రాయచోటి టౌన్: మద్యానికి బానిసైన భర్త వెంకటరమణ కట్టుకున్న భార్య లక్ష్మిదేవి (52)ని కడతేర్చాడు. గొంతు కోసి కిరాతకంగా చంపేసి పరారయ్యాడు. ఈ సంఘటన రాయచోటిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చిన్నగోళ్ల వెంకటరమణ, లక్ష్మిదేవి అనే దంపతులు మదనపల్లె తంబళ్లపల్లె నుంచి పదేళ్ల క్రితం రాయచోటి రెడ్డీస్ కాలనీకి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె సుమతిని రాయచోటికి చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సుధాకర్‌కు వేరే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం చేశారు. కాగా రాయచోటిలో లక్ష్మిదేవి చిన్న పాటి టిఫెన్ సెంటర్ నడుపుతుండేది. సుధాకర్ కూడా అదే ప్రాంతంలో టిఫెన్ సెంటర్ పెట్టుకొని వేరు కాపురం ఉంటున్నారు. కొన్నేళ్ల తర్వాత వెంకటరమణ రెడ్డీస్ కాలనీలో ఓ ఇంటిని కొన్నాడు. ఆ ఇంటిలో మిద్దెపైన వెంకటరమణ, లక్ష్మిదేవి దంపతులు ఉండగా.. కింద ఇంటిలో వారి కుమారుడు సుధాకర్, కోడలు ఉంటున్నారు.
వెంకటరమణ తల్లి కూడా ఆయనతోపాటే ఉండేది.. నాలుగు నెలల క్రితం ఆమె తంబళ్లపల్లెలో ఉంటున్న తన పెద్ద కుమారుడు వద్దకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ‘అమ్మను నా వద్ద లేకుండా చేస్తావా.. నీ అంతు చూస్తా..’ అంటూ అన్నతో వెంకటరమణ గొడవపడేవాడు. కొద్దిరోజులకు మద్యానికి బానిసయ్యాడు. ‘మా అమ్మకు అన్నం పెట్టడం లేదు.. అందుకే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది..’ అంటూ భార్య లక్ష్మి దేవితో గొడవ పడుతుండేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలని ఆమెతో తరచూ వాదులాటకు దిగేవాడు.
కొద్దిరోజులుగా మతిస్థిమితం లేనివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మంగళవారం రాత్రి కూడా భార్యతో వెంకటరమణ తాగి వచ్చి గొడవపడ్డాడు. అర్ధరాత్రి ఆమెను గొంతుకోసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా.. రోజు మాదిరే సుధాకర్ బుధవారం తెల్లవారుజామున తన ఇంటిలోని వంట సామగ్రితో టిఫెన్ సెంటర్‌కు వెళుతూ.. ‘మా అమ్మను కూడా పిలుచుకుని రా..’ అని భార్యతో చెప్పి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె మిద్దెపైన ఉన్న అత్తను పిలుద్దామని వెళ్లింది. వాకిలి తీసే ఉంది. లోపలికి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో అత్త లక్ష్మిదేవి పడిఉంది. వెంటనే భర్త సుధాకర్‌కు ఈ విషయం చెప్పింది. అతడు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. స్థానికులు ఆమె చనిపోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. మద్యానికి బానిసైన తన తండ్రి .. తల్లిని చంపేశాడని బోరున విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment