- ముగిసిన గడువు
- లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ
పంటల బీమా గడువు ముగిసింది. రుణమాఫీపై ప్రభుత్వం తేల్చకపోవడంతో జిల్లా రైతాంగం బీమా ప్రీమియం చెల్లించ లేకపోయింది. దీంతో జిల్లాలో ప్రతి ఏటా బీమా పరిధిలోకి వచ్చే సుమారు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు రైతులకు ఎంతో కొంత అండగా ఉంటున్న బీమా ఈసారి లే కుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ప్రతి ఏటా పంట రుణాల కింద రూ.వెయ్యి కోట్లు వరకు బ్యాంకులు ఇస్తున్నాయి. పంటల బీమా పరిధిలోకి వచ్చే వరి, చెరకు వంటి పంటలను సాగుచేస్తూ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్న రైతులు జిల్లాలో దాదాపు లక్షన్నర మంది వరకు ఉన్నారు. గతేడాది రూ.లక్ష అప్పు తీసుకున్న రైతు 5 శాతం ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది.
గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే గత రబీ సీజన్‌లో రూ.200 కోట్లు లక్ష్యానికి గాను 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. దీని ప్రకారం వీరంతా వీరంతా దాదాపుగా బీమా ప్రీమియం కింద రూ.37 కోట్లకుపైగా చెల్లించారు. వీరితో పాటు బ్యాంకు రుణాలు పొందని మరో 230 మంది రైతులు రూ.లక్షన్నర వరకు ప్రీమియం కట్టారు.
గడువు ముగియడంతో ఆందోళన
హెలెన్, లెహర్ తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనాలు వేశారు. మొత్తం 52,426 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇప్పటి వరకు బీమా పరిహారం రాకపోయినప్పటికీ వస్తుందనే ఆశ రైతుల్లో ఉంది. కానీ ఈసారి బీమా ప్రీమియంను ఆరు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జూలై 31వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. ప్రతి యేటా ఈ సమయానికి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీంతో రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకుల మినహాయించుకుంటాయి.
కానీ ఈసారి టీడీపీ రుణమాఫీ హామీ కారణంగా పరిస్థితి మారింది. సర్కారు నాన్చుడి ధోరణి వల్ల రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా బ్యాంకులు ఇప్పటి వరకు రైతులకు సుమారుగా రూ.4 కోట్లు వరకు మాత్రమే రుణాలుగా అందించాయి. దీంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. గడువు పొడిగించని పక్షంలో రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతుంది.
సెప్టెంబర్ 15 వరకు గడువు పెంపు!
ముందు ప్రకటించిన విధంగా బీమా గడువు గత నెల 31తో ముగిసింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో బీమా గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు.