
రబీలోనూ రైతులకు మొండిచెయ్యి
లక్ష్యం 9 వేల కోట్లు.. బ్యాంకులిచ్చింది 2 వేల కోట్లు
♦ కాడి పడేయడంతో గణనీయంగా తగ్గిపోయిన సాగు విస్తీర్ణం
♦ రుణాలందక రైతుల తిప్పలు.. పట్టించుకోని ప్రభుత్వం
♦ కరువు సాయంపైనా మీనమేషాలు
♦ ‘మాఫీ’ సొమ్ము అందకే రుణాలివ్వడం లేదంటున్న బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌ను కరువు మింగింది.. వేసిన పంటలు వేసినట్టే మట్టిపాలయ్యాయి.. నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.. కనీసం రబీలోనైనా గట్టెక్కుదామనుకున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి! రైతులకు ఉదారంగా రుణాలిచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు చేతులెత్తేశాయి. రుణాలిప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రబీలో రైతులకు బ్యాంకుల ద్వారా రూ.9,707 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లే ఇచ్చారు. దీంతో అన్నదాత కాడి కిందపడేశాడు. ఫలితంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడతల వారీగా ఇస్తుండడం వల్లే లక్ష్యం మేరకు రుణాలు అందించలేకపోతున్నామని బ్యాంకులు చెబుతున్నాయి.
రబీలో మరీ దా‘రుణం’
రాష్ట్రంలో 35.82 లక్షల మంది రుణమాఫీ లబ్ధిదారులున్నారు. అందులో 2015-16 ఖరీఫ్‌లో 23.75 లక్షల మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన 12.07 లక్షల మంది రైతులకు కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి. ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.18,032 కోట్లు కాగా... బ్యాంకులు రూ. 14 వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. అలాగే రబీ పంట రుణ లక్ష్యం రూ.9,707 కోట్లు కాగా... ఇప్పటివరకు బ్యాంకులు కేవలం రూ.2 వేల కోట్ల వరకే ఇచ్చాయి. అంటే.. లక్ష్యంలో కేవలం 20 శాతం అన్నమాట! సుమారు లక్షన్నర మంది రైతులు మాత్రమే రబీలో రుణాలు అందుకున్నట్లు సమాచారం. అదీగాక అనేక చోట్ల ప్రభుత్వం చెల్లించని రుణమాఫీ సొమ్మును బ్యాంకులు రైతుల నుంచి రాబడుతున్నాయి. మరికొందరి నుంచి ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రుణమాఫీపై సర్కారు వైఖరి వల్లే..
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు మాఫీ ప్రకటించింది. ఆ ప్రకారం రూ. 17 వేల కోట్లు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయిం చింది. 35.82 లక్షల రైతు ఖాతాలను గుర్తిం చింది. మొదటి విడతగా రూ. 4,230 కోట్లు మాఫీ ప్రకటించింది. ఆ మొత్తం జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో ఇప్పటివరకు రూ.4,086 కోట్లు రైతుల ఖాతాలో మాఫీ చేసినట్లు బ్యాంకులు తెలిపాయి. ఆ తర్వాత రెండో విడత రుణమాఫీ కింద ప్రభుత్వం 2 విడతలుగా మరో రూ.4,086 కోట్లు విడుదల చేసింది. ఇలా విడతల వారీగా సొమ్ము విడుదల చేస్తుండటంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. కొందరు రైతుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై దుమారం రేగినా ప్రభుత్వం స్పందించడం లేదు. మిగిలిన రెండు విడతల రుణమాఫీ సొమ్మును ఒకేసారి విడుదల చేస్తామని చెప్పినా.. ఆ తర్వాత అది సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. దీంతో రుణాలివ్వడానికి బ్యాంకులు రుణాలివ్వబోమని రైతులకు తెగేసి చెబుతున్నాయి. మరికొన్ని బ్యాంకులైతే ఇప్పటికీ రూ.లక్ష రూపాయల లోపు రుణాలకు వడ్డీ వసూలు చేస్తున్నాయి.
రబీ సాగు సగమే..:తెలంగాణలో రబీ సాగు విస్తీర్ణం ఇప్పటికీ 54% మించలేదు. రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా.. 16.87 లక్షల ఎకరాల్లో (54%) మాత్రమే సాగు జరిగింది. అందులో సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో జరగాల్సిన వరిసాగు 5.57 లక్షల ఎకరాల్లోనే సాగింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నా బ్యాంకులు ఆర్థికంగా సహకరించడం లేదు.
జాడ లేని ఇన్‌పుట్ సబ్సిడీ
ఒకవైపు బ్యాంకులు రుణాలివ్వక రైతులను ఇబ్బందికి గురిచేస్తుంటే... మరోవైపు ప్రభుత్వం కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదు. కరువు సాయంగా రాష్ట్రానికి రూ.791 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిం చింది. కానీ ఇప్పటికీ ఆ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీ ఊసెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం దాటవేస్తోంది. ఇప్పటికీ పంట నష్టపోయిన రైతుల జాబితాలను సిద్ధం చేయకుండా వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. సగానికిపైగా జిల్లాల నుంచి ఈ జాబితాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.