విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో 'లెహర్'
విశాఖ : అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు మరో తుపాను ముంచుకొస్తోంది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈనెల 28న మచిలీపట్నం, కళింగపట్నం ఓడరేవుల మధ్య కాకినాడకు సమీపాన తీరం దాటే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
లెహర్‌తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది