పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
వరుస విపత్తులతో వెన్నువిరిగిన అన్నదాత
శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, సాక్షి ప్రతినిధులు
వరుస విపత్తులు.. ఒకదాని వెనుక మరొకటి ముంచుకొస్తున్న తుపాన్లు.. మొన్న పై-లీన్, నిన్న కుండపోత వర్షాలు.. నేడు హెలెన్.. అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు లెహెర్ రూపంలో మరో పెను తుపాను తరుముకొస్తోంది! కేవలం నెల వ్యవధిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రకృతి విరుచుకుపడడంతో రాష్ట్రంలో రైతులు విలవిలలాడిపోతున్నారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకున్న వరి పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలోనే సర్వనాశనమైంది. ఖరీఫ్‌లో వేసిన పంటంతా ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెనునష్టం వాటి ల్లింది. హెలెన్ దెబ్బకు ఈ ఐదు జిల్లాల్లోనే దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరి దారుణంగా దెబ్బతింది. లక్షకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మామిడి, అరటి, జీడి తోటలతోపాటు కాయగూర పంటలు కూడా హెలెన్ దెబ్బకు నేలపాలయ్యాయి. ఈ వరుస విపత్తులతో ఈ ఐదు జిల్లాల్లోనే వరి రైతులకు రూ.1,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర పంటలకు మరో రూ.500 కోట్ల నష్టం జరిగింది. గోరుచుట్టుపై రోకటిపోటులా రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. నష్టపరిహారం ఊసే మర్చిపోయింది. పెట్టుబడి రాయితీ అందని ద్రాక్షే అవుతోంది. అక్కడక్కడ ఏదో మొక్కుబడిగా కొందరు రైతులకు పరిహారం అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.
పశ్చిమగోదావరికి పెను నష్టం..
ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాను వరుస తుపానులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. తాజా హెలెన్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి 2.73 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతకు ముందు పై-లీన్ కారణంగా 34,171 ఎకరాల్లో వరి నాశనమైంది. ఈ రెండు తుపానుల కారణంగా జిల్లాల్లో రైతులు రూ.220 కోట్ల మేర నష్టపోయారు. జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తప్పితే నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పైసా పెట్టుబడి రాయితీ అందించలేదు.
‘తూర్పు’లో కుదేలైన కొబ్బరి రైతు
వరి అత్యధికంగా పండించే తూర్పుగోదావరి జిల్లా వరుస తుపాన్లతో అల్లాడింది. జిల్లాలో హెలెన్ దెబ్బకు దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 80 వేల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. బోండాలు రాలిన నష్టమే రూ.28 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మొత్తమ్మీద ఈ జిల్లాలో రైతులు రూ.225 కోట్ల మేర నష్టపోయారు.
శ్రీకాకుళంలో అపార నష్టం
పై-లీన్, హెలెన్ దెబ్బకు జిల్లాలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలు పనికి రాకుండా పోయాయి. వరి, ఇతర పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో రైతులు దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. అధికారుల అంచనా ప్రకారం పై-లీన్, హెలెన్ కారణంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. కొబ్బరి, జీడి తోటలు నాశనమవడంతో రైతుల గుండె చెదిరింది. రెండు తుపాన్లతో జిల్లాలో రైతులు రూ.312 కోట్ల మేర నష్టపోయారు. విపత్తులతో జిల్లాలో 80 వేల మంది రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి వారికి ఇప్పటికీ నయా పైసా సాయం అందలేదు.
విశాఖకు ‘నీలం’ సాయమే అందలేదు..
జిల్లాలో గతేడాది నీలం తుపానుతో నష్టపోయిన రైతులకే పరిహారం నేటికీ అందలేదు. తాజాగా వచ్చిన పై-లీన్, హెలెన్ తుపాన్లతో రూ.416.76 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. విపత్తులతో 71,042.5 ఎకరాల్లో రూ.59.62 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు లెక్క కట్టారు. 61,269మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇప్పటికీ వారికి పెట్టుబడి రాయితీ పూర్తిస్థాయిలో అందలేదు.
కృష్ణా జిల్లాలో భారీ నష్టం
వరుస తుపాన్లతో కృష్ణా జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. నీటిపాలైన పంటలో కొంతైనా దక్కకపోతుందా అనే ఆశతో రైతన్నలు చేల వద్దే రాత్రి పగలు నీటిని తోడుతున్నారు. గూడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కత్తివెన్ను మండలాల్లోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రైతులకు రూ.275 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పై-లీన్ తుపాను కారణంగా నష్టపోయిన 60 వేల మంది రైతులకు ఇప్పటికీ పైసా సహాయం అందలేదు.
అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు..
‘‘నేను రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి వేశా. మొన్న అక్టోబర్‌లో భారీ వర్షాల వల్ల గింజ సరిగా పాలుపోసుకోలేదు. ఉన్నవాటినైనా దక్కించుకుందామనుకున్న సమయంలో హెలెన్ వచ్చింది. పైరు మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి రెండెకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. పంట పోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు’’
- భూపతి పరశురామయ్య, చినకామనపూడి, కృష్ణా జిల్లా
పంటపై ఆశలు వదిలేసుకున్నా..
‘‘నేను సొంతానికి ఐదెకరాలు, కౌలుకు మరో ఐదెకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో పది రోజుల్లో కోతలు కోద్దామని అనుకునే సరికి హెలెన్ ముంచేసింది. పంటపై ఆశలు వదిలేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోతలు కోయిస్తే కూలీల ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క గింజ కూడా చేతికొచ్చే అవకాశంలేదు’’
- దున్నాల రామకృష్ణయ్య, వానపల్లిపాలెం, తూర్పుగోదావరి
కూరగాయల రైతులకు పరిహారం ఇవ్వాలి
‘‘ఎన్నో ఏళ్లుగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నాను. తుపానులు, భారీ వర్షాలతో ఈ ఏడాది మొక్కలు, పాదులు నాశనమయ్యాయి. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాను. ఇంత దారుణంగా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభుత్వం కూరగాయల రైతులకు కూడా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి’’
- జక్కంశెట్టి రాముడు, జిన్నూరు, పశ్చిమగోదావరి జిల్లా