పట్నా హైకోర్టు స్పష్టికరణ
పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌కుమార్‌గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది.
అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్ గుప్తా, సహదేవ్ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు.
అందుకు జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment