అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను.. | Husband Stabs Wife To Death For Property In Jagtial District | Sakshi
Sakshi News home page

అప్పుడు కొడుకును.. ఇప్పుడు భార్యను..

Published Mon, Dec 19 2022 2:35 AM | Last Updated on Mon, Dec 19 2022 2:35 AM

Husband Stabs Wife To Death For Property In Jagtial District - Sakshi

గంగవ్వ 

పెగడపల్లి(ధర్మపురి): డబ్బు కోసం, పొలంలో వాటా కోసం కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపాడు... కూతురిపై కూడా దాడి చేసేందుకు యత్నించేలోగా ఆమె పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. గతంలో కొడుకును హత్య చేసి ఆ కేసులో జైలుకెళ్లి వచ్చి ఇప్పుడు భార్యను పొట్టనబెట్టుకున్న ఓ కర్కోటకుడి నిర్వాకం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట  గ్రామంలో ఆదివారం కలకలం రేపింది.

సీఐ వెంకట రమణమూర్తి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నక్క రమేశ్‌–గంగవ్వ(45) దంపతులు. వీరికి కుమారుడు జలేందర్, కూతురు స్నేహ ఉన్నారు. రమేశ్‌ ఉపాధి కోసం గతంలో దుబాయి వెళ్లివచ్చాడు. అక్కడ సంపాదించిన డబ్బు విషయంలో రమేశ్, గంగవ్వ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 2019 నవంబర్‌లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మధ్యలో వారించిన కొడుకు జలేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు రమేశ్‌.

ఈ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. అప్పట్నుంచి భార్య, భర్త వేర్వేరుగానే ఉంటున్నారు. తమకు ఉన్న వ్యవసాయ భూమిని ఇద్దరూ  వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. అయితే, గంగవ్వ సాగు చేసుకుంటున్న భూమి తనకే ఇవ్వాలని రమేశ్‌ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేయాలని పథకం పన్నాడు. ఆదివారం గంగవ్వ, ఆమె కూతురు స్నేహ  పొలంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు.

విషయం తెలిసి రమేశ్‌.. పొలం వద్దకు వెళ్లి.. కత్తితో భార్య గంగవ్వపై దాడి చేశాడు. కూతురు స్నేహ అడ్డుకునేందుకు యత్నించగా ఆమెపైనా దాడికి యత్నించాడు. కూతురు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. భార్య గంగవ్వను కత్తితో కడుపు, వీపు భాగంలో గట్టిగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రమేశ్‌ పరారీలో ఉన్నాడనీ మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement