తీవ్రత తగ్గుముఖం.. అయినా అప్రమత్తం | Lehar cyclone district administration Rail blockade in srikakulam | Sakshi
Sakshi News home page

తీవ్రత తగ్గుముఖం.. అయినా అప్రమత్తం

Published Thu, Nov 28 2013 3:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Lehar cyclone  district administration Rail blockade in srikakulam

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను దిశ మారటంతో జిల్లాపై దాని ప్రభావం తగ్గుముఖం పట్టనుంది. దీనివల్ల పెనుముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం ఉదయానికే సర్వ సన్నద్ధమైంది. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సహాయక బృందాల నియామకం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మండల ప్రత్యేకాధికారుల నియామకాన్ని పూర్తిచేసింది. కళింగపట్నం, కాకినాడల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
 పధానంగా తీరప్రాంత మండలాలైన రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకిల్లో 17 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆ కేంద్రాలకు కావాల్సిన రేషన్ సరుకులు, లాంతర్లు, కిరోసిన్‌లను సిద్ధం చేసింది. కేంద్రాల నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేసింది. జాతీయ విపత్తు రక్షక దళాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే బుధవారం సాయంత్రం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలను విశాఖపట్నం నుంచి తీసుకురావాలని నిర్ణయించింది.
 
 ఇదీ తాజా పరిస్థితి
 తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, మండల ప్రత్యేకాధికారులు బుధవారం పలు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు.
 
 ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
 లెహర్ తుపాను ప్రభావం జిల్లాపై కొంతమేర తగ్గిందని కలెక్టర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 
 అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని తెలిపారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement