దిగజారిన దిగుబడులు
= ఎకరాకు 8 నుంచి 10 బస్తాలు తగ్గుదల
= 3.50 లక్షల ఎకరాల్లో ప్రభావం
= కౌలురైతుల పరిస్థితి దయనీయం
చల్లపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వీటినుంచి 12.24 లక్షల టన్నుల మేరకు దిగుబడులు వస్తాయని అధికారులు అంచనాలు వేశారు. గత నెలలో సంభవించిన వరుస తుపాన్లు, వాయుగుండాల వల్ల వరిపంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విపత్తుల వల్ల 3.50 లక్షల ఎకరాల్లో పాలు పోసుకుంటున్న వరికంకులు చాలావరకు తాలు (తప్ప) కంకులుగా మారాయి.
ప్రస్తుతం జిల్లాలో పలు ప్రాంతాల్లో యంత్రాలతో చేస్తున్న వరికోతలు, నూర్పిళ్లను పరిశీలిస్తే చాలాచోట్ల ఎకరాకు 22 బస్తాల దిగుబడులు మాత్రమే వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎకరాకు 8 నుంచి 10 బస్తాల దిగుబడులు తగ్గిపోయాయి. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 15 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో సగటున దాదాపు 2.12 లక్షల టన్నుల దిగుబడులు తగ్గనున్నాయని అధికారులు చెబుతున్నారు.
కౌలు రైతుల కుదేలు...
కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో ప్రాంతాలను బట్టి ఎకరాకు 13 బస్తాల నుంచి 22 బస్తాల కౌలు ఇస్తున్నారు. ఈ ఏడాది చాలాచోట్ల ఎకరాకు 22 బస్తాలకు మించి దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చిన దిగుబడులు కౌలు చెల్లించేందుకే సరిపోతాయని, పెట్టిన పెట్టుబడులన్నీ నష్టమేనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతులు అప్పులుచేసి సాగుచేసినవారే. వీరిలో వందకు ఐదు నుంచి ఏడు రూపాయలకు వడ్డీలకు తెచ్చిన రైతులు కూడా ఉన్నారు. పంట చేతికొచ్చిన తరువాత అప్పులు తీర్చేద్దామనుకున్న రైతులకు ఖర్చులు రాకపోవడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రబీలో దాళ్వా కూడా లేకపోవడంతో కౌలు రైతులకు పాలుపోని పరిస్థితి నెలకొంది.
ధాన్యం ధర అంతంతమాత్రమే...
నాట్లు దగ్గర నుంచి పంట చేతికందేవరకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.23 వేలు వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ధాన్యం ధర మాత్రం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. గత ఏడాది ఈ సమయంలో కల్లాల్లో బస్తా బీపీటీ ధాన్యం రూ.1,500కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.1,300కు మాత్రమే కొంటున్నారు. దీంతో బస్తాకు రైతులు రూ.200 నష్టపోవాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరాకు రూ.1,600 వరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది అధిక దిగుబడులు వస్తాయని ఆశించిన రైతులకు వరుస తుపాన్లు, వాయుగుండాలు కోలుకోలేని దెబ్బతీశాయి.