రేపల్లె, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్‌లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్‌లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్‌కు చేరుకుంటున్నాయి.
వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్‌లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్‌లో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
Published Tue, Dec 10 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement