‘అనంత’ విషాదంలో అన్నదాత
* అనంతపురం జిల్లాలో ఆత్మహత్యల పరంపర
* అప్పులు తీర్చే దారిలేక.. మూడు నెలల్లోనే 17 మంది బలవన్మరణం
* మృతుల కుటుంబాలను పట్టించుకోని ప్రభుత్వం
(బి. గణేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, అనంతపురం): కరువుతో అల్లాడే అనంతపురం జిల్లాలో అన్నదాతను ఆదుకొనేవారే కరువయ్యారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిళ్లకు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఓవైపు.. అప్పులు చేసి పంటలు పండించిన రైతులు బికారులవుతున్నారు. కూలి పనులకు వెళ్లినా కుటుంబ పోషణే గగనమైపోతోంది. మరోపక్క అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు.
ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ రైతుల్లో ఎన్నో ఆశలు కలగజేసింది. అందుకే రాష్ట్రంలో పశ్చిమ గోదావరి తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లను జిల్లా ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. పశ్చిమ గోదావరి అత్యధిక పంట రుణాలు ఉన్న జిల్లా కాగా, అనంతపురం తీవ్రమైన కరువు ప్రాంతం. అందుకే ఈ రెండు జిల్లాల ప్రజలు చంద్రబాబుపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. బాబు ప్రభుత్వం వచ్చి మూడు నెలలైనా ఇప్పటివరకు రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. అప్పులెలా తీర్చాలో తెలియని రైతన్న చివరకు ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఇటీవలి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అయినా అధికారపార్టీ నేతలు, అధికారుల్లో కదలిక లేదు. రైతన్నకు భరోసా కల్పించే ప్రయత్నమే జరగడంలేదు. రైతు కుటుంబాలకు సాయం చేసేందుకు ఉద్దేశించిన జీవో 421 జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. అసలు ఈ 17 ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలే ఇంతవరకూ కలెక్టరేట్‌లో నమోదు కాలేదు. ఇప్పటివరకు డివిజన్ స్థాయి కమిటీ బాధిత కుటుం బాల్లో రెండింటిని మాత్రమే కలిసింది. అం దులో డి హీరేహాళ్ మండలం కడలూరులో ఈ నెల 6న ఆత్మహత్యకు పాల్పడిన బోయ ఈరన్న కడుపు నొప్పి కారణంగా బలవన్మరణం పొందాడని, అప్పుల బాధ కాదని కళ్యాణదుర్గం ఆర్డీవో ప్రకటన ఇచ్చారు. పామిడి మండలం పి కొండాపురంలో కె. శివారెడ్డి అనే రైతు ఈ నెల 1న ఆత్మహత్య చేసుకోగా, ఈ కుటుంబాన్ని అనంతపురం ఆర్డీవో బృందం 16 రోజుల అనంతరం ఈ నెల 17న వివరాలు నమోదు చేసుకుంది. ఇంతవరకూ సహాయం అందజేయలేదు.బాధిత కుటుంబాలను ఏ అధికారీ పలకరించలేదు.
421 జీవోను మరిచారా
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మానవీయ కోణంలో ఇచ్చిన జీవో 421 ఇప్పుడు అమలు కావడంలేదు. ఈ జీవో ప్రకారం.. రైతు ఆత్మహత్యకు పాల్పడితే వెంటనే ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీతో కూడిన బృందం ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. మరణించిన రైతుకు ఉన్న అప్పుల జాబితాను రచ్చబండ వద్దే తయారుచేయాలి. రూ. 50 వేలు ‘వన్ టైం సెటిల్‌మెంట్’ కింద చెల్లించాలి. మరో రూ. లక్ష రైతు కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మార్వో పేరిట జాయింట్ అకౌంట్‌లో జమ చేయాలి. ఈ డబ్బు ఆ రైతు కుటుంబం వ్యవసాయ పనులకు ఉపయోగించుకునేలా చూడాలి. ఈ విషయంలో వైఎస్ ఒక వారం సమయం తీసుకోవడాన్ని కూడా ‘చాలా ఆలస్యం’గా పరిగణించారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.