చూశారా చోద్యం !
► ఒక్క రూపాయే పంట నష్టపరిహారం
► రైతు ఖాతాలో జమ చేసిన సర్కార్
► కంగుతిన్న రైతులు
► విరుచుకుపడిన శెట్టర్
తుమకూరు: పంట నష్టపరిహారాల చెల్లింపుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తుమకూరు, ధార్వాడ జిల్లాల రైతులకు శుక్రవారం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాల్లో జమ చేసిన పంటనష్ట పరిహారం చూసి తుమకూరు గ్రామాంతర పరిధిలోని సిరివర గ్రామానికి చెందిన రైతులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన శివరామయ్య తమకున్న 1.30 ఎకరాల్లో సాగు చేసిన పంట వర్షాభావంతో పూర్తిగా ఎండిపోవడంతో పంట నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్నారు. అందుకు స్పందించిన ప్రభుత్వం శివరామయ్యకు రూ.7 వేల పంటనష్ట పరిహారం అందించడానికి నిర్ణయించుకుంది.
అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శివరామయ్య బ్యాంకు ఖాతాలో పంటనష్ట పరిహారాన్ని జమ చేసింది. ఖాతాలో డబ్బు జమ అయినట్లు మెసేజ్ చూసుకున్న శివరామయ్య ఖాతాను పరిశీలించగా కేవలం ఒక రూపాయి (రూ.1)మాత్రమే జమ అయినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు. ఇదే రీతిలో తురువేకెరె తాలూకా మావినహళ్లికి చెందిన మహిళా రైతు మంగళమ్మ ఖాతాలో కూడా పంటనష్ట పరిహారం కేవలం ఒక్క రూపాయి జమ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ తరహా ఘటన తుమకూరులో మాత్రమే కాకుండా ధార్వాడ జిల్లాలో కూడా చోటు చేసుకుంది.
జిల్లాలోని హారోబెళవడి గ్రామంలోని నంగనగౌడ, మానప్ప, రుద్రప్ప రైతుల ఖాతాల్లో కూడా పంట నష్టపరిహారంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జమ చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులకు పంట నష్టపరిహారంగా రూ.100 నుంచి రూ.300 వరకు జమ చేసిన ఘటనలు వెలుగుచూసాయి. రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి జమ చేసిన ఘటనపై విధానసభ ప్రతిపక్ష నాయకుడు జగదీశ్‌శెట్టర్ శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో జీరో అవర్‌లో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
పంట నష్టపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల ఖాతాల్లోకి కేవలం ఒక్క రూపాయి మాత్రమే జమ చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో బహిర్గతమైందన్నారు. అందుకు న్యాయశాఖ మంత్రి టీ.బీ.జయచంద్ర స్పందిస్తూ ఈ ఘటన తమను కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.