మత్స్యకారులను ఆదుకుంటున్నాం.. 'అండగా ఉన్నాం' | CM YS Jagan Releases Funds To Fisherman families | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను ఆదుకుంటున్నాం.. 'అండగా ఉన్నాం'

Published Wed, Nov 22 2023 3:59 AM | Last Updated on Wed, Nov 22 2023 3:59 AM

CM YS Jagan Releases Funds To Fisherman families - Sakshi

మనకన్నా ముందు చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు పాలన చేసినా కూడా కనీసం జీఎస్‌పీసీ పరిహారం ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన కూడా చేయలేకపోయింది. ఈ డబ్బులు పడకపోతే ఆ మత్స్యకార కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి? వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఆలోచన కూడా గతంలో జరగలేదు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: ‘ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నాం. అడుగడుగునా వారికి అండగా నిలిచాం. ఈ నాలుగున్నర ఏళ్లలో వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఎన్నో చేశాం.. మరెన్నో చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఓఎన్జీసీ సంస్థ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ. 11,500 వంతున 6 నెలలకుగానూ రూ. 69 వేల చొప్పున రూ. 161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..  

ఆర్థిక సాయం పంపిణీ ఆగకూడదనే.. 
ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపు కోవాలని అనుకున్నాం. వర్షాల వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. అయితే మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపులైన్‌ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్‌ సరస్సు ముఖద్వారంలో పూడిక తీసి పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. వీలును బట్టి ఈ కార్యక్రమాన్ని నెలాఖరులోనో లేదా వచ్చే నెలలోనో చేసేందుకు చర్యలు తీసుకుంటాం.  

ఇప్పించాలన్న మనసు ఉండాలి కదా 
కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 2012లో జీఎస్‌పీసీ ఇదే రకమైన కార్యక్రమం చేయడం వలన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. రూ. 78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు తొలుత ప్రభుత్వం నుంచి మనమే ఇచ్చేశాం. ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బును వెనక్కి రప్పించుకోగలిగాం.

ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుందనడానికి జీఎస్‌పీసీ పరిహారం చెల్లింపు ఉదంతమే నిదర్శనం. ఇవాళ కూడా ఉభయగోదావరి జిల్లాల్లో ఓఎన్జీసీ పైప్‌లైన్‌ పనుల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. క్రమం తప్పకుండా ఏటా నష్టపరిహారం వచ్చేటట్టుగా అడుగులు వేస్తున్నాం.   

వేగంగా స్పందించడంలో విశాఖ హార్బర్‌ ఘటనే ఉదాహరణ 
ఇవాళ మత్స్యకారుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో? ఎంత వేగంగా స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందో చెప్పడానికి నిన్న విశాఖపట్నం హార్బర్‌ ప్రమాద ఘటనే ఉదాహరణ. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వచ్చిన మరుక్షణమే వాళ్లను ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్‌ ఉందా? లేదా? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్‌ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని సంకల్పించాం. ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం.

ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేశాం. ఆ చెక్కులు ఈరోజే (మంగళవారం) పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఓఎన్జీసీ పైప్‌లైన్‌ బాధిత మత్స్యకారులకు నాలుగో విడత పరిహారం పంపిణీలో సహకరించిన, తోడుగా ఉన్న ఓఎన్జీసీ అధికారులకు మనస్ఫూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నాలుగు విడతల్లో రూ. 485.58 కోట్ల పరిహారం  
ఓఎన్జీసీ పైపులైన్‌ నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది కలిపి ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. నెలకు రూ. 11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

మత్స్యకారుల తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 విడతల్లో ఇప్పటికే రూ. 323.72 కోట్ల నష్టపరిహారం ఇప్పించాం. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలలకు సంబంధించి రూ. 161.86 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది. నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తున్న రూ. 161.86 కోట్లు కలుపుకొంటే మొత్తంగా రూ. 485.58 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం.  

దశాబ్దాల కల కార్యరూపం దాల్చుతోంది 
పులికాట్‌ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ అనేది ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల కల. ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. మీ దయతో అది జరుగుతోంది. లోకేశ్‌ ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు. కానీ మీరు వస్తున్నారనడంతో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. సీఎం గారు మీకు ధన్యవాదాలు. 
    – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే 

మా జీవితాల్లో వెలుగులొచ్చాయి 
ఈరోజు మాకు పండుగ రోజు. నష్టపరిహారం డబ్బులు వ­స్తాయా? రావా? అనుకున్నాం కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక వరుస గా నాలుగో విడత అందుకుంటున్నాం. పరిహారం నేరుగా మా అకౌంట్లో వేస్తున్నారు. మీరు దేవుడిలా మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు డీజిల్‌ సబ్సిడీ రూ.9 వస్తోంది. ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారులకు బీమా కింద గతంలో మృతదేహం కనిపిస్తేనే రూ.5 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు మృతదేహంతో సంబంధం లేకుండా రూ. 10 లక్షలు ఖాతాలో జమచేస్తున్నారు. మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మేం గతంలో ఇలా లబ్ధిపొందలేదు. 
    – చినబోతు భైరవస్వామి, లబ్ధిదారుడు, మట్లపాలెం, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా 

మమ్మల్ని గుర్తించింది మీరే.. 
మమ్మల్ని గుర్తించింది మీరే అన్నా. గతంలో మత్స్యకారులు ఎక్కడున్నారో తెలిసేది కాదు. వైఎస్సార్‌ హయాంలో మాకు ఎంతో లబ్ధి జరిగింది. తర్వాత మమ్మల్ని ఆదుకున్న వాళ్లు లేరు. మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు. సీఎం అవగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. మీరు మాకు పరిహారం ఇప్పిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. డీజిల్‌ మీద సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా ఇలా చాలా సాయం చేస్తున్నారు. మాకు తెలియని పథకాలు కూడా పెట్టి మమ్మల్ని ఆదుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు రుణపడి ఉంటామన్నా.   
    – పల్లెపు రాంబాబు, ముమ్మిడివరం మండలం, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement