Lehar cyclone
-
కౌలుదారులకు రబీ రుణాలందేనా?
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఖరీఫ్‌లో పైలీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లతో జిల్లాలోని కౌలు రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. కానీ వారికి ఎలాంటి నష్ట పరిహారం అందే అవకాశం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడి పెట్టిన కౌలురైతుకు పంటచేతికిరాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. రబీ సాగు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రుణ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించకపోతే సాగు ప్రశ్నార్ధకమే. అయితే కౌలుదారులకు ఈ రబీలోనూ పంట రుణాలు అందే అవకాశం కనబడటం లేదు. జిల్లాలో 1.60లక్షల మంది కౌలుదారులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే కేవలం 20వేల మందికే గుర్తింపు కార్డుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 2010లో 68వేల మందికి గుర్తింపుకార్డులిచ్చిన ప్రభుత్వం 2011లో 35వేల మందికి, ఈ ఏడు 20వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులందజేశారు. ఖరీఫ్‌లోనే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పంట రుణాలు ఇవ్వలేదని కౌలుదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా కౌలు కార్డులు పొందాలనుకున్నా పొలాలు కట్టుబడికి ఇచ్చిన రైతులు తమకు కార్డులు వస్తే, ఎక్కడ వారి పొలాలు కాకుండా పోతాయోనని తమకు కౌలుకు ఇచ్చినట్లుగా కాగితం రాసి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుపాన్ల దెబ్బకు ఖరీఫ్ సాగులో నష్టపోయి, మళ్లీ బయట అప్పులు చేయాలంటే అధిక వడ్డీలు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని కౌలుదారులు వాపోతున్నారు. -
ముంచుకొస్తున్న ‘మాదీ’
సాక్షి, విశాఖపట్నం: మరో ముప్పు ముంచుకువస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న వాయుగుండం శనివారం ఉదయం నాటికి తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణశాఖ అధికారులు ‘మాదీ’గా నామకరణం చేశారు. మాల్దీవుల వాతావరణ విభాగం ఈ పేరును నిర్ణయించింది. రానున్న 24గంటల్లో మాదీ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఐదు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల క్రితం వరకూ వాయుగుండంగానే ఉంది. శుక్రవారం రాత్రి నాటికి తీవ్రవాయుగుండంగా మారి 24 గంటలు దాటక ముందే తుపానుగా మారింది. ‘మాదీ’ బలపడితే.. మాదీ తుపాను శనివారం సాయంత్రానికి చెన్నైకు ఆగ్నేయంగా 500 కి.మీ. దూరంలో ఉంది. కోస్తా తీరానికి మాత్రం 300 నుంచి 400కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో ఇది కదలడం లేదని, అందువల్లే ఎక్కడ తీరం దాటుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు తీవ్ర గాలులు వీస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. మాదీ తుపాను ప్రస్తుతం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో ఉంది. మత్స్యకారులు సముద్రం లోతు వరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఉత్తర దిశగా, మెల్లగా పయనిస్తున్నట్టు అంచనా వేశారు. -
లెహర్ వణుకు
బాపట్లటౌన్,రేపల్లె, న్యూస్‌లైన్ :‘లెహర్’ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం సూర్యలంక వద్ద సముద్రంలో అలజడి రేగింది. సుమారు నాలుగు మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరం వెంబడి వంద నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలలు వీచాయి. తొలుత పెను తుపాను అంటూ ప్రమాద హెచ్చరికలు పంపినా లెహర్ బలహీనపడటంతో గురువారం ఉదయం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. వీటికి తోడు మధ్యాహ్నం నుంచి చలిగాలులు కూడా తోడుకావడంతో జిల్లా వణికిపోయింది. వర్షానికి తోడు చలి గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీరం అల్లకల్లోలంగా మారడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మండలంలోని సూర్యలంక, అడవిపల్లిపాలెం గ్రామాల్లోని ప్రజలను హుటాహుటిన ముత్తాయపాలెం, ఏఎంజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. గృహాలు విడిచి వచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అని మొండికేసినా సిబ్బంది బలవంతంగా తరలించారు. తీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ తీరప్రాంత గ్రామాలైనా అడవిపల్లిపాలెం, సూర్యలంక, ముత్తాయపాలెం గ్రామాల్లో గురువారం జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ పర్యటించారు. లెహర్ తుపాను తీరం దాటిందని అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు,ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సిబ్బంది మరో 12 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను బాధితులను పునరావాస కేంద్రంలో వదిలి మీకిష్టమొచ్చినట్లు మీరు తిరిగితే కుదరదు అంటూ కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. బాధితులు తిరిగి వారి గృహాలకు వెళ్లే వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహించినా, వారిని పట్టించుకోకపోయినా కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ సేనాపతి ఢిల్లీరావు, తహశీల్దార్ జి.వి.సుబ్బారెడ్డి, డిఎస్పీ ఏ. భాస్కర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఉషాకిరణ్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు వున్నారు. రైతులకు తప్పని నష్టం.. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాలు, పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో జిల్లాలో పత్తి, మిర్చి,వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. లెహర్ తుపాను రైతులను మరింతగా కుంగదీస్తోంది. హెలెన్ ప్రభావంతో కంకి, పొట్టదశల్లో ఉన్న వరి నేలకొరిగింది. కనీసం పంటను కట్టలు కట్టేందుకు కూడా అవకాశం లేక పోవటంతో రోజుల తరబడి నీటిలోనే నానిపోతున్నది. ఇప్పుడిప్పుడే పంట చేలల్లోని నీరు బయటకు పోతున్న తరుణంలో లెహర్ వర్షాలతో పంటపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. ఈదురు గాలులు కూడా తోడవడంతో వరి పూర్తిస్థాయిలో నేలకొరిగింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు కలవరపడుతున్నారు. మత్స్యకారుల అవస్థలు వరస తుపానులతో తీరప్రాంత మత్స్యకారులు తల్లడిల్లుతున్నారు. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పుతోపాటు సముద్రం వేటకు అనుకూలంగా లేకపోవడం, పెనుతుపాను హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులంతా సుమారు 320 పడవలను అడవిపల్లిపాలెంలోని ఈపూరుపాలెం డ్రెయిన్‌లో లంగరు వేసి నిలిపేశారు. మూడు నెలలుగా వేట సాగక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సమయంలో హెచ్చరికలు జారీచేసే అధికారులు రెక్కాడితే కాని డొక్కాడని తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. వరసగా పదిరోజుల పాటు వేటాడిన రోజులు లేవన్నారు. -
‘లెహర్’ గండం గడిచింది
*వాయుగుండంగా బలహీనపడి మచిలీపట్నం వద్ద తీరం దాటిన లెహర్ * ఊపిరి పీల్చుకున్న కోస్తా జిల్లాలు * కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు * సముద్రంలో అల్లకల్లోలంగా ఉండే అవకాశం * తెలంగాణకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు: గండం గడిచింది. రాష్ట్రం ఊపిరిపీల్చుకుంది. నాలుగు రోజుల నుంచి ప్రజలను భయాందోళనకు గురిచేసిన లెహర్ తుపాను వాయుగుండంగా బలహీనపడి గురువారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటేసింది. పెను తుపానుగా మారి అల్లకల్లోలం సృష్టిస్తుందనుకున్న లెహర్ శాంతించడంతో కోస్తా జిల్లాలకు ముప్పు తప్పినట్టయింది. తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం కనీసం 36 గంటల వరకు ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. 12 గంటలపాటు అల్పపీడనం ఉంటుందని, 24 గంటల పాటు గంటకు 45 కి.మీ. నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలోని యానాం ప్రాంతాల్లోనూ భారీ గాలులతోపాటు వర్షాలుంటాయని సూచించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కోస్తాలోని విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాకు పెను నష్టం తప్పింది.. లెహర్ గండం గడిచిపోవడంతో కోస్తా తీర ప్రాంత జిల్లాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పటికే పై-లీన్, హెలెన్‌తో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే భయపడినంత తీవ్రత లేకుండానే లెహర్ వెళ్లిపోవడంతో వారు ఊరట చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం కారణంగా తీరం వెంబడి స్వల్పంగా గాలులు వీచాయి. అమలాపురంలో గురువారం కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు ఐదడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. పునరావాస కేంద్రాలకు వచ్చిన లోతట్టు ప్రాంత ప్రజలు తమతమ ప్రాంతాలకు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పాలకొల్లు, మొగల్తూరు, వీరవాసరం, యలమంచిలి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మచిలీపట్నంలోనే లెహర్ తీరం దాటనుందన్న వార్తలతో కృష్ణా జిల్లా ప్రజలు కలవరపడ్డా చివరికి పెద్దగా నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లాలో వర్షం మినహా గాలులు కూడా పెద్దగా లేవు. బందరు మండలం బుద్దాలపాలెంలో చలిగాలులకు తాడంకి ఆదిశేషమ్మ (75) అనే వృద్ధురాలు మృతి చెందింది. గురువారం రాత్రి పునరావాస కేంద్రాల్లోని వారిని ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించి వేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తుపాను ఉత్కంఠకు తెరపడటంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఎక్కడిక్కడే ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణాలో కౌలు రైతు మృతి పెడన, న్యూస్‌లైన్: హెలెన్ దెబ్బకు వరి పంట దెబ్బతినడంతో కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన జన్ను తాతయ్య (65) అనే రైతు గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఈయనకు మూడు ఎకరాల పొలం ఉంది. మరో పదెకరాలను కౌలుకు తీసుకుని కొడుకు సాయంతో సాగు చేస్తున్నాడు. వీరు పంట కోసం సుమారు రూ.1.5 లక్షల అప్పు చేశారు. హెలెన్ కారణంగా పంటంతా నేలవాలింది. దీంతో తాతయ్య మానసికంగా కుంగిపోయాడు. ‘హెలెన్’ నష్టాన్ని మదింపు చేయండి: సీఎం సాక్షి, హైదరాబాద్: హెలెన్ తుపాను నష్టాలపై తక్షణమే గణాంకాల సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హెలెన్ తుపాను నష్టాలు, లెహర్ తుపాను పరిస్థితిపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లెహర్ తుపాను తీవ్రత తగ్గిపోయిన నేపథ్యంలో పంటలకు, ఇళ్లకు జరిగిన నష్టాలపై త్వరితగతిన, పక్కాగా గణాంకాలు సేకరించాలని సీఎం సూచించారు. తుపానువల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించారు. తుపానువల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంపట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్న, సహాయక చర్యల్లో పాల్గొన వివిధ ప్రభుత్వ విభాగాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తుపాను తీరం దాటినా మరో 12 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్
లెహర్ తున్ క్రమంగా బలహీనపడుతోంది. తుపాను కాస్తా... తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. అయితే... సాయంత్రానికి ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైయ్యింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. రాత్రి ఏడు గంటల సమయంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 75కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో, 36 గంటల్లో తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో భారీ గాలులు వీస్తాయని, తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు. కోస్తావ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపారు. -
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహెర్
-
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహర్
విశాఖ : లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. దక్షిణ దిశగా పయనిస్తున్న తుపాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. మరోవైపు అన్ని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. -
భయం గుప్పెట్లో ‘పశ్చిమ’
సాక్షి, ఏలూరు :ఎండ మండించింది.. కడలి నిశ్శబ్దంగా ఉంది.. గాలి కూడా నిశ్చలమే.. ఒకానొక దశలో సన్నటి చినుకులు కురిశారుు.. జిల్లాలో బుధవారం కనిపించిన వాతావరణం ఇది. లెహర్ పెను తుపానుగా మారి ‘పశ్చిమ’ను అతలాకుతలం చేయనుం దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంటే.. బుధవారం రాత్రి వరకూ ఆ పరిస్థితులేవీ కనిపించలేదు. కానీ.. జనం గుండెల్లో మాత్రం గుబులు మొదలైంది. నిశ్శబ్దం తరువాత వచ్చే తుపాను ఎంత భయంకరంగా ఉంటుందోననే భయంతో ప్రాణా లను అరచేత పట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరుస తుపాన్లు చూసిన జిల్లా ప్రజలు లెహర్ హెచ్చరికలను తొలుత అంత తీవ్రంగా పరిగణించలేదు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సహకరించలేదు. కానీ.. బుధవారం సాయంత్రానికి పరిస్థితి చూసిన జనం లెహర్ తీవ్రతను తలచుకోవడానికే వణికిపోతున్నారు. 64 గ్రామాల్లో భయం.. భయం లెహర్ తుపాను ఏ క్షణాన తీరంపై విరుచుకుపడుతుందోనని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తుపాను తొలుత కాకినాడలో తీరం దాటుతుందని భావించినప్పటికీ.. దిశ మార్చుకుని.. మధ్యాహ్నం 2.30 గంటలకు సూపర్ సైక్లోన్ స్థాయి నుంచి తీవ్రత తగ్గించుకుంటూ సైక్లోన్‌గా మారి మచిలీపట్నం వైపు పయనిస్తుండటంతో ప్రజల్లో భయం అధికమైంది. కొద్దిరోజుల క్రితం జిల్లాను కుదిపేసిన హెలెన్ తుపాను మచిలీపట్నంలోనే తీరం దాటింది. ఆ సమయంలో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మచిలీపట్నం-కళింగపట్నం/నెల్లూరు మధ్య గురువారం ఉదయం 90 నుంచి 100 కి.మీ. వేగాన్ని పుంజుకుని సాయంత్రానికి 55 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే జిల్లా అధికారులు మాత్రం తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని ఆచంట, మొగల్తూరు, కాళ్ల, ఆకివీడు, యలమంచిలి, పోడూరు, భీమవరం, నరసాపురం, పాలకోడేరు, వీరవాసరం, పెరవలి, పెనుగొండ, పెనుమంట్ర, ఉండ్రాజవరం, తణుకు మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయూ మండలాల్లోని 64 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎదుర్కోవడానికి అంతా సిద్ధం తుపాను నేపథ్యంలో తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. 500 మంది సైనికులను రప్పిస్తున్నామని, నాలుగు జాతీయ విపత్తు నివారణ (ఎన్ఆర్డీఎఫ్) బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని తెలిపారు. అత్యవసరంగా రంగంలోకి దిగేందుకు విశాఖలో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే 123 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 22వేల మంది ప్రజలను 35 మినీ బస్సులు, 24 ట్రాక్టర్లు, 24 టాటా మేజిక్ ఆటోలు, 32 ఆటోల్లో పోలీసుల సాయంతో బలవంతగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ 44 పునరావాస కేంద్రాలకు 5,713 మందిని తరలించారు. ఇక్కడ 240 మంది వైద్య సిబ్బందితో 46 వైద్య బృందాలు సేవలందిస్తున్నాయి. గర్భిణులను 108 వాహనాల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గాలుల తీవ్రత వల్ల సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటంతో 30 వైర్లెస్ సెట్లను సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా రిజర్వాయర్లలో నీరు నింపుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. 278 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా చేశారు. మొగల్తూరు, నరసాపురం మండలాల పరిధిలో 112 బోట్లకు లంగరు వేయించి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా నిలిపివేశారు. 8 మండలాల్లో 130 మంది అగ్నిమాపక సిబ్బంది, 9 ఫైర్ ఇంజిన్లు ఆధునిక రంపపు యంత్రాలు, కట్టర్లను సిద్ధంగా ఉంచారు. తీర ప్రాంతాలకు తహసిల్దార్లు పునరావాస కేంద్రాలను నిర్వహించేందుకు నరసాపురం మండలం తూర్పు వేములదీవి గ్రామానికి ముగ్గురు తహసిల్దార్లను వెస్ట్ వేములదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక, బియ్యపు తిప్ప, చినమైనవానిలంక, గంగసల మెరక గ్రామాలకు ఐదుగురు తహసిల్దార్లు, మొగల్తూరు మండలానికి ముగ్గురు తహసిల్దార్లతో కూడిన బృందాలను పంపించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. మేలుకున్న విద్యుత్ శాఖ హెలెన్ తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లెహర్ తుపానును ఎదుర్కోవడానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లాకు ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సింహాద్రిని ప్రత్యేకాధికారిగా సంస్థ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు నియమించారు. డీఈ స్థాయి అధికారి పర్యవేక్షణలో సాంకేతిక బృందాన్ని సన్నద్ధం చేశారు. 11 సబ్స్టేషన్లలోని దాదాపు 50 ఫీడర్ల పరిధిలో లెహర్ ప్రతాపం చూపనుంది. తీరానికి సమీపంలో ఉన్న ఎనిమిది సెక్షన్లలో విద్యుత్ స్తంభాలు పడిపోతే పునరుద్ధరించడానికి 300 మందిని, పడిపోరుున చెట్లను తొలగించేందుకు తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం నుంచి ఉత్తరాంద్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం నుంచి ప్రత్యేకాధికారులు, సిబ్బంది, కార్మికులను రప్పిస్తున్నారు. జిల్లా యంత్రాగంతో పాటు దాదాపు వెరుు్య మందిని సిద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి మండలానికి రెండేసి పొక్లెయిన్లు, విద్యుత్ రంపాలను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. -
‘లెహర్’తో కలవరం
పాలకొల్లు, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు డెల్టా ప్రాంతంలోని రొయ్యల రైతులను భయపెడుతున్నాయి. రొయ్యల సాగుకు అన్నీ అనుకూలిస్తే కాసుల పంట కురిపించడమే కాదు. అదే తేడా వస్తే అంతే తీవ్రంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాపై లెహర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో రొయ్యలు సాగు చేసే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్టోబర్ నెలలోని పై-లీన్ తుపాను కారణంగా వారం రోజులపాటు వాతావరం చల్లబడిపోవడంతో చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్ అందక వేలాది ఎకరాల్లోని రొయ్యలు చనిపోయాయి. అలాగే తుపాను అనంతరం వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు ఇదే సంకట పరిస్థితి నెలకొంది. దీనితో సరియైన కౌంటుకు రాకుండానే రొయ్యలు పట్టుబడి పట్టడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల హెలెన్ తుపాను కారణంగా డెల్టా ప్రాంతంలో అనేక విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడడం వంటి కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం లెహర్ తుపాను ఉభయగోదావరి జిల్లాల పై తీవ్ర ప్రభావం చూపనుందనే సమాచారంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయంతోపాటు భారీ వర్షాలు కురిస్తే చెరువులు వర్షం నీటితో నిండిపోయి గట్లు తెగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన సమయంలో తుపాను ప్రభావం చెరువులపై ఏమాత్రం చూపిన తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. -
జోరు తగ్గిన లెహర్ అయినా..అటెన్షన్
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:లెహర్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమయింది. నష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపట్టింది. తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్ శోభ పర్యటించి మత్స్యకారుల్లో అవగాహన కల్పించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఆరు తీర ప్రాంతాలకు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. అనుబంధంగా 19 గ్రామాలకు సైతం మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. జిల్లావ్యాప్తంగా 34 పునరావాస కేంద్రాలను గుర్తించారు. వీటిలో 14 తీరప్రాంత గ్రామాల్లో ఉన్నాయి. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభావం అంతంత మాత్రమే... లెహర్ తుఫాన్ ప్రభావం జిల్లాపై తక్కువగా ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లెహర్ మచిలీపట్నం వైపు కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. గురువారం మధ్యాహ్నానికి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రకటించిన విధంగా గంటకు 200కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం లేదు. అధికారులకు సెలవులు రద్దు తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులకు సెలవులు రద్దు చేశారు. వీఆర్వో స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో 08963-221006, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 08922-236947, కలెక్టరేట్లో 08922-236947 నంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఫిర్యాదులు స్వీకరించేందుకు 08922-222942 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకాధికారుల నియామకం భోగాపురం మండలంలోని చేపలకంచేరు గ్రామానికి జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, కొంగవానిపాలేనికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి మెప్మా పీడీ రమణ, కోనాడకు డీఆర్డీఏ పీడీ ఎన్.జ్యోతి, చింతపల్లికి హౌసింగ్ ఈఈ నారాయణస్వామి, కొల్లాయి వలస గ్రామానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి, పతివాడకు డీసీసీబీ సీఈఓ శివశంకర్ ప్రసాద్‌లను నియమించారు. జేసీబీలు సన్నద్ధం. వర్షాలు, ఈదురు గాలులు వస్తే రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడానికి వీలుగా ఆర్అండ్బీ అధికారులు జేసీబీలను సిద్ధం చే శారు. అలాగే నీరు బయటకు వచ్చే అవకాశం ఉన్న చెరువులకు గండ్లు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వాగులు పొంగి నీరు ప్రవహించే సమయంలో రాకపోకలు సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ ప్రయాణాలు రద్దుచేసుకోవాలని కోరారు. సముద్రంలోకి వెళ్లిన 116 బోట్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
తీవ్రత తగ్గుముఖం.. అయినా అప్రమత్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను దిశ మారటంతో జిల్లాపై దాని ప్రభావం తగ్గుముఖం పట్టనుంది. దీనివల్ల పెనుముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం ఉదయానికే సర్వ సన్నద్ధమైంది. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సహాయక బృందాల నియామకం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మండల ప్రత్యేకాధికారుల నియామకాన్ని పూర్తిచేసింది. కళింగపట్నం, కాకినాడల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పధానంగా తీరప్రాంత మండలాలైన రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకిల్లో 17 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆ కేంద్రాలకు కావాల్సిన రేషన్ సరుకులు, లాంతర్లు, కిరోసిన్‌లను సిద్ధం చేసింది. కేంద్రాల నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేసింది. జాతీయ విపత్తు రక్షక దళాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే బుధవారం సాయంత్రం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలను విశాఖపట్నం నుంచి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదీ తాజా పరిస్థితి తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, మండల ప్రత్యేకాధికారులు బుధవారం పలు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి లెహర్ తుపాను ప్రభావం జిల్లాపై కొంతమేర తగ్గిందని కలెక్టర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని తెలిపారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. -
బలహీనపడుతున్న లెహర్ అయినా అలర్ట
=దిశ మార్చుకున్న తుపాను =మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం =ఇంకా ప్రమాదం పొంచిఉంది: కలెక్టర్ =నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను దిశమారినప్పటికీ జిల్లాకు ముప్పు పొంచి ఉంది. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నా..దాని ప్రభావం విశాఖపై కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దాని ఛాయలు కనిపించనప్పటికీ గురువారం తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 180 నుంచి 200 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ఈమేరకు అధికారులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ లిఫ్టింగ్ కోసం రెండు హెలికాప్టర్లను కూడా రప్పించారు. గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మండలాలకు బృందాలు : తుపాను ప్రభావ మండలాలకు నియమించిన జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులతో పాటు మండల స్థాయి అధికారులు గ్రామాల్లోనే ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మండల కేంద్రాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాయి. అధికారులు గ్రామస్తులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 120 మందితో కూడిన ఆర్మీ బృందం గురువారం తెల్లవారుజామున జిల్లాకు చేరుకోనుంది. వీరితో పాటు 20 నావికాదళ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖకు చెందిన 20 బృందాలు కూడా మండలాల్లో మకాం వేశాయి. పునరావాస కేంద్రాలకు ససేమిరా : లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 55 గ్రామాలను తరలించాలని అధికారులు భావించారు. బుధవారం నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నించారు. అయితే జనం కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో అధికారులు కూడా ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఏ మాత్రం వర్షాలు పడినా వెంటనే వారినితరలించడానికి వీలుగా వాహనాలను కూడా సిద్ధం చేశారు. వెళ్లని వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. అధికారులు హెచ్చరించినా కొందరు మత్స్యకారులు బుధవారం వేటకు వెళ్లారు. ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోట్లు చాలా వరకు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా 40 బోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా బోట్ల యాజమాన్యాలతో అధికారులు మాట్లాడి వాటిని వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష గోనె సంచెల్చు : ఇటీవల వచ్చిన వరదలకు మూడు రిజర్వాయర్ల పరిధిలో గట్లకు గండ్లు పడ్డాయి. వాటికి ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. లెహర్ తుపాను కారణంగా భారీ వర్షాలు సంభవిస్తే మరోసారి గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష గోనె సంచులను కొనుగోలు చేశారు. వాటిని జిల్లాలోని అయిదు నీటి పారుదల శాఖ సర్కిళ్లకు పంపారు. -
చెన్నె దిశగా లెహెర్ తుఫాను పయనం
విశాఖ : లెహెర్ తుపాను చెన్నై దిశగా పయనిస్తున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పోర్ట్‌బ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లెహెర్ తుపాను దిశ మార్పుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు. రేపు అర్థరాత్రి నుంచి ఎల్లుండి ఉదయం పదిగంటల లోపు తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. -
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
-
రేపు తీరం దాటనున్న ‘లెహర్’!
ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం వచ్చే 48 గంటల్లో గంటకు 150-200 కి.మీ.ల వేగంతో పెనుగాలులు ప్రస్తుతం కాకినాడకు 800 కి.మీ దూరంలో తుపాను సాక్షి, విశాఖపట్నం:లెహర్ తుపాను మంగళవారం రాత్రి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 800కి.మీ దూరంలో నిలకడగా ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగానే ఉందని, పెనుతుపానుగా నిర్ధారించేది, లేనిది బుధవారం నాటి వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. లెహర్ తుపాను గురువారం సాయంత్రం మచిలీపట్నం, కళింగపట్నం తీరాల మీదుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. బుధవారం గంటకు 160నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చని, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని, యానాంలోనూ భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను బలపడుతున్న కొద్దీ గుడిసెలు కూలిపోవడం, సమాచార వ్యవస్థ కుప్పకూలడం, రైల్వే ట్రాక్‌లు, రోడ్లు ధ్వంసం అయ్యే అవకాశాలున్నాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచించారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. మెల్లగా కదులుతూ..! లెహర్ తుపాను ప్రస్తుతానికి మెల్లగానే కదులుతోందని అధికారులు చెబుతున్నారు. సోమవారం గంటకు 15 కి.మీ ప్రయాణించి కొద్దిసేపు నిలకడగా ఉంటే మంగళవారం గంటకు 16కి.మీ చొప్పున ప్రయాణించి రాత్రి సమయానికి నిలకడగానే ఉంది. తుపాను మెల్లగా కదులుతుండడం, కొద్దిసేపు నిలకడగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తుంటే దాని తీవ్రత అంచనాలకు అందుకోలేని విధంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దట్టంగా పొగమంచు: రాష్ర్టంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భీమడోలులో 3సెం.మీ, కుప్పం, వెంకటగిరికోట ప్రాంతాల్లో 2సెం.మీ చొప్పున వర్షం కురిసింది. తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 17డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు దట్టంగా కురుస్తుంది. ‘ముందస్తు చర్యలు తీసుకున్నాం’ సాక్షి, హైదరాబాద్ : లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాసం కోసం ఆర్మీ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ దళానికి చెందిన 4 హెలికాప్టర్లను, 4 కాలమ్స్ (ఒక్కో కాలమ్‌లో 100 మంది) ఆర్మీని తీసుకున్నట్టు చెప్పారు. రైల్వేశాఖ అప్రమత్తం: లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు చర్యలకు నడుం బిగించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయి, తాము తీసుకునే చర్యల గురించి వివరించారు. అనంతరం రైల్‌నిలయంలో ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఎంతటి ఉపద్రవం ఎదురైనా ప్రయాణికుల ఇబ్బందులను వీలైనంత తగ్గించేలా చూడాలన్నారు. 28న రైలు ప్రయాణం కష్టమే! విశాఖపట్నం, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే ట్రాక్‌లతోపాటు విద్యుత్ ట్రాక్షన్‌పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నందున రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న రైల్వే ప్రయాణాలు సజావుగా సాగే అవకాశాలుండవని అభిప్రాయపడుతున్నారు. -
తీరంలో అలజడి
ఏలూరు, న్యూస్‌లైన్: వరుస ఉపద్రవాలతో అతలాకుతలమైన జిల్లాను లెహర్ తుపాను వణికిస్తోంది. జిల్లాపై బుధవారం మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, గురువారం తీరం దాటే సమయంలో తీవ్రరూపంలో విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. నష్ట నివారణ చర్యలపై సమీక్ష : రానున్న రెండురోజుల్లో లెహర్ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమై నష్టనివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌తో కలసి ఏలూరులో జిల్లా అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రఘువీరా ఆదేశించారు. సహాయక చర్యలకు నిధుల కొరత లేదని చెప్పారు. పై-లీన్, హెలెన్ తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించడానికి అవసరమైన బృందాలను నియమించాలని జేసీ టి.బాబూరావునాయుడును ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీ కనుమూరి బాపిరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), రాష్ట్ర చిన్న నీటిపారుదల అభివృద్ధి మండలి చైర్మన్ ఘంటా మురళి, ఇరి గేషన్ ఎస్ఈ వైఎస్ సుధాకర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పాల్గొన్నారు. నరసాపురంలో కలెక్టర్ మకాం తుపాను నేపథ్యంలో కలెక్టర్ సిద్ధార్థజైన్ నరసాపురంలో మకాం చేశారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం వర్షాలతో తుపాను ఆరంభమవుతుం దని, గురువారం నాటికి భారీ గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు లెహర్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రెవెన్యూ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ నిరవధికంగా పనిచేస్తాయి. -
రాష్ట్రం దిశగా కదులుతున్నపెను తుపాను లెహర్
విశాఖ: రాష్ట్రం దిశగా పెను తుపాను లెహర్ కదులుతోంది. పై-లిన్ , హెలెన్ తుపాను అనంతరం ఏర్పడిన ఈ లెహర్ తుపాను గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోంది. మచిలీపట్నంకు 960 కి.మీ, కాకినాడకు 920కి.మీ, విశాఖపట్నంకు 870 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమయ్యింది. 28వ తేదీ మధ్యాహ్నం తీరందాటే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ వద్ద తీరందాటే సమయంలో ఉత్తరకోస్తా, ఒరిస్సాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలుల వేగం గంటకు 200కి.మీ వరకూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంచుకొస్తున్న లెహర్ తుపాన్ విశాఖ మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరుస తుఫానులతో వేట అతలాకుతలమైంది. తాజా పెను తుఫాను ఏ కొంప ముంచుతుందోననే భయం మత్స్యకారులను వెంటాడుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 6వందల బోట్లకుపైగా వేట సాగిస్తున్నాయి. ఒక్కో బోటుపై 9మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. వందలాది మత్స్యకార కుటుంబాలు వీరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి 45 రోజులు నిషేధం గడువు ముగిసిన తర్వాత.. వేట ప్రారంభించిన మత్స్యకారులకు ఆది నుంచి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తుఫానులు, అల్పపీడనాలతో వేట నామమాత్రంగానే సాగుతోంది. ఐతే గతంలో ఎన్నడూలేని విధంగా వరుసగా వస్తున్న పెను తుపానులతో కోలుకోలేని విధంగా దెబ్బతగులుతోంది. అక్టోబర్‌లో ఫై-లీన్ తుఫాను మత్స్యకార బతుకులను చిన్నా భిన్నం చేసేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే హెలెన్. ఇది తీరం దాటకుండానే అండమాన్ నుంచి పెను తుఫాను లెహర్ తరుముకొస్తుందన్న వార్త.. మత్స్యకారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.15 రోజులకు సరిపడా రేషన్ సరుకులు, చేపలు నిల్వ ఉంచేందుకు ఐస్‌తో వేటకు సిద్ధమవుతోన్న సమయంలో ఈ వార్త వారిని దిక్కుతోచని స్థితిలో పడేసింది. బోట్లన్నింటిని జెట్టీలకే పరిమితం చేశారు. సముద్రంలో అలల ఉధృతి, ఆటు పోట్లతో వేట సాగించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ పెను తుపానుగా దూసుకొస్తోంది. ఈ తుపాను కాకినాడకు 1054 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి (28వ తేదీకి ) అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లెహర్ తుపాను కారణంగా ఈనెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ సెలవు ప్రకటించారు. లెహర్ కారణంగా పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయి. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. -
‘లెహెర్’ మాటున ‘మాదీ’
విశ్లేషణ: తాజాగా బంగాళాఖాతం నుంచి చడీచప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకకా లంలో ఎదుర్కొంటున్నన్ని ఉప ద్రవాలు, ఇంతటి తీవ్రస్థాయి లో, ఇంతకుముందెన్నడూ ఎదు ర్కొనలేదంటే అతిశయోక్తి కాదే మో! వీటిలో కొన్ని ఉపద్రవాలు ఇటీవలి మాసాలలో వరసగా వచ్చిన పెనుతుపానులు. కాగా, తెలుగువాళ్లు ప్రకృతి వైపరీత్యా లను సహితం మించిపోయి గాడితప్పిన ‘ప్రవృత్తి’ మూలంగా తెలుగు జాతినే ముమ్మరించిన అనర్థదాయకై మెన కృత్రిమ ‘తుపానులు’ కూడా చూస్తున్నాం! కొని తెచ్చుకుంటున్న ఆపద బంగాళాఖాతం స్థావరంగా తరచుగా కోస్తా ప్రాంతాల నూ, అప్పుడప్పుడూ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ను చుట్టబెడుతూన్న తుపానులకీ, తమ అవసరాల కోసం మనుషులు ప్రాణదాత ఈ పర్యావరణాన్నీ, ప్రకృతి సంప దనూ కుళ్లబొడుస్తున్న ఫలితంగా తలెత్తుతున్న పరిణామా లకీ ఉన్న సంబంధం గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరి శోధిస్తూనే ఉన్నారు. అలాగే మనకు మనం దెబ్బతీసుకుం టున్న సమతుల్యత గురించి కూడా ప్రపంచ వ్యాపితం గానే శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రజ్ఞులూ నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. భూఖండం ఎలా వేడెక్కిపోతున్నదో, దాని ప్రభావం వాతావరణ పరిస్థితుల మీద ఎలా పడుతున్నదో కొంత కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణంలో పెరిగిపోతున్న బొగ్గుపులుపు వాయు సాంద్రతనూ, కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంత ఉందో ఘోషిస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పుల వల్ల పెక్కుమార్లు సంభవిస్తున్న తుపానులు, పెనుతుపానులు దేశాలను ముప్పెరగొంటూ పంటలూ పరిసరాలనూ అతలాకుతలం చేస్తూ జన జీవితాన్ని ఎలా అల్లకల్లోలంలోకి నెడుతున్నాయో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. విస్మరించరాని విషయాలు కొలది రోజులలోనే రెండు పెను తుపానులు (ఫయలిన్, హెలెన్) ఆంధ్రప్రదేశ్‌ను చుట్టుముట్టి లక్షలాది ఎకరాల లోని వరి, పత్తి, అరటి, కొబ్బరి, కూరగాయలు, మామిడి, బొప్పాయి వగైరా పంటలనీ, తోటలనీ నేలమట్టం చేశా యి. జన నష్టం కలిగించాయి. ఇళ్లను, ఇతర ఆస్తులను ఊడ్చిపెట్టాయి. అనేక గ్రామాలను ముంచెత్తాయి. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానం తోడు వచ్చినందున వాతావరణ శాస్త్రవేత్తలు కొంతకాలంగా చాలా సందర్భాలలో చేస్తున్న వాతావరణ హెచ్చరికలు అంచనాలు తప్పడం లేదనుకుం టున్న సమయమిది. అయితే శాస్త్రవేత్తలను సహితం పల్టీలు కొట్టించే పెను తుపానులు ఆకస్మికంగా విరుచుకు పడుతున్నాయి. పర్యావరణంలో వేగంగా ముమ్మరిస్తున్న మార్పులను మనం ఎంత మాత్రం విస్మరించే వీలులేదని ఈ విపరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ‘వానకన్నా ముం దు వరద’ అన్నట్టుగా ఈ పరిణామం ఆకాశంలోనూ, నేల మీద, సముద్రాంతరాలలోనూ జరుగుతోందని పలు దేశాల పరిశోధకుల అంచనా. పొంచి ఉన్న ‘మాదీ’ తాజాగా బంగాళాఖాతం నుంచి చడీ చప్పుడు లేకుండా దూసుకువస్తూన్న ‘లెహర్’ తుపాను నవంబర్ 28న కోస్తాంధ్రను భీకరంగా తాకబోతున్నట్టు హెచ్చరికలు వస్తున్నాయి. ‘హెలెన్’ పేరుతో ఉన్న తుపాను శాంతించక ముందే ‘లెహర్’ ముంచుకొచ్చే సూచనలు కనిపిస్తున్నా యి. దీనితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కకావికలమయ్యే ప్రమాదం మరింత పెరగవచ్చు. కథ అప్పుడే ముగిసేట్లు లేదు! ‘లెహర్’ తర్వాత రంగంలోకి దూకడానికి అప్పుడే మరొక ఉగ్ర తుపాను ‘మాదీ’ కాచుకు కూర్చుంది సుమా! ఈసారి ‘లెహర్’ తుపాను బీభత్సం వాయువేగాన్ని 170-180 కిలోమీటర్లకు పెంచే ప్రమాదముందనీ సంకేతాలు వస్తున్నాయి. ఈ సరికొత్త తుపాను తీవ్రతను శాస్త్రవేత్తలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తుపాను శక్తిని కొలిచే ‘స్టాషిర్-సింస్సన్’ (భూకంపాల శక్తిని అం చనా వేసే ‘రిక్టర్ స్కేల్’ లాగా) ద్వారా అంచనా వేశారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం తొలి ఐదంచెలలో‘లెహర్’ ఇప్పటికి మూడవ స్థానంలో నిలిచింది! మొదటి రెండు పెద్ద తుపానులూ తమ చలనగతిని ఆకస్మికంగా ఒక స్థానం నుంచి మరొక మార్గంలోకి చిత్రగతులలో అనూ హ్యంగా సాగిపోయి శాస్త్రవేత్తలను, పాలనా యంత్రాం గాన్నీ నిద్రాహారాలు లేకుండా చేశాయి. ఈశాన్య రుతు పవనాల పేరిట ఈ పెనుతుపానులు సాగిస్తున్న ‘దోబూ చులాట’ ప్రజా బాహుళ్యానికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థి తికీ అగ్ని పరీక్షగా పరిణమించింది. దక్షిణ అండమాన్ దీవులలోని ఫోర్ట్బ్లెయిర్కు 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ‘లెహర్’ కేంద్రీకరించి ఉంది. ఇది కూడా ఏ ‘చాపల్యం’తో తన చలనగతిని ఎప్పుడు, ఎలా మార్చుకుంటుందో శాస్త్ర వేత్తలకు కూడా అంతుచిక్కని జోస్యం గానే ఉండిపోయే లా ఉంది! 2010లో తమిళనాడు కోస్తాలో కేంద్రీకరించిన ‘జాల్’ నుంచి ‘లెహర్’ దాకా తుపానులు ప్రజాజీవనానికి ప్రమాదకర సంకేతాలు అందిస్తూనే వచ్చాయి! ఇవి సుడి తుపానులు ఆసియాతో పాటు ప్రపంచంలోని పలు ఖండాలలో, భార త్తో పాటు పెక్కు దేశాలలో వాతావరణం కేవలం సాధా రణ తుపానుల స్థాయి దగ్గరే ఉండిపోవడం లేదు. వాటిని దాటి, తరచుగా ‘సుడి తుపానులు’ (టార్నొడోలు) కూడా అవతరిస్తున్నాయి. ఈ దృశ్యాలనే మహాకవి శ్రీశ్రీ ‘టార్నా డో, టార్పీడో / అవి విలయం / ఇది సమరం’ అని ఆలం కారికంగా వర్ణించాడు! ఈ వాతావరణ, ప్రకృతి విలయ దృశ్యాలకు శాస్త్రవేత్తలు భీకర తుపానుల ప్రత్యేకతను గుర్తించడానికి కొంత కాలంగా కొన్ని పేర్లను పెడుతు న్నారు. అలాంటివే ‘జాల్’, ఫయలిన్, హెలెన్. గురు వారం (28న) విలయ నృత్యానికి కుచ్చెళ్లు సవరించు కుంటున్న ‘లెహర్’! శివుడి ‘మూడోకన్ను’ లాంటి ఈ ‘ఉగ్రతుపానుల’ పుట్టుకకు కేంద్రస్థానం పసిఫిక్ మహాస ముద్రమని ఒక అంచనా! దశాబ్దన్నరగా వాతావరణం లోకి చొచ్చుకువచ్చిన ఈ వినూత్న దృశ్యానికే / వ్యవస్థకే ‘పసిఫిక్ ఫినామినా’ అని పేరు! ఎల్-నినో; లా-నీనా ఈ మార్పుల వల్ల రెండు రకాల కొత్త పరిణామాలు దూసు కువచ్చాయి. ఒకటి ఎల్-నినో, రెండు లా-నీనా. వీటిలో ఒకటి ప్రపంచంలో పలుచోట్ల తీవ్ర కరవు పరిస్థితులకు దారితీయగా, మరొకటి బిళ్లబీటుగా విరుచుకుపడే పెను తుపానులకూ దారితీస్తుంది. ఈ పరిణామాలు కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రేపు ముమ్మరించనున్న సరికొత్త ‘లెహర్’ తుపాను సహా ఫయిలిన్, హెలెన్లు ఈ అసాధా రణ పరిణామంలో భాగమేనని గుర్తించాలి. ఇటీవల ప్రతీ రెండు మూడేళ్లకూ క్రిస్మస్ సమయంలో, ఈ పరిణామం దేశాలపైన ‘దాడుల’కు సిద్ధమవుతోంది! ఎన్ని ఉపగ్ర హాలు మన నెత్తిమీద తాండవిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ‘ఉగ్రతుపాను’ల బెడద ‘వానరాకడ, ప్రాణం పోకడ తెలియవన్న’ నానుడిలాగానే తయారైంది! ఇటీవల మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహానికి పంపించిన ‘మామ్’ భూమికి 80,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి విస్పష్టమైన వాతావరణ తొలి ఛాయాచిత్రాన్ని పంపించింది. రాక్షసుల మాదిరిగా నోళ్లు తెరుచుకుని చిత్రగతులలో సంచరిస్తున్న తుపాను మేఘాల తాండవ దృశ్యాల్ని అందులో చూపిం చింది! ఎందుకంటే, భూ ఉపరితలంలో 71 శాతం ప్రాం తాన్ని సముద్రాలు, మహా సముద్రాలూ చుట్టబెట్టి ఉన్నా యి. ఇందులో భూఖండం మీద ఉన్న జలరాశిలో 97 శాతం నీళ్లు మహాసముద్రాల అధీనంలో ఉన్నాయి! ప్రతి రోజూ ప్రపంచం చుట్టూ ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు 40,000 దాకా ఉంటాయని అంచనా! పరిమితులు గుర్తించొద్దా? 1959 సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను ‘వీరా’ 5,000 మంది చావుకు కారణం కాగా, 1977లో దివిసీమను కుదిపేసిన ఉగ్రతుపాను 10,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు తోడుకుంది! కాగా, 1990 నాటికే ప్రపంచ వ్యాపితంగా వాతావరణ హెచ్చరికల కోసం, పరిశీలన కోసం ఏర్పడిన 10 వేల పరిశోధనా కేంద్రాలు, 800 సౌండింగ్ స్టేషన్లు, వందల కొలది పరిశోధనా నౌకలూ, సముద్రాల ప్రవర్తనా సరళి గురించి గాని, వాతావరణ ప్రవర్తన గురించి గానీ కీలకమైన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాబట్టుకోలేక పోతున్నామని శాస్త్రవేత్తలే ప్రకటించడం మానవుడి పరి మితుల్ని కూడా మరొక్కసారి గుర్తు చేసినట్టవుతోందని పరి శోధకుల అంచనా! ఏ పరిశోధనలు, ఏ శాస్త్ర చర్చలు ఎలా ఉన్నా, అగ్రరాజ్యాలు రకరకాల పేర్లతో అణుపాటవ పరీక్షల్ని, కాలుష్య నివారణకు నిర్దేశించిన ‘క్యోటో’ సభ తీర్మానాల ఉల్లంఘనలను శాశ్వతంగా ఆపకుండా వాతా వరణంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ మానవాళి కనీస విజయాలను కూడా సాధించలేదు! - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
లెహర్ తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఈనెల 28న మచిలీపట్నం-కాకినాడ సమీపంలో తుపాను తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆర్డీవోలు, తహశీల్దారులు, ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. లెహర్ తుపానుప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని సూచనలు జారీ చేయాలని, తుపాను సమయంలో రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల తుది జాబితా ప్రకటన జనవరి 16 తేదీలోపు చేయాలిన నేపథ్యంలో ఓటర్ల నమోదు, అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జె.సి వివేక్ యాదవ్, ఆర్డీవో కె.నాగబాబు, జిల్లా పరిషత్ సీఈవో సత్యన్నారాయణ తదితరులు ఉన్నారు. నిత్యావసరాలు సిద్ధం చేసుకోండి.. లెహర్ తుపాను కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలింపునకు విస్తృత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పి.కె మహంతి జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కోస్తా జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసుకోవాలని, కిరోసిన్, నిత్యావసర సరుకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిల్వ లేకుంటే తక్షణమే కావలసిన సరుకుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో జిల్లా అంతటా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో అర్బన్, రూరల్ ఎస్పీలు జెట్టి గోపీనాథ్, జె.సత్యన్నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెరుగైన ‘మీ సేవ’లకు చర్యలు జిల్లాలోని మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురే శ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఈ-గవర్నెన్స్ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీసేవ ద్వారా సేవలందిస్తున్న 21 శాఖల జిల్లా అధికారులను కూడా సభ్యులుగా చేర్చాలన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ స్థాయిలో కూడా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మీసేవలు అందుతున్న తీరుపై తహశీల్దార్లు, ఆర్డీవోలు ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోఅదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డిఆర్వో కె.నాగబాబు, మీసేవ డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తీరం గజగజ
రేపల్లె, న్యూస్‌లైన్ :‘హెలెన్’ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగుకాకముందే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో జిల్లాలోని తీర మండలాలు వణికిపోతున్నాయి. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుం డంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహెర్’గా నామకరణం చేసిన ఈ తుపాను గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద తీరం దాటనుందని అధికారులు వెల్లడించడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొద్ది రోజుల కిందట పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పంటలు దాదాపు దెబ్బతిన్నాయి. తాజాగా లెహెర్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే మిగిలివున్న కొద్ది పాటి పంటలు కూడా దక్కవని రైతులు దిగులు చెందుతున్నారు. మరో వైపు తీరంలో ‘అలజడి’ నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం వరకు నిజాంపట్నం హార్బర్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగాయి. సముద్రుడు కాస్తంత శాంతించటంతో ఆదివారం మత్స్యకారులు బోట్లు, పడవలతో తిరిగి సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఇంతలో ‘లెెహ ర్’ రూపంలో మరో తుపాను ముంచుకువస్తోందని తెలియడంతో తీరంలో అలజడి ప్రారంభమైంది. ఇప్పటికే నిజాంపట్నం ఓడరేవులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు రావాలని అధికారులు సెల్‌ఫోన్ సమాచారం పంపారు.తల్లడిల్లుతున్న రైతులు .. ‘లెహెర్’ పెను తుపానుగా మారి తీరప్రాంతంపై విరుచుకుపడుతుందని వాతవరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే అధిక వర్షాలు, హెలెన్ తుపాను తాకిడికి తల్లడిల్లిన రైతులు మరో ముప్పు ముంచుకొస్తుండటంతో మరింత దిగాలు పడిపోతున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల్లో సుమారు లక్ష ఎకరాలలో వరి సాగు చేశారు.పై-లీన్,హెలెన్ తుపానుల ప్రభావంతో ఇప్పటికే 55 శాతం పంట దెబ్బతిన్నది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు సుమారు రూ. 20 వేల వరకు కౌలు చెల్లించి వరిసాగు చేశారు. తుపానుల తాకిడికి దెబ్బతిన్న కౌలు రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టు కుంటున్నారు. కౌలు కాకుండా ఇప్పటికే ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖర్చు చేసిన రైతులు పంట నేలకొరిగి నీటిలో నానుతుండటంతో కంట తడిపెడుతున్నారు. కంకిమీద, పొట్టమీద ఉన్న వరిపంట నీటిలో నానడం వల్ల పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. పడిన వరి పంటను కట్టలుగా కట్టేందుకు సుమారు రూ. 7వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం లెహర్ రూపంలో వస్తున్న మరో ముప్పును తలచుకుని కుమిలిపోతున్నారు. మత్స్యకారులకు గడ్డుకాలం.. వరుస విపత్తులతో మత్స్యకారులు కుంగిపోతున్నారు. పై-లీన్,హెలెన్ తుపానుల కారణంగా కొద్ది రోజులుగా సముద్ర వేటకు అంతరాయం కలుగుతూనే ఉంది. ఒకసారి బోటులో వేటకు బయలు దేరితే సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అందులో ఎక్కువ భాగం డీజిల్‌కే ఖర్చు అవుతుంది. వేటకు వెళ్లడం, తిరిగి వెంటనే తిరుగుముఖం పట్టడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. సముద్ర జలాలు కలుషితం కావటంతో తీరంలో ఎక్కువ దూరం వెళితేకాని మత్స్య సంపద దొరకని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు వరుస విపత్తులతో మరింత దెబ్బతినే పరిస్థితి నెలకొంది. -
లెహర్‌పై అప్రమత్తం
=కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ =అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, రెండు మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడవచ్చని చెప్పారు. గుడిసెలు, పెంకుటిళ్లు, నానిన గోడలతో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలో నివసించేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ లేదా స్కూల్ బస్సులను వాడాలని కోరారు. నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో వీఆర్వోలు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో చర్చించి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో హాస్టల్లో పిల్లల రక్షణ ఏర్పాట్లు, భోజన, మంచినీటి ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. శారద, వరాహ, తాండవ రిజర్వాయర్ల పరిసరాల లోతట్టు గ్రామాల ప్రజలను అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తవతియా, డీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పెను తుపానే..
తరుముకొస్తున్న లెహర్ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి, మచిలీపట్నం : బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తీరం వైపు దూసుకొస్తున్న లెహర్ పెను తుపానేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తుపాను మచిలీపట్నానికి 1200 కిలోమీటర్లు, కాకినాడకు 1140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతవరణ శాఖ ప్రకటించింది. ఇది మచిలీపట్నం-కళింగపట్నం రేవుల మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ నెల 27 నుంచే వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దాటిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, తాటాకు ఇళ్లు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యంత్రాంగం అప్రమత్తం ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే హెలెన్ తుపాను కోసం నియమించిన మండల స్థాయి ప్రత్యేక అధికారులను లెహర్కూ కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తుపాను, వరద ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 26 నుంచి అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సోమవారం ఆదేశించారు. మండల స్థాయిలోని అధికారులు తమ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి ఈ నెల 26 ఉదయం పది గంటలకు ఆఫీసుల్లోని ల్యాండ్ లైన్ల నుంచి తనకు ఫోన్లు చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లాలోని ప్రత్యేక అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర పెను తుపానుగా వచ్చే లెహర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మహంతి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రఘునందనరావు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒక రోజు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆహారం, మంచినీళ్లు వంటి వాటిని సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. -
విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో 'లెహర్'
విశాఖ : అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు మరో తుపాను ముంచుకొస్తోంది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఈనెల 28న మచిలీపట్నం, కళింగపట్నం ఓడరేవుల మధ్య కాకినాడకు సమీపాన తీరం దాటే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. లెహర్తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది -
మరో గండంరైతు గుండెల్లో లెహర్రర్
=అన్నదాతపై ప్రకృతి పగ =మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్.. =ముంచుకొస్తున్న మరో ముప్పు =అంతటా కమ్ముకున్న మేఘాలు =అక్కడక్కడా చిరు జల్లులు యలమంచిలి, న్యూస్‌లైన్: అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు తుపాను ముంచుకొస్తోంది. మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్‌కు వర్షాలు ముంచెత్తడంతో రైతులు కుదేలయ్యారు. మరో ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా నష్టాలను చవిచూస్తున్న తాము ఈ గండం నుంచి గట్టెక్కడమెలా అని కలవరపడుతున్నారు. శనివారం వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తుపాన్లు రైతులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల్లో రెండు తుపాన్లు,అల్పపీడనం ఒకదాని వెంట ఒకటి అన్నదాతలను నిలువునా ముంచేశాయి. ఫై-లీన్ ప్రభావం పెద్దగా లేనప్పటికీ జిల్లా రైతాంగాన్ని అల్పపీడనం కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత హెలెన్‌తో కుదేలయ్యారు. మళ్లీ లెహర్ అన్నదాతలను భయపెడుతోంది. దీని ప్రభావం హెలెన్ కంటే తీవ్రంగా ఉంటుందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. నెలరోజులుగా వీరికి కంటిమీద కునుకు ఉండటంలేదు. పంటపొలాల్లోని వరద నీటిని బయటకు తరలించడానికి, వాలిపోయిన, నీటమునిగిన వరిని నిలబెట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో 27,285 హెక్టార్లలో ఆహార పంటలు, 1132 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. ఇంకా పంట నష్టం అంచనా పూర్తికాకుండానే మూడు రోజుల క్రితం హెలెన్ హడలెత్తించింది. జిల్లాలో పెద్దగా వర్షం పడనప్పటికీ, ఈదురు గాలులకు కోత దశలో వరిపంట నేలకొరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా సాంబమసూరి, ఆర్జీఎల్ వరి రకాలను చేపట్టారు. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ ఈ పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 50శాతం పంటను రైతులు కోల్పోయినట్టే. ఇప్పటికే ఏజన్సీతో పాటు మైదానంలో వరి కోత దశలో ఉంది. పలు ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. హెలెన్ కారణంగా కోతలుపూర్తయి. పొలాల్లో ఉన్న వరిపనలు నీటమునిగాయి. వరితోపాటు చెరకు, పత్తి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ గాయం నుంచి తేరుకునే ప్రయత్నంలో రైతులు ఉండగా లెహెర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.