![Fisherman Families About Thandel Movie](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/4155.jpg.webp?itok=y8112J8Y)
కె.మత్స్యలేశం వాసి మూగి గురుమూర్తి
శ్రీకాకుళం అర్బన్: తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో సన్నివేశాలు చూపలేదని కె.మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రీల్ స్టోరీ తీశారే తప్ప రియల్ స్టోరీ తీయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారన్నారు. అనంతరం 22 మంది మత్స్యకారులతో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు
శ్రీకాకుళం అర్బన్: ‘తండేల్’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సినిమా చిత్ర కథా రచయిత తీడ కార్తీక్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్‌వీసీ థియేటర్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా విజయంతో వచ్చిన సౌండ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు.
సక్సెస్ మీట్‌కు చిత్ర యూనిట్ మొత్తం త్వరలోనే శ్రీకాకుళం రానుందని తెలిపారు. మత్స్యకారుడు గనగళ్ల రామారావు మాట్లాడుతూ పాకిస్తాన్‌లో తాము పడిన ఇబ్బందులు, బాధలను దర్శకుడు చందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. బందీగా ఉన్న సమయంలో అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయన్నారు. సమావేశంలో ఎస్‌వీసీ థియేటర్ మేనేజర్ రవి, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment