‘లెహర్’తో కలవరం
Published Thu, Nov 28 2013 4:20 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
పాలకొల్లు, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు డెల్టా ప్రాంతంలోని రొయ్యల రైతులను భయపెడుతున్నాయి. రొయ్యల సాగుకు అన్నీ అనుకూలిస్తే కాసుల పంట కురిపించడమే కాదు. అదే తేడా వస్తే అంతే తీవ్రంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాపై లెహర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో రొయ్యలు సాగు చేసే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్టోబర్ నెలలోని పై-లీన్ తుపాను కారణంగా వారం రోజులపాటు వాతావరం చల్లబడిపోవడంతో చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్ అందక వేలాది ఎకరాల్లోని రొయ్యలు చనిపోయాయి. అలాగే తుపాను అనంతరం వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు ఇదే సంకట పరిస్థితి నెలకొంది.
దీనితో సరియైన కౌంటుకు రాకుండానే రొయ్యలు పట్టుబడి పట్టడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల హెలెన్ తుపాను కారణంగా డెల్టా ప్రాంతంలో అనేక విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడడం వంటి కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం లెహర్ తుపాను ఉభయగోదావరి జిల్లాల పై తీవ్ర ప్రభావం చూపనుందనే సమాచారంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయంతోపాటు భారీ వర్షాలు కురిస్తే చెరువులు వర్షం నీటితో నిండిపోయి గట్లు తెగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన సమయంలో తుపాను ప్రభావం చెరువులపై ఏమాత్రం చూపిన తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
Advertisement
Advertisement