* ప్రధానమంత్రి పంటల బీమా పథకం గడువు పూర్తి
* 35 శాతం కూడా పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: పంటల బీమా ప్రమాదంలో పడింది. బ్యాంకులు సహకరించకపోవడంతో అది రైతుకు ధీమా ఇవ్వలేకపోతోంది. ఖరీఫ్‌లో బ్యాంకులు పూర్తిస్థాయిలో పంట రుణాలు ఇవ్వకపోవడంతో అనేకమంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పంటల బీమాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం(పీఎంఎఫ్‌బీవై) కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం గడువు ఆదివారం ముగి యడంతో వ్యవసాయశాఖ ఆందోళన చెందుతోంది.
బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నా, తీసుకోకపోయినా గడువులోగా ప్రీమియం చెల్లించిన రైతుల పంటలకే బీమా వర్తిస్తుంది. బ్యాంకులు 35 శాతం మంది రైతులకు కూడా రుణాలు ఇవ్వలేదు. అయితే, రైతులందరికీ రుణాలు ఇచ్చినా, ఇవ్వకున్నా వారి రుణ ఖాతాల నుంచి ప్రీమి యం సొమ్మును జూలై 31లోగా మినహా యించుకోవాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. వెంటనే ప్రీమియం సొమ్ము ను మినహాయించుకున్నట్లు రైతు రుణఖాతాలో రాయాలని పేర్కొంది.
అయితే ఎన్ని బ్యాంకులు అలా మినహాయించుకున్నట్లు రాశాయో ఎవరికీ తెలియదు. కొన్నిచోట్ల పంట రుణాలు ఇవ్వడంలో విఫలమైనా, పంటల బీమా కోసం మాత్రం రైతు ఖాతాల్లోంచి ప్రీమియం సొమ్ము మినహాయించుకున్నట్లు సమాచారం.
రూ. 6 వేల కోట్లకు మించని రుణాలు
ఈ ఖరీఫ్‌లో రైతులకు రూ.17,460 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ, ఇప్పటివరకు రూ.6 వేల కోట్లకు మించి ఇవ్వలేదని వ్యవసాయశాఖ పేర్కొంది. పంట రుణం తీసుకున్న 35 శాతం మంది నుంచే పూర్తిస్థాయిలో బీమా ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించాయి.
రుణమాఫీ పథకం మూడో విడత కింద రూ.4,250 కోట్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2019.99 కోట్లే విడుదల చేసిందని, రుణమాఫీ నిధులు త్వరగా రాకపోవడం వల్లే పంట రుణాల పంపిణీలో జాప్యం జరిగిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఖరీఫ్ పంట రుణాల పంపిణీకి సెప్టెంబర్ 30 వరకు గడువుందని బ్యాంకులు చెబుతున్నాయి. రైతు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్మును బ్యాంకులు ముందస్తుగా బీమా కంపెనీలకు చెల్లించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందని రుణం.. దక్కని బీమా!
Published Mon, Aug 1 2016 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement