ఏడిపిస్తున్న యెవుసం.. | farmers are concerned on rabi season | Sakshi
Sakshi News home page

ఏడిపిస్తున్న యెవుసం..

Published Sat, Dec 13 2014 2:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఏడిపిస్తున్న యెవుసం.. - Sakshi

ఏడిపిస్తున్న యెవుసం..

నేల తల్లిని నమ్ముకుని బతుకు ఈడుస్తున్న రైతుకు కష్టకాలం వచ్చి పడింది. కాడిని వదిలి కూలీగా మారాల్సిన దుస్థితి వచ్చింది. ఏటా అతివృష్టి.. అనావృష్టి.. ఏదో ఒకదాని బారిన పడుతూ నష్టాలను చవిచూస్తున్నారు. సాగుకు దిగుదామంటే బ్యాంకులు రుణాలివ్వక.. వరుణుడు కరుణించక.. ప్రభుత్వాలూ ఆదుకోక.. ఆందోళన చెందుతున్నారు. పంట కోసం చేసిన అప్పుల కుంపటిని వేగలేక ‘చితి’కి పోతున్నారు. కొత్త అప్పు చేయలేక.. చేద్దామన్నా ఇచ్చేవారు లేక సాగుకు గుడ్‌బై చెబుతున్నారు.

ఖరీఫ్‌లో నష్టాలనే ఎదుర్కొన్న రైతులు రబీ సాగుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికీ  రుణాలు లేక.. కరెంటు కోతలు భరించలేక.. ప్రాజెక్టుల నుంచి నీరొచ్చే మార్గం లేక వ్యవసాయ శాఖ వేసిన అంచనా తారుమారైంది. 90 వేల హెక్టార్లు సాగు చేస్తారనుకుంటే 19 వేల హెక్టార్లకే పరిమితం కావడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో అన్నదాతను ఈ ఏడాది ప్రారంభం నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. గతేడాది అతివృష్టితో నష్టపోతే ఈ ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సాగు నుంచి ప్రారంభమైన కష్టాలు.. రబీలోనూ తప్పడం లేదు. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో రుతు పవనాలు వస్తే ఈ ఏడాది రెండున్నర నెలల పాటు ఆలస్యంగా వచ్చాయి. వాతావరణ శాఖ వారు ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం జూన్ మాసంలో విత్తనాలు వేసుకున్న రైతులు వర్షాలు కురవక వేసిన విత్తనాలు ఎండకు మాడిపోయాయి.

ఇలా జిల్లాలో రెండు నుంచి మూడేసి సార్లు రైతులు విత్తనాలను విత్తుకున్నారు. ఖరీఫ్ కష్టాలను ఎదుర్కొని తీవ్ర నష్టాల్లో మునిగిన రైతన్న రబీ సాగులో వ్యవసాయమంటేనే నిరసక్తత చూపుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలో ఈ ఏడాది రబీలో 90,110 హెక్టార్లలో సాగువుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ.. ఇప్పటివరకు 19 వేల 434 హెక్టార్లలో మాత్రమే సాగైంది.
 
సాగు సమయం గడుస్తున్నా..
రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా సగం వరకు కూడా సాగు కాకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం. గతేడాది ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో సాగవ్వగా ఈసారి ఇప్పటి వరకు 19 వేల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆరుతడి పంటలు సాగు వేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం సాగు చేయడానికి సాహసించడం లేదు. పంటల సాగుకు పూ ర్తి పదును, వర్షాలు లేకపోవడం, మరోపక్క చెరువులు, కుంటలు, డ్యామ్‌లలో నీరు అడుగంటడం, దీనికితోడు వేసవిలో వచ్చే విద్యుత్ కోతలు ఇప్పటి నుంచే అమలవుతుండడం.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున రబీ సాగుకు రైతన్నలు ముందడుగు వేయడంలేదు.

దీనికితోడు డిసెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షాపాతం 1088.6 మిల్లీమీటర్లకు గాను 734.9 మి.మీ కురిసింది. 33 శాతం లోటు వర్షాపాతం నమోదైంది. ఫలితంగా భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పంటలు సాగు చేసి నష్టపోవడంకంటే సాగు చేయకపోతేనే మేలని రైతులు భావిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గతేడాది రబీలో లక్ష హెక్టార్ల వరకు సాగవ్వగా.. ఈ ఏడాది మొత్తం సాగు ఈ రబీలో 25 వేల హెక్టార్లు దాటేలా లేదు.
 
బోసిపోతున్న జలాశయాలు..
గతేడాది అధిక వర్షాలతో జలకళ సంతరించుకున్న జలాశయాలు.. ఈ ఏడాది బోసిపోతున్నాయి. గత ఖరీఫ్‌లో అతివృష్టితో నీటి నిల్వలు పెరిగిపోయి దిగువ ప్రాంతానికి లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణం కంటే తక్కువగా కురవడంతో రబీ సాగుకు పంటలకు నీరు అందించే స్వర్ణ ప్రాజెక్టు నుంచీ నీరు అందించలేని పరిస్థితి దాపురించింది. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద వేల హెక్టార్లలో సాగవ్వాల్సిన పంటలు వందల హెక్టార్లకు పడిపోయాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement