Lehar
-
రైతుకేదీ బీ(ధీ)మా!
ముగిసిన గడువు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ పంటల బీమా గడువు ముగిసింది. రుణమాఫీపై ప్రభుత్వం తేల్చకపోవడంతో జిల్లా రైతాంగం బీమా ప్రీమియం చెల్లించ లేకపోయింది. దీంతో జిల్లాలో ప్రతి ఏటా బీమా పరిధిలోకి వచ్చే సుమారు లక్షన్నర మంది రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు రైతులకు ఎంతో కొంత అండగా ఉంటున్న బీమా ఈసారి లే కుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా పంట రుణాల కింద రూ.వెయ్యి కోట్లు వరకు బ్యాంకులు ఇస్తున్నాయి. పంటల బీమా పరిధిలోకి వచ్చే వరి, చెరకు వంటి పంటలను సాగుచేస్తూ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్న రైతులు జిల్లాలో దాదాపు లక్షన్నర మంది వరకు ఉన్నారు. గతేడాది రూ.లక్ష అప్పు తీసుకున్న రైతు 5 శాతం ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే గత రబీ సీజన్లో రూ.200 కోట్లు లక్ష్యానికి గాను 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. దీని ప్రకారం వీరంతా వీరంతా దాదాపుగా బీమా ప్రీమియం కింద రూ.37 కోట్లకుపైగా చెల్లించారు. వీరితో పాటు బ్యాంకు రుణాలు పొందని మరో 230 మంది రైతులు రూ.లక్షన్నర వరకు ప్రీమియం కట్టారు. గడువు ముగియడంతో ఆందోళన హెలెన్, లెహర్ తుపాన్లు, భారీ వర్షాల సమయంలో జిల్లాలో పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనాలు వేశారు. మొత్తం 52,426 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇప్పటి వరకు బీమా పరిహారం రాకపోయినప్పటికీ వస్తుందనే ఆశ రైతుల్లో ఉంది. కానీ ఈసారి బీమా ప్రీమియంను ఆరు శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జూలై 31వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. ప్రతి యేటా ఈ సమయానికి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీంతో రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకుల మినహాయించుకుంటాయి. కానీ ఈసారి టీడీపీ రుణమాఫీ హామీ కారణంగా పరిస్థితి మారింది. సర్కారు నాన్చుడి ధోరణి వల్ల రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై నెలదాటినా బ్యాంకులు ఇప్పటి వరకు రైతులకు సుమారుగా రూ.4 కోట్లు వరకు మాత్రమే రుణాలుగా అందించాయి. దీంతో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. గడువు పొడిగించని పక్షంలో రైతులకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు పెంపు! ముందు ప్రకటించిన విధంగా బీమా గడువు గత నెల 31తో ముగిసింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో బీమా గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్‌లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్‌కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. -
తీరం దాటిన లెహర్
-
మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్
లెహర్ తున్ క్రమంగా బలహీనపడుతోంది. తుపాను కాస్తా... తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. అయితే... సాయంత్రానికి ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైయ్యింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. రాత్రి ఏడు గంటల సమయంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 75కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో, 36 గంటల్లో తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో భారీ గాలులు వీస్తాయని, తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు. కోస్తావ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపారు. -
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహెర్
-
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహర్
విశాఖ : లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. దక్షిణ దిశగా పయనిస్తున్న తుపాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. మరోవైపు అన్ని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. -
బలహీనాపడుతున్న లెహర్ తుపాను
-
'లెహర్ తుఫాన్ బలహీనపడుతోంది'
'లెహర్' తుఫాన్ క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ, జిల్లా అధికారులు తెలిపారు. పెను తుఫాన్‌గా మారిన లెహర్ బలహీనపడి తీరం దాటే అవకాశం ఉంది అని అధికారులు స్పష్టం చేశారు. తీరందాటే సమయంలో 80-100 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమవాయవ్య దిశగా పయనిస్తున్న తుఫాన్..తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురియవచ్చని అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నంకు 520 కి.మీ. దూరంలో, కాకినాడకు 470 కి.మీ దూరంలో తుపాను కేంద్రికృతమైవుందని తెలిపారు. రేపు మధ్యాహ్నం తర్వాత మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటనుందని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావం 53వేల మందిపై ఉందని, సుమారు 55 గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలు బందరు, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, కృత్తివెన్ను, మోపీదేవి, బంటుమిల్లి పై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు వివరించారు. సహాయ సమాచారం కోసం వివిధ ప్రాంతాల్లో హెల్ప్ లైన్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కింద తెలిపిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. విజయవాడ: 0866-2575038,2767075 గూడూరు: 08624-251827 నెల్లూరు: 0861-2345863,2345864 ఒంగోలు: 08592-280202,280203 రాజమండ్రి: 0883-2420541,2420780 ఏలూరు: 08812-226401 తాడేపల్లిగూడెం: 08818-226162 తుని: 08854-252172 అనకాపల్లి: 08924-221698 -
చెన్నె దిశగా లెహెర్ తుఫాను పయనం
విశాఖ : లెహెర్ తుపాను చెన్నై దిశగా పయనిస్తున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పోర్ట్‌బ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లెహెర్ తుపాను దిశ మార్పుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు. రేపు అర్థరాత్రి నుంచి ఎల్లుండి ఉదయం పదిగంటల లోపు తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. -
తీరంలో అలజడి
-
పెను ప్రళయం సృష్టించనున్న లెహర్
లెహర్ తుఫాను పెను ప్రళయం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. దీని ప్రభావం వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు ఉందని, ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని చెప్పారు. ఇంకా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు తదితర జిల్లాలపైనా తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. దీని ప్రభావం వల్ల రేపు సాయంత్రం నుంచే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తుఫాను తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టిస్తుందని చెప్పారు. భారీగా పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు, రైలు రవాణాపై నియంత్రణ అవసరమని, శ్రీకాకుళం, రణస్థలం తదితర ప్రాంతాలపై లెహర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో అధికారులందరినీ ఆయన అప్రమత్తం చేశారు. ఇక విశాఖ జిల్లా యంత్రాంగం కూడా తుఫాను ముప్పు బారి నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వ సన్నద్ధం అవుతోంది. లెహర్ నేపథ్యంలో విశాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను తీరం దాటుతుందని భావిస్తున్న 28వ తేదీన పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటించారు. ఆర్మీ, నేవీ బృందాలను అప్రమత్తం చేశారు. దాదాపు 48 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పెను గాలుల వల్ల కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతినకుండా చూసేందుకు ముందుగానే సెల్ ప్రొవైడర్లతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ సమావేశం నిర్వహించారు. మరోవైపు లెహర్ తుఫాను నేపథ్యంలో రేపు రాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం 127 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 30 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్పంచ్ల సాయం తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. -
రాష్ట్రం దిశగా కదులుతున్నపెను తుపాను లెహర్
విశాఖ: రాష్ట్రం దిశగా పెను తుపాను లెహర్ కదులుతోంది. పై-లిన్ , హెలెన్ తుపాను అనంతరం ఏర్పడిన ఈ లెహర్ తుపాను గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోంది. మచిలీపట్నంకు 960 కి.మీ, కాకినాడకు 920కి.మీ, విశాఖపట్నంకు 870 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమయ్యింది. 28వ తేదీ మధ్యాహ్నం తీరందాటే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ వద్ద తీరందాటే సమయంలో ఉత్తరకోస్తా, ఒరిస్సాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలుల వేగం గంటకు 200కి.మీ వరకూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంచుకొస్తున్న లెహర్ తుపాన్ విశాఖ మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరుస తుఫానులతో వేట అతలాకుతలమైంది. తాజా పెను తుఫాను ఏ కొంప ముంచుతుందోననే భయం మత్స్యకారులను వెంటాడుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 6వందల బోట్లకుపైగా వేట సాగిస్తున్నాయి. ఒక్కో బోటుపై 9మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. వందలాది మత్స్యకార కుటుంబాలు వీరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి 45 రోజులు నిషేధం గడువు ముగిసిన తర్వాత.. వేట ప్రారంభించిన మత్స్యకారులకు ఆది నుంచి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తుఫానులు, అల్పపీడనాలతో వేట నామమాత్రంగానే సాగుతోంది. ఐతే గతంలో ఎన్నడూలేని విధంగా వరుసగా వస్తున్న పెను తుపానులతో కోలుకోలేని విధంగా దెబ్బతగులుతోంది. అక్టోబర్‌లో ఫై-లీన్ తుఫాను మత్స్యకార బతుకులను చిన్నా భిన్నం చేసేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే హెలెన్. ఇది తీరం దాటకుండానే అండమాన్ నుంచి పెను తుఫాను లెహర్ తరుముకొస్తుందన్న వార్త.. మత్స్యకారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.15 రోజులకు సరిపడా రేషన్ సరుకులు, చేపలు నిల్వ ఉంచేందుకు ఐస్‌తో వేటకు సిద్ధమవుతోన్న సమయంలో ఈ వార్త వారిని దిక్కుతోచని స్థితిలో పడేసింది. బోట్లన్నింటిని జెట్టీలకే పరిమితం చేశారు. సముద్రంలో అలల ఉధృతి, ఆటు పోట్లతో వేట సాగించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ పెను తుపానుగా దూసుకొస్తోంది. ఈ తుపాను కాకినాడకు 1054 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి (28వ తేదీకి ) అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లెహర్ తుపాను కారణంగా ఈనెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ సెలవు ప్రకటించారు. లెహర్ కారణంగా పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయి. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. -
దూసుకొస్తున్న ‘లెహర్’ తుపాన్
-
దూసుకొస్తున్న ‘లెహర్’
కళింగపట్నానికి 980 కి.మీ. దూరంలో తుపాను పెను తుపానుగా మారే అవకాశం గురువారం నాటికి తీరం దాటే అవకాశం గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు నేడు భారీ వర్షాలు కురిసే సూచనలు సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను దూసుకొస్తోంది. ఇది పెను తుపానుగా మారొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లెహర్ మరింత బలపడితే ఇటీవల ఏర్పడిన పైలీన్, హెలెన్ తుపాన్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను సోమవారం రాత్రి నాటికి కళింగపట్నం తీరానికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగా ఉందని, మంగళవారం మధ్యాహ్నానికి.. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్ని బట్టి అది మరింత బలపడే అవకాశం ఉందని అంచనాకొచ్చారు. ప్రస్తుతం లెహర్ తుపాను పశ్చిమ వాయవ్యంగా కదులుతోందని, మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కు వచ్చేస్తే మంచిదని సూచించారు. లెహర్ కారణంగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాజాగా బులెటిన్ విడుదల చేశారు. బుధ, గురువారాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, గుడిసెలు ధ్వంసం కావడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం, సమాచార వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడడం, వరదలు ఏర్పడే అవకాశం ఉంటుందని సూచించారు. వ్యవసాయానికి భారీగా నష్టం వాటిల్లవచ్చని అంచనా వేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టులకు వార్నింగ్ సిగ్నల్ నెంబర్-2తోపాటు సెక్షన్ సిగ్నల్ నెంబర్ 3, 5లను సూచించారు. వరుస తుపాన్లు ఎందుకొస్తున్నాయి? నెలరోజుల వ్యవధిలో వరుసగా పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్లు దూసుకురావడానికి గల కారణాల్ని అధికారులు విశ్లేషిస్తున్నారు. తూర్పు తీరంలో తూర్పు దిశ నుంచి భారీగా గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. తుపాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలిస్తుండడం, పసిఫిక్ నుంచి బంగాళాఖాతానికి, కొన్నిసార్లు మలేసియా నుంచి గాలులు వీస్తుండడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. 1950కి ముందు ఇలాగే వరుస తుపాన్లు వచ్చేవని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. గత తుపాన్లన్నీ బంగాళాఖాతంలో తొలుత అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారేవి. లెహెర్ మాత్రం అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండగా మారి వెనువెంటనే తుపానుగా మారిపోయిందని మురళీకృష్ణ తెలిపారు . వర్షపాతం ఎక్కడెక్కడ? ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చిత్తూరులో 4సెం.మీ, మదిర, తిరుపతి, బాపట్ల, దర్శిలో 3సెం.మీ, గుడివాడ, బోధన్, నూజివీడు ప్రాంతాల్లో 2 సెం.మీ. చొప్పున వర్షాలు పడ్డాయి. మంగళవారం సాయంత్రం లోపు నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగానూ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అప్రమత్తంగా ఉండండి లెహర్ తుపాను నేపథ్యంలో మందుస్తుగా సహాయ, పునరావాస చర్యలకు ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కోస్తా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను సంసిద్ధతపై కోస్తా 9 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సి.పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఈ నెల 28న లెహర్ తుపాను కాకినాడ వద్ద తీరం దాటనుందని, ఈ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే 4 హెలికాప్టర్లను మోహరించామన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను మంగళవారం నుంచి సురక్షిత ప్రాంతాలను తరలిస్తామన్నారు. మొత్తం 32 ప్రకృతి విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించినట్టు చెప్పారు. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
వరుస విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాత శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, సాక్షి ప్రతినిధులు వరుస విపత్తులు.. ఒకదాని వెనుక మరొకటి ముంచుకొస్తున్న తుపాన్లు.. మొన్న పై-లీన్, నిన్న కుండపోత వర్షాలు.. నేడు హెలెన్.. అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు లెహెర్ రూపంలో మరో పెను తుపాను తరుముకొస్తోంది! కేవలం నెల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి విరుచుకుపడడంతో రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలోనే సర్వనాశనమైంది. ఖరీఫ్‌లో వేసిన పంటంతా ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెనునష్టం వాటి ల్లింది. హెలెన్ దెబ్బకు ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరి దారుణంగా దెబ్బతింది. లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మామిడి, అరటి, జీడి తోటలతోపాటు కాయగూర పంటలు కూడా హెలెన్ దెబ్బకు నేలపాలయ్యాయి. ఈ వరుస విపత్తులతో ఈ ఐదు జిల్లాల్లోనే వరి రైతులకు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500 కోట్ల నష్టం జరిగింది. గోరుచుట్టుపై రోకటిపోటులా రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నష్టపరిహారం ఊసే మర్చిపోయింది. పెట్టుబడి రాయితీ అందని ద్రాక్షే అవుతోంది. అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా కొందరు రైతులకు పరిహారం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. పశ్చిమగోదావరికి పెను నష్టం.. ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాను వరుస తుపానులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. తాజా హెలెన్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి 2.73 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతకు ముందు పై-లీన్ కారణంగా 34,171 ఎకరాల్లో వరి నాశనమైంది. ఈ రెండు తుపానుల కారణంగా జిల్లాల్లో రైతులు రూ.220 కోట్ల మేర నష్టపోయారు. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పితే నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పైసా పెట్టుబడి రాయితీ అందించలేదు. ‘తూర్పు’లో కుదేలైన కొబ్బరి రైతు వరి అత్యధికంగా పండించే తూర్పుగోదావరి జిల్లా వరుస తుపాన్లతో అల్లాడింది. జిల్లాలో హెలెన్ దెబ్బకు దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 80 వేల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. బోండాలు రాలిన నష్టమే రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద ఈ జిల్లాలో రైతులు రూ.225 కోట్ల మేర నష్టపోయారు. శ్రీకాకుళంలో అపార నష్టం పై-లీన్, హెలెన్ దెబ్బకు జిల్లాలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలు పనికి రాకుండా పోయాయి. వరి, ఇతర పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. అధికారుల అంచనా ప్రకారం పై-లీన్, హెలెన్ కారణంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కొబ్బరి, జీడి తోటలు నాశనమవడంతో రైతుల గుండె చెదిరింది. రెండు తుపాన్లతో జిల్లాలో రైతులు రూ.312 కోట్ల మేర నష్టపోయారు. విపత్తులతో జిల్లాలో 80 వేల మంది రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికీ నయా పైసా సాయం అందలేదు. విశాఖకు ‘నీలం’ సాయమే అందలేదు.. జిల్లాలో గతేడాది నీలం తుపానుతో నష్టపోయిన రైతులకే పరిహారం నేటికీ అందలేదు. తాజాగా వచ్చిన పై-లీన్, హెలెన్ తుపాన్లతో రూ.416.76 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. విపత్తులతో 71,042.5 ఎకరాల్లో రూ.59.62 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు లెక్క కట్టారు. 61,269మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇప్పటికీ వారికి పెట్టుబడి రాయితీ పూర్తిస్థాయిలో అందలేదు. కృష్ణా జిల్లాలో భారీ నష్టం వరుస తుపాన్లతో కృష్ణా జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీటిపాలైన పంటలో కొంతైనా దక్కకపోతుందా అనే ఆశతో రైతన్నలు చేల వద్దే రాత్రి పగలు నీటిని తోడుతున్నారు. గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కత్తివెన్ను మండలాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రైతులకు రూ.275 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పై-లీన్ తుపాను కారణంగా నష్టపోయిన 60 వేల మంది రైతులకు ఇప్పటికీ పైసా సహాయం అందలేదు. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు.. ‘‘నేను రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశా. మొన్న అక్టోబర్‌లో భారీ వర్షాల వల్ల గింజ సరిగా పాలుపోసుకోలేదు. ఉన్నవాటినైనా దక్కించుకుందామనుకున్న సమయంలో హెలెన్ వచ్చింది. పైరు మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి రెండెకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. పంట పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’’ - భూపతి పరశురామయ్య, చినకామనపూడి, కృష్ణా జిల్లా పంటపై ఆశలు వదిలేసుకున్నా.. ‘‘నేను సొంతానికి ఐదెకరాలు, కౌలుకు మరో ఐదెకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో పది రోజుల్లో కోతలు కోద్దామని అనుకునే సరికి హెలెన్ ముంచేసింది. పంటపై ఆశలు వదిలేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే అవకాశంలేదు’’ - దున్నాల రామకృష్ణయ్య, వానపల్లిపాలెం, తూర్పుగోదావరి కూరగాయల రైతులకు పరిహారం ఇవ్వాలి ‘‘ఎన్నో ఏళ్లుగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నాను. తుపానులు, భారీ వర్షాలతో ఈ ఏడాది మొక్కలు, పాదులు నాశనమయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఇంత దారుణంగా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభుత్వం కూరగాయల రైతులకు కూడా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి’’ - జక్కంశెట్టి రాముడు, జిన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా -
విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో 'లెహర్'
విశాఖ : అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు మరో తుపాను ముంచుకొస్తోంది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈనెల 28న మచిలీపట్నం, కళింగపట్నం ఓడరేవుల మధ్య కాకినాడకు సమీపాన తీరం దాటే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. లెహర్తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది -
లెహర్ దడ
అమలాపురం, న్యూస్‌లైన్ :‘హెలెన్’ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోని జిల్లాను మరో తుపాను గండం తరుముకొస్తోంది. అసలే కుదేలైన జిల్లావాసులను..‘లెహర్ ’ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక పిడుగుపాటులా భయకంపితులను చేస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన లెహర్ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు మరో తుపాను ఎదుర్కొనే శక్తిలేదని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. తాజా తుపాను మరింత బలపడితే తీరం వెంబడి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. తుపాను కనుక ఈప్రాంతంలో ప్రభావం చూపిస్తే ఈసారి నష్టం అంచనాలకు అందనంతగా ఉంటుందని అధికార యంత్రాంగం కలవరపడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో 110 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులే కోనసీమ రూపురేఖలను, అన్నదాతల తలరాతలను మార్చివేశాయి. ఈ సమయంలో లెహర్ తుపాను దాడి చేస్తే జిల్లా మరింత అతలాకుతలమవుతుంది. తిప్పలు పడుతుండగానే.. హెలెన్ తుపాను కొట్టిన దెబ్బ నుంచి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గ్రామాల్లో రహదారులపై పడ్డ చెట్లను తొలగించడంతో అన్ని గ్రామాలకూ రెండు రోజుల తరువాత రాకపోకలు మొదలయ్యాయి. అయినప్పటికీ కోనసీమలోని అమలాపురం మున్సిపాలిటీ, రావులపాలెం, రాజోలుతో పాటు కొన్ని మండల కేంద్రాలకు మినహా మిగిలిన ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. ఇప్పటికీ కోనసీమలో 275 గ్రామాలు చిమ్మచీకట్లో మగ్గుతున్నాయి. వరి రైతులు పంటపై ఆశలు వదులుకోగా, కొబ్బరి రైతులు తోటల్లో పడిపోయిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ప్రభుత్వాధికారులు వచ్చి నష్టం నమోదు చేసుకునే అవకాశం ఉందని పడిపోయిన ఇళ్లను సరి చేసుకునేందుకు ప్రయత్నించని బాధితులు సామాన్లను మాత్రం మరోచోటకు తరలిస్తున్నారు. సతమతమవుతున్న అధికారులు మరోవైపు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. తుపాను ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర, కలెక్టర్ నీతూ ప్రసాద్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కోనసీమలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం నమోదు, ఇళ్ల నష్టాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలనుపై సమీక్ష జరిపారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనాలు సైతం పూర్తి చేయలేని పరిస్థితుల్లో మరో తుపాను ముప్పు పొంచి ఉండడం అధికార యంత్రాంగానికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. హెలెన్ నష్టం నమోదును పక్కనబెట్టి, లెహర్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సతమతమవుతున్నారు. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొద్దిరోజులుగా వేటలేక పూట గడవని దుస్థితిలో అవస్థలు పడుతున్న మత్స్యకారులకు తాజా హెచ్చరికలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. లెహర్ తుపాను ప్రభావంపై తీరప్రాంత మండలాల్లోని గ్రామాల్లో టాంటాం వేయించాలని ఆయా తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమె కాట్రేనికోన మండలం చిర్రయానాం, నీళ్లరేవు, పల్లంకుర్రు గ్రామాల్లో పర్యటించి హెలెన్ తుపాను నష్టాన్ని పరిశీలిస్తూనే రాబోయే లెహర్ తుపాను వల్ల నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లావాసులకు.. ముఖ్యంగా తీరప్రాంతాల వారిని కంటికి కునుకు పట్టనివ్వని భీతి వెన్నాడుతోంది. -
దూసుకొస్తున్న మరో తుఫాను "లెహర్"