలో కొంతకాలం పాటు చెన్నై వెళ్లి భిక్షాటన చేసేవాడు. భార్య వెంకటమ్మ గ్రామంలో కూలి పనులు చేస్తూండేది. పది రోజుల క్రితమే గ్రామానికి వచ్చిన గోపయ్య భిక్షాటన చేయ గా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ.. భార్య ను వేధిస్తూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి డబ్బులు కావాలని వెంకట మ్మను అడగ్గా..ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఇంటికి చేరుకున్న గోపయ్య మంచంపై నిద్రిస్తున్న భార్యపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో ఆమె పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
కిరాతకం
రాయచోటి టౌన్: మద్యానికి బానిసైన భర్త వెంకటరమణ కట్టుకున్న భార్య లక్ష్మిదేవి (52)ని కడతేర్చాడు. గొంతు కోసి కిరాతకంగా చంపేసి పరారయ్యాడు. ఈ సంఘటన రాయచోటిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చిన్నగోళ్ల వెంకటరమణ, లక్ష్మిదేవి అనే దంపతులు మదనపల్లె తంబళ్లపల్లె నుంచి పదేళ్ల క్రితం రాయచోటి రెడ్డీస్ కాలనీకి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె సుమతిని రాయచోటికి చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సుధాకర్‌కు వేరే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం చేశారు. కాగా రాయచోటిలో లక్ష్మిదేవి చిన్న పాటి టిఫెన్ సెంటర్ నడుపుతుండేది. సుధాకర్ కూడా అదే ప్రాంతంలో టిఫెన్ సెంటర్ పెట్టుకొని వేరు కాపురం ఉంటున్నారు. కొన్నేళ్ల తర్వాత వెంకటరమణ రెడ్డీస్ కాలనీలో ఓ ఇంటిని కొన్నాడు. ఆ ఇంటిలో మిద్దెపైన వెంకటరమణ, లక్ష్మిదేవి దంపతులు ఉండగా.. కింద ఇంటిలో వారి కుమారుడు సుధాకర్, కోడలు ఉంటున్నారు. వెంకటరమణ తల్లి కూడా ఆయనతోపాటే ఉండేది.. నాలుగు నెలల క్రితం ఆమె తంబళ్లపల్లెలో ఉంటున్న తన పెద్ద కుమారుడు వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ‘అమ్మను నా వద్ద లేకుండా చేస్తావా.. నీ అంతు చూస్తా..’ అంటూ అన్నతో వెంకటరమణ గొడవపడేవాడు. కొద్దిరోజులకు మద్యానికి బానిసయ్యాడు. ‘మా అమ్మకు అన్నం పెట్టడం లేదు.. అందుకే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది..’ అంటూ భార్య లక్ష్మి దేవితో గొడవ పడుతుండేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలని ఆమెతో తరచూ వాదులాటకు దిగేవాడు. కొద్దిరోజులుగా మతిస్థిమితం లేనివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మంగళవారం రాత్రి కూడా భార్యతో వెంకటరమణ తాగి వచ్చి గొడవపడ్డాడు. అర్ధరాత్రి ఆమెను గొంతుకోసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా.. రోజు మాదిరే సుధాకర్ బుధవారం తెల్లవారుజామున తన ఇంటిలోని వంట సామగ్రితో టిఫెన్ సెంటర్‌కు వెళుతూ.. ‘మా అమ్మను కూడా పిలుచుకుని రా..’ అని భార్యతో చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె మిద్దెపైన ఉన్న అత్తను పిలుద్దామని వెళ్లింది. వాకిలి తీసే ఉంది. లోపలికి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో అత్త లక్ష్మిదేవి పడిఉంది. వెంటనే భర్త సుధాకర్‌కు ఈ విషయం చెప్పింది. అతడు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. స్థానికులు ఆమె చనిపోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. మద్యానికి బానిసైన తన తండ్రి .. తల్లిని చంపేశాడని బోరున విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భార్యపై అనుమానం.. బ్యూటీపార్లర్‌లో రాజు ఏం చేశాడంటే..?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్‌కాలనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న తన భార్యపై అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పార్లర్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో సుమతి(25) అనే మహిళ మూడు నెలలుగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే భర్త రాజు.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో, శనివారం పార్లర్‌కు వెళ్లిన రాజు.. సుమతిపై హత్యాయత్నం చేశాడు. రాజు చేతిలో కత్తి ఉండటంతో బ్యూటీ పార్లర్ సిబ్బంది అతడిని వారించారు. ఈ క్రమంలో రాజు.. భార్య సుమతిని తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతునొక్కి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. అనంతరం కత్తితో పార్లర్ సిబ్బందిని బెదిరించాడు. దీంతో, వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో యజమాని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. రాజుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య.. విషయం ఏంటంటే..? -
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..
సాక్షి,తూర్పుగోదావరి : భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. తాళ్లరేవు మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)ను అతని భార్య దేవి గొడ్డలితో నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన అప్పారావుతో ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన దేవి అలియాస్ భవానీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమార్తె ఆదిలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు రాము ఉన్నారు. అప్పారావుకు దేవి మేనత్త కూతురు. కొన్నినెలలుగా వేరే కాపురం పెట్టమంటూ భర్తను అడుగుతోంది. అప్పారావు ఒకడే కుమారుడు కావడం తల్లి, చెల్లి బాధ్యత తనపై ఉండడంతో దానికి ససేమిరా అనేవాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన దేవిని గ్రామ పెద్దలు ఒప్పించడంతో వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది. రొయ్యల కంపెనీలో పనిచేసే అప్పారావును అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని, అప్పుల భారం అధికంగా ఉండడంతో భార్యను ఉద్యోగానికి వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఆదివారం ఉదయం తల్లి సత్యవతి, చెల్లి దుర్గాదేవి రొయ్యల పరిశ్రమలో పనికి వెళ్లిన అనంతరం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అప్పారావు హత్యకు గురయ్యాడు. పిల్లలు లేచి చూసేసరికి తండ్రి నెత్తుటి మడుగులో ఉండడం, తల్లి కనిపించకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అప్పారావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయం 11 గంటల ప్రాంతంలో కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై ఎస్.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ నిద్రలో ఉన్న అప్పారావు తలను దేవి గొడ్డలితో ఘోరంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. నిందితురాలు దేవి పరారీలో ఉందని ఆమెపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
అనుమానించాడు.. దారుణంగా హతమార్చాడు
లింగసముద్రం: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొటికలపూడి నరసింహం, రమణమ్మ (47) భార్యభర్తలు. నరసింహం ప్రతి రోజూ మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధ పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. రమణమ్మ కేకలు విని చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆమె మరణించడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నరసింహాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా రమణమ్మను తానే హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి నలుగురు అబ్బాయిలు. ఇద్దరికి వివాహమవ్వగా మరో ఇద్దరు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నారు. -
భార్యాభర్తలు పడిపోతున్నారు.. పట్టుకోండి పట్టుకోండి
మాస్కో: భార్య-భర్తల మధ్య గొడవలు కామన్. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఇద్దరు దంపతులు గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో భార్యభర్తలు ఓల్గా వోల్కోవా, కార్లాగిన్ నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో ఉన్న దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త ముదరడంతో ఇద్దరు తన్నుకునేదాకా వెళ్లింది. అయితే ఆ గొడవ శృతిమించడంతో అదుపు తప్పి బాల్కనీ నుంచి జారి కిందపడ్డారు. అదే సమయంలో ఆఫీస్‌కు వెళుతున్న డెనీస్.. వారిని కాపాడేందుకు పడిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండని కేకలు వేశాడు. అతని స్నేహితుడు జారి పడుతున్న బాధితుల్ని వీడియోలు తీయడంతో, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా డెనీస్ మాట్లాడుతూ భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడినట్లున్నారు. కిందపడిన వాళ్లిద్దరిని కాపాడేందుకు డాక్టర్లు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీశాం. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందంటూ స్థానిక మీడియాకు వెల్లడించాడు. చదవండి : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు -
కాపురానికి తీసుకెళ్లడం లేదని ..
కొండమల్లేపల్లి (దేవరకొండ) : ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను.. కాపురానికి తీసుకెళ్లడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన మాచర్ల విజయ అదే గ్రామానికి చెందిన పిరాటి శంకర్లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఇద్దరి కులాలు వేరైనప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ 27న నల్లగొండలోని ఛాయాసోమేశ్వర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజల పాటు హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో స్వగ్రామానికి శంకర్ తిరిగొచ్చాడు. అప్పటి నుంచి తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఇదేంటని ప్రశ్నిస్తే తమ కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారని శంకర్ విజయకు తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన విజయ దేవరకొండ పోలీసులను ఆశ్రయించగా శంకర్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ శంకర్ కాపురానికి తీసుకెళ్లేందుకు ససేమిరా అనడంతో విజయ సోమవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్తను తనను కలపి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజయ కోరుతుంది. -
భార్యపై భర్త హత్యాయత్నం
పెద్ద అడిశరపల్లి : అనుమానం పెనుభూతమైంది.. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు.. బంధువుల ఇంటికి తీసుకెళ్తూ మార్గమధ్యలో బీరుసీసాతో గొంతుకోసి పోలీసులకు లొంగిపోయాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలో బుధవారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాకు చెందిన సబావట్ శంకర్ హైదరాబాదులో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం చందంపేట మండలం కేతెపల్లికి చెందిన వినోదను రెండోపెళ్లి చేసుకున్నాడు. శంకర్ ఒక్కడే హైదరాబాద్‌లో ఉంటుండగా వినోద నక్కలగండితండాలోనే ఉంటోంది. అప్పుడప్పుడు శంకర్ వచ్చి వెళ్తుంటాడు. ఆరు నెలల క్రితం దంపతులకు కుమారుడు జన్మించాడు. బంధువు ఇంటికి వెళ్తూ.. శంకర్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. కొద్ది రోజులుగా దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే మంగళవారం దంపతులిద్దరూ తమ కుమారుడిని తీసుకుని పీఏపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామపంచాయతీ పరిధి మాదాలబండతండాలో నివాసముంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. కొండమల్లెపల్లిలో బస్సు ఎక్కి నల్లగొండ రోడ్డులో మైలాపురం సమీపంలో బస్‌స్టాప్ వద్ద దిగారు. అప్పటికే దంపతులిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మద్యం మత్తులో ఉన్న శంకర్ బీరుసీసాను పగులగొట్టి వినోద గొంతులో పొడిచాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. శంక ర్ తన ఆరునెలల కుమారుడిని ఎత్తుకుని రాత్రి పది గంటల ప్రాంతంలో గుడిపల్లి పోలీస్‌స్టేషన్ వచ్చి తన భార్యను హత్య చేసినట్టు చెప్పాడు. కాగా, కొద్ది సేపటికి స్పృహలోకి వచ్చిన వినోద నేరుగా మాదాలబండతండాకు చేరుకుంది. జరిగిన విషయాన్ని వివరించడంతో ఆమెను దేవరకొండ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. బుధవారం వినోద తండ్రి వడ్త్యా పాండు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఏ.భోజ్యా తెలిపారు. మొదటి భార్యను కడతేర్చా.. పోలీసుల అదుపులో ఉన్న శంకర్ తనకు ఎనిమిదేళ్ల క్రితమే వివాహం జరిగిందని, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని చెప్పాడు. అనుమానంతోనే మొదటి భార్యను కూడా హత్య చేసినట్టు పోలీసులకు చెప్పాడు. అయితే మొదటి భార్య పేరు వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.