రైతునెత్తిన ‘వడ్డీ’బండ | doubt about on Debt waiver | Sakshi
Sakshi News home page

రైతునెత్తిన ‘వడ్డీ’బండ

Published Tue, Jul 1 2014 3:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతునెత్తిన ‘వడ్డీ’బండ - Sakshi

రైతునెత్తిన ‘వడ్డీ’బండ

 ‘కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడి’ందన్న చందంగా తయారయింది చంద్రబాబు నాయుడు హామీని నమ్మిన రైతన్నల పరిస్థితి. రుణాలు చెల్లించవద్దంటూ బహిరంగంగా పిలుపివ్వడంతో అదంతా నిజం అనుకొని బ్యాంకుల జోలికి వెళ్లకుండా ఓట్లు కుమ్మరించిన అన్నదాతలకు అడియాశలే మిగిలాయి. ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డా’మని తెలుసుకున్న హలధారులు హాహాకారాలు చేస్తున్నారు. ‘మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు కొట్ట’మన్నట్టుగా బాబు నైజం బయటపడుతుండడంతో విజయహాసం చిందించిన తెలుగు తమ్ముళ్లు ప్రజలకు మొహం చాటేస్తున్నారు.  
 
సాక్షి, ఒంగోలు: అన్నదాతకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కొత్త ప్రభుత్వం తొలిసంతకం రైతుకు మేలు చేయకపోగా.. ముప్పు తిప్పలు పెడుతోంది. పాత రుణాల మాఫీతో కొత్తగా ఖరీఫ్ సాగు పెట్టుబడులొస్తాయని ఆశించిన రైతుకు భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల కింద బ్యాంకుల నుంచి తీసుకున్న వాటి చెల్లింపునకు జూన్ 30వ తేదీతో గడువు తీరింది. అంటే, జూలై ఒకటో తేదీ నుంచి ప్రతీరైతుపై గడువు మీరిన బకాయి వడ్డీ భారం పడుతుంది.
 
రిజర్వుబ్యాంకు, ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్‌లెవల్ బ్యాంకర్ల కమిటీ) నిబంధనల మేరకు పంటరుణం తీసుకున్న ఏడాదిలోపు చెల్లించిన వారికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వడ్డీరాయితీ పథకం వర్తిస్తోంది. ఆ మేరకు రైతు తాను తీసుకున్న రుణంపై 7 శాతం వడ్డీమాత్రమే చెల్లించేవాడు. అయితే, గడువు మీరిన బకాయిపై కచ్చితంగా 11.07 శాతం వడ్డీ చెల్లించాల్సిందే.. రుణం తీసుకున్న నాటి నుంచి ఇదేవడ్డీ లెక్కను బ్యాంకర్లు వర్తింపజేయనున్నారు.
 
మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు రికవరీనే లక్ష్యంగా తమపని తాము చేసుకుపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే గడువు మీరిన బకాయిలకు సంబంధించి రికవరీ నోటీసుల జారీకి సన్నాహాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎన్నికల అజెండా హామీ ప్రకారం తొలిసంతకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తారా..? మొండిచేయి చూపిస్తారా..? అనే సందేహాలతో రైతుసంఘాల నేతలు ఉద్యమాలకు సిద్ధపడుతున్నారు.
 
5 లక్షల మంది ఎదురు చూపులు:

జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలు రైతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరిలో 5 లక్షల మంది రైతులు బ్యాంకు అకౌంట్లు కలిగి.. వివిధ జాతీయ బ్యాంకులతో పాటు జిల్లా సహకార, అర్బన్ బ్యాంకుల్లో  దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్నారు. మొత్తం వాయిదాల మీదనున్న బకాయిలు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.3 వేల కోట్లు ఉండగా, కిందటేడాది ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2600 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. అంటే, మొత్తం రూ.5,600 కోట్ల విలువైన రైతురుణాలు మాఫీ కావాల్సి ఉంది.
 
బ్యాంకర్ల అభిప్రాయం మేరకు రైతు రుణమాఫీ పథకం గడువు మీరిన బకాయిలకే వర్తిస్తోందని.. రెగ్యులర్ బకాయిల మాఫీ కుదరదని చెబుతున్నారు. దీంతో రైతులు కిందటేడాది పంట రుణాలు చెల్లిస్తేనే..  ఖరీఫ్ సాగు పెట్టుబడికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం హామీపై నమ్మకం పెట్టుకున్న రైతులంతా బ్యాంకులకు కిందటేడాది తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించలేదు. ఫలితంగా వారికి వడ్డీరాయితీ వర్తించకపోగా.. అసలు రుణ మొత్తంతో పాటు 11.07 శాతం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.గ్రామాల్లో చాలామంది రైతులు ఇప్పటికే బయట తెచ్చిన అప్పులకు సంబంధించి వడ్డీలకు వడ్డీలు కడుతూ ఆర్థికభారంతో కునారిల్లుతున్నారు.
 
సహకార బ్యాంకుల బకాయిలిలా...
జిల్లాలో 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే రూ. 488.67 కోట్ల మేరకు లబ్ధి చేకూరుతుంది. మార్చి ఆఖరు వరకు సేక రించిన గణాంకాల ప్రకారం బ్యాంకుల పరిధిలో స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు తీసుకున్న 85,198 మంది రైతులు మొత్తం రూ.426.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరిలో గడువుమీరిన బకాయిదారులు 28,611 మంది ఉండగా...చెల్లించాల్సిన బకాాయిలు రూ.93.16 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక, భూమి తనఖా, ఈపీఏడీబీ కింద 15,427 మంది రైతులు మొత్తం రూ.63.19 కోట్లు బకాయిలు పడ్డారు. పీడీసీసీబీ రుణాల మాఫీ జరిగితే.. మొత్తం 1,00,625 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ ప్రకటనల నాటి నుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని.. బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement