లెహర్ వణుకు
Published Fri, Nov 29 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
బాపట్లటౌన్,రేపల్లె, న్యూస్‌లైన్ :‘లెహర్’ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం సూర్యలంక వద్ద సముద్రంలో అలజడి రేగింది. సుమారు నాలుగు మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరం వెంబడి వంద నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలలు వీచాయి. తొలుత పెను తుపాను అంటూ ప్రమాద హెచ్చరికలు పంపినా లెహర్ బలహీనపడటంతో గురువారం ఉదయం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. వీటికి తోడు మధ్యాహ్నం నుంచి చలిగాలులు కూడా తోడుకావడంతో జిల్లా వణికిపోయింది. వర్షానికి తోడు చలి గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు
తీరం అల్లకల్లోలంగా మారడంతో పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మండలంలోని సూర్యలంక, అడవిపల్లిపాలెం గ్రామాల్లోని ప్రజలను హుటాహుటిన ముత్తాయపాలెం, ఏఎంజీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. గృహాలు విడిచి వచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అని మొండికేసినా సిబ్బంది బలవంతంగా తరలించారు.
తీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్
తీరప్రాంత గ్రామాలైనా అడవిపల్లిపాలెం, సూర్యలంక, ముత్తాయపాలెం గ్రామాల్లో గురువారం జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ పర్యటించారు. లెహర్ తుపాను తీరం దాటిందని అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు,ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, సిబ్బంది మరో 12 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను బాధితులను పునరావాస కేంద్రంలో వదిలి మీకిష్టమొచ్చినట్లు మీరు తిరిగితే కుదరదు అంటూ కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. బాధితులు తిరిగి వారి గృహాలకు వెళ్లే వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహించినా, వారిని పట్టించుకోకపోయినా కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ సేనాపతి ఢిల్లీరావు, తహశీల్దార్ జి.వి.సుబ్బారెడ్డి, డిఎస్పీ ఏ. భాస్కర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఉషాకిరణ్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు వున్నారు.
రైతులకు తప్పని నష్టం.. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాలు, పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో జిల్లాలో పత్తి, మిర్చి,వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. లెహర్ తుపాను రైతులను మరింతగా కుంగదీస్తోంది. హెలెన్ ప్రభావంతో కంకి, పొట్టదశల్లో ఉన్న వరి నేలకొరిగింది. కనీసం పంటను కట్టలు కట్టేందుకు కూడా అవకాశం లేక పోవటంతో రోజుల తరబడి నీటిలోనే నానిపోతున్నది. ఇప్పుడిప్పుడే పంట చేలల్లోని నీరు బయటకు పోతున్న తరుణంలో లెహర్ వర్షాలతో పంటపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. ఈదురు గాలులు కూడా తోడవడంతో వరి పూర్తిస్థాయిలో నేలకొరిగింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు కలవరపడుతున్నారు.
మత్స్యకారుల అవస్థలు
వరస తుపానులతో తీరప్రాంత మత్స్యకారులు తల్లడిల్లుతున్నారు. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పుతోపాటు సముద్రం వేటకు అనుకూలంగా లేకపోవడం, పెనుతుపాను హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులంతా సుమారు 320 పడవలను అడవిపల్లిపాలెంలోని ఈపూరుపాలెం డ్రెయిన్‌లో లంగరు వేసి నిలిపేశారు. మూడు నెలలుగా వేట సాగక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సమయంలో హెచ్చరికలు జారీచేసే అధికారులు రెక్కాడితే కాని డొక్కాడని తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. వరసగా పదిరోజుల పాటు వేటాడిన రోజులు లేవన్నారు.
Advertisement
Advertisement