Saurabh Gaur
-
జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మిడియెట్ విద్యామండలి కమిషనర్ సౌరభ్ గౌర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్ఐవోలు అన్ని మేనేజ్మెంట్స్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు. విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా http://www.scholarships.gov.in వెబ్సైట్లో స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2023–24) ఇంటర్మీడియెట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే మార్చిలో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు తమ తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ మంగళవారం తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 30వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ♦ మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకటి, రెండో ఏడాది ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ♦ ఇంటర్మీడియెట్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1,100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ♦ ఇప్పటికే ఇంటర్మీడియెట్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,240, సైన్స్ విద్యార్థులు రూ.1,440 చెల్లించాల్సి ఉంటుంది. -
ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా టీసీఎల్ గ్రూప్.. టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్ప్లే ప్యానల్స్‌ను టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది. ♦ సెల్‌ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. -
వెంకయ్య వ్యక్తిగత కార్యదర్శిగా సౌరభ్ గౌర్
న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా గురువారం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ నియమితులయ్యారు. మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక అధికారిగా ఉన్నత్ పి.పండిత్‌ను నియమించారు. -
జెడ్పీలో పదోన్నతులకు బ్రేక్!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్‌లోని ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియ ర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేం దుకు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆమోదం తెలి పినా జెడ్పీ అధికారులు ఉత్తర్వులు వెలువరించకుండా జాప్యం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జిల్లా పరిషత్ బాధ్యతలు చేపట్టనున్న ప్రజాప్రతినిధి బంధువు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఉత్తర్వుల జారీ నిలిచిపోవటానికి కారణమని సమాచారం. వాస్తవానికి, ఈ పదోన్నతుల ఫైల్ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కారణంగా దీని పరిశీలన వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికల హడావుడి ముగియటంతో రెండు రోజుల క్రితం కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఈ ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ పదోన్నతులు పొందినవారికి సీట్లను సైతం కేటాయించినట్టు తెలిసింది. అయితే ఉత్తర్వులు ఇంకా జారీ కాకపోవటంతో పదోన్నతులు పొందనున్న ఉద్యోగులు శుక్రవారం జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతులు పొందనున్నవారిలో కొందరు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి తమ స్థానాలకు మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బాధ్యతలు చేపట్టకముందే ప్రజాప్రతినిధి తరపు బంధువులు అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని వారు తప్పుపట్టారు. కలెక్టర్ ఆమోదించిన మేరకు స్థానాలను కేటాయించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా పదోన్నతుల ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలపై ఆంక్షలు విధించారని తెలియడంతో నిలుపుదల చేశామని చెప్పారు. తమపై ఎవరు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాను మార్చలేమని పేర్కొన్నారు. -
వైద్య ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం
పనితీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్: వైద్యాధికారులు, వైద్యశాఖ ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పురాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఎస్పీహెచ్వోలతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సిన వైద్య ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఎంతమాత్రం సరికాదన్నారు. దోనుబాయి పీహెచ్‌సీని ఇటీవల అకస్మికంగా తనిఖీ చేయగా..ఆ సమయంలో తాళాలు వేసి ఉందన్నారు. 24 గంటలు తెరచి ఉండాల్సిన పీహెచ్‌సీకి తాళాలు వేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మరికొన్ని పీహెచ్‌సీలను తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది సరిగ్గా ఉండకపోవటం వంటి సమస్యలను గుర్తించానన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. చాలామంది ఉద్యోగులు బాధ్యతరహితంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలోని గుమస్తాలను పిలిచి ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో కలెక్టర్ ఆరా తీశారు. అయితే కొంతమంది తడబడటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలో తానే నిర్ణయించి జాబ్ షీట్ వేస్తానని చెప్పారు. ‘మార్పు’ కార్యక్రమం బాగా నిర్వహించినందుకు జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం దక్కిందన్నారు. ఇందుకు సీతంపేట, నరసన్నపేట పీహెచ్‌సీల సిబ్బంది బాగా సహకరించారని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్.ఆర్.హెచ్.ఎం వివరాలను పొందుపరిచేందుకు గాను కొత్తగా వచ్చిన ల్యాప్‌టాప్‌లను పీహెచ్‌సీల వైద్యాధికారులకు పంపిణీ చేశారు. కాగా సమావేశానికి వస్తున్నప్పడు కార్యాలయంలోని లిఫ్ట్ పని చేయకపోవటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 25 వేలు ఖర్చు పెట్టి లిఫ్ట్ బాగు చేసుకోకపోతే ఎలా అంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అలాగే కార్యాలయంలో బూజు పట్టి ఉండటం చూసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉంటున్న కార్యాలయం ఇలా ఉండటం సరికాదని కలెక్టర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఏజేసీ మహ్మద్ షరీఫ్, డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెంది.. పదో తరగతి ఫలితాల్లో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఘనంగా సత్కరించారు. ‘ఉత్తమ ప్రతిభకు అభినందనలు’ నామకరణంతో శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. 10 పాయింట్లు సాధించిన 32 మందికి ప్రశంసాపత్రం, రూ.2,500 నగదు, టైటాన్ రిస్ట్ వాచ్‌లను బహూకరించారు. అలాగే శత శాతం ఫలితాలు సాధించిన 89 పాఠశాలలకు విజయం పాఠశాలల కింద విజయం పతాకం, షీల్డ్‌లను అందజేశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను పర్యవేక్షిస్తున్న 13 మంది ఎంఈవోలకు ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను విజయపథంలో ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జిల్లా 91.68 శాతం ఫలితాలు సాధించడానికి అందరి సమిష్టి కృషే కారణమన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించడానికి ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఎంతో శ్రమకు ఓర్చి ఉంటారన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, దేశానికి నిర్మాతలను తయారు చేసి అందిస్తున్నారన్నారు. రేపటి సమాజానికి పునాదులు వేస్తున్నారన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ జిల్లాలో ఏర్పాటు చేశామని, తద్వారా పిల్లల పర్యవేక్షణ జరిగిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో జిల్లా మంచి ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో బాలికలదే పైచేయిగా ఉందన్నారు. సివిల్ సర్వీస్‌లు, బ్యాంకు పరీక్షలు వంటి వాటిలో బాలికలు కనీసం 40 శాతం మంది ఉంటున్నారన్నారు. గత ఏడాది సంస్కారం కార్యక్రమం ద్వారా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. జేసీ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మంచి స్థానాలను అందుకొనడంలో తగిన తర్ఫీదును అందజేయాలన్నారు. డీఈవో ఎస్.అరుణకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది 91.68 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.అచ్యుతానంద గుప్తా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది 94.78 శాతం ఫలితాలు సాధించామన్నారు. సమావేశంలో ఏజేసీ ఎం.డి.హషీమ్షరీఫ్, జీడ్పీ సీఈవో వి.నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.లాలాలజపతిరాయ్, ఆర్వీం అధికారి ఆర్.గణపతిరావు, విజయం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రశంసలందుకున్న పాఠశాలలు... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదమల్లి, అవలంగి, బులుమూరు, మాతల, పూసాం, కొమ్మువలస, రావిచంద్రి, ఎం.సింగుపురం, రొంపివలస, జి.సిగడాం, రాజాం, లింగాలవలస, కాగితాపల్లి, మండాకురిటి, వాల్తేరు, బొడ్డూరు, సిరిపురం, యు.కె.గుమ్మడ, కోణంగిపాడు, నీలానగరం, నర్సిపురం, వీరఘట్టం, కె.కవిటి, సతివాడ, కరవంజ, యలమంచిలి, లింగాలవలస, అచ్యుతాపురం, టి.లింగాలపాడు, బాదాం, వెదుళ్లవలస, అంపలాం, తోలాపి, తాడివలస, తెప్పలవలస, గొర్లెపేట, కిల్లిపాలెం, నవనంపాడు, కె.కొజ్జీరియా, తురగలకోట, పెదబాణాపురం, రౌతుపురం, మర్రిపాడు, కొల్లిపాడు, లింగావలస, తలగాం, మెట్టూరు, వజ్రపుకొత్తూరు, గరుడభద్ర కేజీబీవీలు... భామిని, బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్.పేట, రాజాం, సారవకోట, తురాయిపువలస, వంగర, ఆమదాలవలస, జలుమూరు, కోటబొమ్మాళి, మురపాక, లావేరు, పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, ఇచ్చాపురం, బోరువంక, నందిగాం, బోరుభద్ర, సోంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలు... లబ్బ, ఓండ్రుజోల, శంభాం, పూతికవలస, చినబగ్గ, మల్లి-2, హడ్డుబంగి, దోనుబాయి, గంగంపేట, పట్టులోగాం, బందపల్లి, పెద్దమడి, పెద్ద లక్ష్మీపురం, జయపురం, భీమ్‌పురం, సీతంపేట-2 అవార్డులు పొందిన విద్యార్థులు వీరే... దారపు అప్పలరెడ్డి (జి.సిగడాం), కోన అసిరిరెడ్డి(జి.సిగడాం), తెప్పల ఉష(వజ్రపుకొత్తూరు), వెలుగు జోగమ్మ(టెక్కలి), జి.వి.వి.ఎస్.ఆర్.ఎల్.ప్రసాద్(రాగోలు), కలిశెట్టి వనిత(సారవకోట), పాగోటి రేణుక(సారవకోట), కరిమెల్లి సుకన్య(సారవకోట), చవికి సాయికృష్ణ(జి.సిగడాం), కోల దివ్య(హిరమండలం), వి.డింపుల్(ఇచ్చాపురం), పి.శంకర్(ఇచ్చాపురం), ప్రగడ ఉదయభాస్కర్(జలుమూరు), అంధవరపు శ్యామసుందర్(జలుమూరు), తొగరాపు నాగభూషణరావు(జలుమూరు), చల్లా సత్యనారాయణ(జలుమూరు), గార రామలక్ష్మి(సంతకవిటి), బలగ నరేంద్ర(పాతపట్నం), గొల్లపల్లి రేణుక(పలాస), మజ్జి సౌజన్య(పాలకొండ), గొట్టా చరణ్‌కుమార్(నరసన్నపేట), అన్నెపు కవిత(నందిగాం), ఎం.శేషగిరి(నందిగాం), ఆర్.కృష్ణవేణి (మెళియాపుట్టి), శిర్లా బేబీ ప్రసాద్(మందస), లోపింటి భీమశంకర్(మందస), శిల్పాపాండ్యన్(మందస), ఎస్.మహేష్(కొత్తూరు), బొండాడ ఊర్వశి(కంచిలి), కప్ప సంతోషి(కంచిలి), తుంగాన అశ్విని(కవిటి), సి.హెచ్.స్వాతి(కవిటి). -
జిల్లాకు కొత్త జట్టు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్త ప్రభుత్వం.. కొత్త మంత్రు లు.. కొత్త అధికారులు.. ప్రస్తుతం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఉన్నతాధికార యంత్రాంగంలో సమూల మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అంశం ఇప్పటికే ఉన్నతాధికారుల మార్పునకు బీజం వేసింది. దీనికి తోడు కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టనుండటంతో అధికార యం త్రాంగంలో సమూల మార్పులు జరగనున్నాయి. కలెక్టర్, ఎస్పీ స్థాయి ఉన్నతాధికారుల మార్పు ల్లో జిల్లాలోని అధికార పార్టీ నేతల ప్రమేయం ఏమీ ఉండనప్పటికీ.. వివిధ శాఖల ఉన్నతాధికార పోస్టులపై కన్నేసినవారు మాత్రం టీడీపీ పెద్దల ఆశీర్వాదం కోసం వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలంతా మార్పులు చేర్పులతో కోలాహలం నెలకొననుంది. ప్రస్తుతానికి ఏపీ.. అసలు టార్గెట్ సెంట్రల్కలెక్టర్ సౌరభ్ గౌర్ అభిమతమిదీ! రాష్ట్ర విభజన నేపథ్యంలో కలెక్టర్ సౌరభ్ గౌర్ ఏపీ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారు. హర్యానాకు చెందిన ఆయన రాష్ట్ర విభజనానంతరం ఏపీ క్యాడర్లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆయన అసలు లక్ష్యం మాత్రం కేంద్ర సర్వీసులకు వెళ్లడమని.. అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా ఆయన ఓసారి కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రస్తుతం ఏపీ క్యాడర్లోనే కొనసాగి కొంతకాలం తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు వెళ్లి ఢిల్లీలో పని చేస్తే సొంత రాష్ట్రం హర్యానాకు సమీపంలో ఉండొచ్చన్నది గౌర్ ఉద్దేశంగా ఉంది. తెలంగాణ క్యాడర్‌కు ఎస్పీ నవీన్ గులాఠీ! జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ తెలంగాణ క్యాడర్‌కు మారనున్నారని సమాచారం. ఈ మేరకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన గులాఠీ ఏపీ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారు. బహుశా హైదరాబాద్‌లో కొంత కాలం పని చేసిన తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన తెలంగాణ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నారు. దాంతో జూన్2 తరువాత జరిగే మార్పు ల్లో భాగంగా ఆయన తెలంగాణాకు మారడ ం ఖాయమైంది. ఏపీ క్యాడర్లోనే జేసీ విభజన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ జి. వీరపాండ్యన్ ఏపీ క్యాడర్‌నే ఎంపిక చేసుకున్నారని సమాచారం. తమిళనాడుకు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు మొగ్గు చూపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి తన ఆప్షన్ ఇచ్చారు. జూన్‌లో మార్పులు చేర్పులు కాగా క్యాడర్‌తో నిమిత్తం లేకుండా జిల్లా ఉన్నతాధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా కొత్త ప్రభుత్వం పాత అధికారులను మార్చి తమ అభీష్టం మేరకు కొత్త వారిని నియమించడం రివాజు. అదే విధంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఉన్నతాధికారుల బదిలీ తప్పదని స్పష్టమవుతోంది. కలెక్టర్ సౌరభ్ గౌర్ దాదాపు రెండేళ్లుగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో కొత్త ప్రభుత్వం ఆయన్ను మార్చడం ఖాయమని తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్న ఆయనకు రాష్ట్రంలోనే మరో జిల్లాకుగానీ హైదరాబాద్‌కుగానీ బదిలీ చేయొచ్చు. జేసీ వీరపాండ్యన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు బదిలీపై వచ్చారు. కొత్త ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేయాలని ఆనుకున్నా కొంతకాలం వేచి చూడవచ్చు. మొదట కలెక్టర్‌ను బదిలీ చేసి ఆ తరువాత కొంతకాలానికి జేసీని బదిలీ చేయొచ్చని భావిస్తున్నారు. ఎస్పీ నవీన్ గులాఠీ గత ఏడాది జూలైలో జిల్లాకు వచ్చారు. ఆయన ఎలాగూ తెలంగాణ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నందున ఆయన బదిలీ ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో జిల్లా కొత్త ఉన్నతాధికారులు ఎవరన్నది అధికారవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కలెక్టర్, ఎస్పీ స్థాయి ఉన్నతాధికారుల నియామకంలో జిల్లాలోని రాజకీయ ప్రముఖల పాత్ర ఏమీ ఉండదు. కానీ జిల్లాస్థాయిలో వివిధ శాఖల ఉన్నతాధికారుల మార్పుల్లో మాత్రం అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటుంది. అందుకే పలువురు ఆశావాహులు ఇప్పటికే జిల్లా టీడీపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారి ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాబోయే నెలరోజులు జిల్లా అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులతో హడావుడిగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. -
టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఆమదాలవలస మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబులపై దాడికి పాల్పడిన టీడీపీ దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కోరారు. తమ నియోజకవర్గంలో శాం తిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు స్పందించకపోతే ప్రజలే రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి మం డలాలకు చెందిన పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఆయన కలెక్టర్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆరాచకాలు, దాడులు, గృహ నిర్బంధాలకు పాల్పడ్డారని వివరించారు. పొందూరు, ఆమదాలవలస స్టేషన్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచిపోయి టీడీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పలు చోట్ల ఓటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. గురువారం కనుగులవలస వెళుతున్న సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబుల కారును పథకం ప్రకారం అడ్డుకొని వారిపై దాడికి పాల్పడ్డారన్నారు. దీనివెనుక కోర్లకోట, తమ్మయ్యపేటలకు చెందిన టీడీపీ నాయకుల ప్రోద్బలం ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలిద్దరిని దుండగులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, అయితే సమీపంలో ఉన్నవారు వచ్చి రక్షించారని చెప్పారు. అప్పటికే ఇద్దరు నేతలను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అనిల్‌బాబు ఇస్తున్న ఫిర్యాదును తీసుకోవడం లేదని తెలిపారు. దాడికి పాల్పడినవారిపైనా, వారి వెనుక ఉన్న టీడీపీ నాయకులపైనా చర్యలు తీసుకొని శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. ఇటీవల పొందూరు మం డలం నందివాడలో రెండుసార్లు టీడీపీ నాయకులు దాడులు చేశారని, అలాగే దల్లిపేటలో తమ కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. కొరపాం ఆటోలో వస్తుండగా దాడి చేశారని, గృహ నిర్బంధం చేసి హింసించారని పేర్కొన్నారు. సరుబుజ్జిలిలో ఎన్నికల ఏజెం ట్‌పై దాడి చేశారన్నారు. కార్యకర్తలు హింసకు పాల్పడేలా టీడీపీ నేతలు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ నవీన్ గులాఠీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడలేకపోయినా.. వైఫల్యం చెందినా.. లేదా టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయినా.. ప్రజలే రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడాల్పిన పరిస్థితి వస్తుందన్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పందిస్తూ దాడికి పాల్పడిన వారిపైన, ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసినవారిలో వైఎస్ఆర్సీపీ నేతలు బి.ఎల్.నాయుడు, బొడ్డేపల్లి నారాయణరావు, ఎస్.గాంధీ, ఎం.గోపాలకృష్ణ, జి.మధుసూదనరావు, కె.రమేష్, సూర్యారావు, రమేష్, కూన గోపి, బి.ప్రసాద్, ఎస్.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకోండి.. శ్రీకాకుళం క్రైం : జిల్లాలో టీడీపీ రౌడీయిజం రోజురోజుకూ పెరిగిపోతోందని, దీనిని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు తమ్మినేని సీతారాం, తదితరులు ఎస్పీ నవీన్ గులాఠీని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని భావించిన టీడీపీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు సువ్వారి అనిల్‌కుమార్, బొడ్డేపల్లి అనిల్బాబులపై దాడి చేశారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీ సులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
ఎన్నికల్లో మహిళా శక్తి చాటాలి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటు విలువను తెలుసుకుని ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడంలో మహిళలు ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఓటర్ల అవగాహన సదస్సుకు కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారన్నారు. ప్రలోభాలకు లొంగి అసమర్ధులను ఎన్నుకుంటే ఐదేళ్లు తిరోగమనానికి గురికావాల్సి ఉంటుందన్న విషయం గుర్తించాలన్నారు. ప్రతి మహిళా ఓటు విషయమై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్య అతిథి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లాలాలజపతిరాయ్ మాట్లాడుతూ 50 శాతానికిపైగా మహిళా ఓటర్లున్న జిల్లాలో వారు చైతన్యవంతులై మంచి నాయకులను ఎన్నుకోవడంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. రాజకీయ చైతన్యంతో వచ్చే ఐదు సంవత్సరాల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. అనంతరం ఓటరు సంకల్ప ప్రమాణ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించి మహిళా సంఘ సభ్యులతో ఓటుపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆకాశంలోకి బెలూన్లు ఎగరవేసి స్టేడియం నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఓటరు చైతన్యంపై ధనుంజయ బుర్రకథ దళం ప్రదర్శన, ఐకేపీ సిబ్బంది స్వీయ రచనలో కల్యాణ్ బృందం ప్రదర్శించిన లఘు నాటికను కలెక్టర్ ప్రసంశించారు. డీఆర్డీఏ పీడీ తనూజారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేసీ జి. వీరపాండియన్, ఏజేసీ షరీఫ్, డీఆర్వో నూర్‌బాషా ఖాసీం, ఆర్డీవో గణేష్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ర్యాలీకి స్పందన అంతంతమాత్రం అవగాహన సదస్సుకు స్పందన బాగున్నా ర్యాలీ మాత్రం మొక్కుబడిగా సాగింది. మహిళలకు భోజనం, తాగునీటితోపాటు ఇతర ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు. మహిళలు ఉదయం 9.30 గంటలకే ఆశించినదానికంటే అధికంగానే వచ్చారు. దీంతో వారు సుమారు 4 గంటలు ఎండలో కూర్చోవాల్సి వచ్చింది. వీరి ఇబ్బందిని చూసిన జేసీ షామియాల కిందకు వెళ్లమని సూచించారు. అయితే షామియానాలు వారికి సరిపోలేదు. కార్యక్రమం స్టేడియంలో జరిగితే తాగునీరు, మజ్జిగ సమీపంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒంటి గంట వరకూ కార్యక్రమం సాగిన అనంతరం ర్యాలీ చేపట్టడంతో చాలామంది మహిళలు అప్పటికే విసిగిపోయి డుమ్మా కొట్టారు. ఆహార పొట్లాల కోసం అంబేద్కర్ ఆడిటోరియంకి పరుగులు తీశారు. దీంతో ర్యాలీ వెలవెలబోయింది. బుర్రకథ, లఘునాటకంతో కాలయాపన జరగడంతో వయస్సుమీరిన మహిళలు మరింత ఇబ్బంది పడ్డారు. ఇక భోజనం పొట్లాలు సరిపడినంతగా లేవు. సంగం మందికి మాత్రమే అందాయి. మిగిలిన వారు తీవ్ర అసంతృప్తితో తిరుగుముఖం పట్టారు. భోజనం ప్యాకెట్ల పంపిణీ వద్ద సీసీలు, ఏపీఎంలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారు. భోజనం పొట్లాలు అందక బూర్జ మండల సీడివలస, శ్రీకాకుళం మండలం నైర, రణస్థలం మండలం సీతారంపురం, పాలకొండలోని ఎరకరాయునిపురం, ఎచ్చెర్ల మండలం బట్నవానిపేట, సంతకవిటి మండలం మామిడిపల్లి, రేగిడి, వంగర మండలాలకు చెందిన మహిళలు ఆకలితోనే తిరుగుముఖం పట్టారు. ఆధికారుల వైఫల్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటర్ల నమోదుకు నేడు ప్రత్యేక కార్యక్రమం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : కొత్త ఓటర్ల నమోదుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2540 పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6ను అందుబాటులో ఉంచామని, బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కళాశాలల్లో నియమితులైన క్యాంపస్ అంబాసిడర్లు 18 ఏళ్లు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. ఓటు హక్కు కలిగి ఉండడం, ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. www. ceoandhra.nic.in వెబ్సైట్ ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చని పేర్కొన్నారు. -
‘ఇన్‌టైమ్ సర్వీసు’కు కాంట్రాక్టు రద్దు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రా క్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు ఇన్‌టైమ్ సర్వీసు సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దు చేశారు. ఈ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఆయన ఈ మేరకు నిర్ణయించారు. తిరిగి ప్రకటన వెలువరించాలని ఆర్వీఎం అధికారులకు ఆదేశించారు. ఎఫ్ఏవో సరెండర్ సాధ్యమేనా? ఇదే విషయంలో ఎఫ్ఏవో ప్రముఖ పాత్ర వహించారని కలెక్టర్ గట్టి నమ్మకానికి వచ్చి ఆయనను సరెండర్ చేయాలని పీఓకు ఆదేశించినా అది సాధ్యమయ్యే పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. జి.రాజు అనే ఖజానా శాఖ ఉద్యోగి అయిదేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై రాజీవ్ విద్యామిషన్‌కు వచ్చారు. డిప్యుటేషన్ మూడేళ్లతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఫారెన్ సర్వీసెస్ సౌలభ్యం రావడంతో అయిదేళ్లు వరకు ఉండే అవకాశం వచ్చింది. ఈ కాలంలో ఆయన పదోన్నతులు సైతం వదులుకున్నారు. అయిదేళ్ల గడువు ముగిసిన తరువాత పదోన్నతి పొంది ఖజానా శాఖలో ఒకటి, రెండు రోజులు పనిచేసి మళ్లీ ఆర్వీఎంకు డిప్యుటేషన్ వేయించుకున్నారు. దీనివల్ల కొత్తగా డిప్యుటేషన్‌పై నియమించినట్లు అయింది. అందువల్ల ఎఫ్‌ఏఓను సరెండర్ చేయడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా ఛైర్మన్ హోదాలో కలెక్టర్ ఏ స్థాయి అధికారినైనా సరెండర్ చేసే అధికారం ఉందని ఇంకొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
త్వరితగతిన ఇంజినీరింగ్ పనులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఇంజినీరింగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్, పంచాయతీరాజ్, నీటిపారుదల, పీడబ్ల్యూడీ తదితర విభాగాల ద్వారా పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. వాటిని తు.చ. తప్పకుండా పాటించి పనులు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి కమిటీ, స్వయం సహాయక సంఘాలు, వినియోగిత సంఘాలకు పనులను అప్పగిం చాలన్నారు. ఎంపీ లాడ్స్‌కు, పంచాయతీ రాజ్, నీటిపారుదల పనులను సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ కింద చేపట్టే చెరువుల గండి తదితర పనులను నీటి వినియోగదారుల సంఘాల ద్వారా చేపట్టవచ్చునని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థప్రాజెక్టు డెరైక్టర్ పి.రజనీకాంతరావు, జెడ్పీ సీఈవో టి.కైలాశగిరీశ్వర్ పాల్గొన్నారు. -
స్త్రీ నిధి బ్యాంకులో 9 శాతం వడ్డీ
నరసన్నపేట, న్యూస్‌లైన్: స్త్రీనిధి బ్యాంకులో పొదుపు చేస్తే..9 శాతం వడ్డీ లభిస్తుందని కలెక్టర్ సౌరభ్గౌర చెప్పారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆంధ్రాబ్యాంకు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బ్యాంకులు లేని ప్రాంతాల్లో ఐకేపీ ఏపీఎంల ద్వారా బ్యాంకులు ఉన్న చోట డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని 30 వేల స్వయం శక్తి సంఘాలకు సుమారు రూ 350 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. స్వయంశక్తి సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మరో రూ 100 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నరసన్నపేట మండల మహిళా సమాఖ్యకు రూ 2 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ..మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి స్వయం శక్తి సంఘ సభ్యురాలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవడమే..కాకుండా..మిగతా వారి ఇళ్లల్లో సైతం నిర్మించేం దుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ఏవీ రామకృష్న, మేనేజర్ టి.కామేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శాస్త్రి, ఏపీడీ ధర్మారావు, తహశీల్దార్ ఎంవీ రమణ, ఎంపీడీవో ఎం.పోలినాయుడు, ఐకేపీ ఏసీ రవికుమార్, ఏపీఎం గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీనిధి రుణాలతో అభివృద్ధి ప్రాజెక్టులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్త్రీనిధి పథకం ద్వారా అందజేస్తున్న రుణాలను అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ స్వయంశక్తి సంఘాలను ఆదేశించారు. వీటిని పంటల సాగుకు ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే మహిళా రైతులకు ప్రత్యేకంగా పంట రుణాలు అందజేయాలన్నారు. స్త్రీనిధి పథకంపై పట్టణ, గ్రామీణ స్వయంశక్తి సంఘాల సభ్యులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్త్రీనిధి పథకం ద్వారా రూ.23.43 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.11.82 కోట్లు మాత్రమే పొందారని చెప్పారు. స్త్రీనిధి పథకంపై సభ్యులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 4.10 లక్షల మంది రైతుల్లో 2.80 లక్షల మంది మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్నారు. పై-లీన్ తుపాను వల్ల పంట నష్టపోయినట్టు 2.52 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 1.60 లక్షల మందికి మాత్రమే బ్యాంకు రుణాలు ఉన్నాయని వెల్లడించారు. బ్యాంకు రుణాలు పొందే దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రుణం పొందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రుణం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా 1.50 లక్షల మంది పంట రుణాలు పొందేలా చూడాలన్నారు. రుణాలు పొందనివారి జాబితాను ఈ నెల 31 నాటికల్లా తనకు అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో రూ.1,076 కోట్ల మేర పంట రుణాలు అందించామన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన రూ.370 కోట్లలో అధిక శాతం పంటల కోసం వినియోగించారని తెలిపారు. వరి పంట సాగుకు ఎకరాకు రూ.23,500 చొప్పున రుణం అందిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో స్వయంశక్తి సంఘాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల రుణ చెల్లింపులు పెరుగుతాయన్నారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే పథకాల వర్తింపు నిలుపుదల ప్రతి స్వయంశక్తి సంఘం పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే ప్రభుత్వ పథకాల వర్తింపును నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సీతంపేట మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12 కోట్లకుపైగా నిధులతో పనులు చేపడితే సీఐఎఫ్ కింద రూ.84 లక్షలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఏజెన్సీలో 30 వేల కుటుంబాలు 150 పని దినాలను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న పొదుపు నిల్వను తీసేందుకు బ్యాంకు అధికారులు అడ్డుచెబుతున్నారని స్వయంశక్తి సంఘాల సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఆర్డీఏ పీడీ పి.రజనీకాంతరావు, మెప్మా పీడీ సత్యనారాయ ణ, ఏపీడీ ధర్మారావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆర్.గున్నమ్మ, ఎంఎం ఎస్ అధ్యక్షులు, ఏసీలు, డీపీఎంలు పాల్గొన్నారు. -
తీవ్రత తగ్గుముఖం.. అయినా అప్రమత్తం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను దిశ మారటంతో జిల్లాపై దాని ప్రభావం తగ్గుముఖం పట్టనుంది. దీనివల్ల పెనుముప్పు తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం బుధవారం ఉదయానికే సర్వ సన్నద్ధమైంది. సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే సహాయక బృందాల నియామకం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మండల ప్రత్యేకాధికారుల నియామకాన్ని పూర్తిచేసింది. కళింగపట్నం, కాకినాడల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పధానంగా తీరప్రాంత మండలాలైన రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకిల్లో 17 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆ కేంద్రాలకు కావాల్సిన రేషన్ సరుకులు, లాంతర్లు, కిరోసిన్‌లను సిద్ధం చేసింది. కేంద్రాల నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో ప్రత్యేక సహాయ బృందాలను సిద్ధం చేసింది. జాతీయ విపత్తు రక్షక దళాలను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే బుధవారం సాయంత్రం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలను విశాఖపట్నం నుంచి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదీ తాజా పరిస్థితి తుపాను ప్రభావంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉంటాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, మండల ప్రత్యేకాధికారులు బుధవారం పలు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి లెహర్ తుపాను ప్రభావం జిల్లాపై కొంతమేర తగ్గిందని కలెక్టర్ సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని తెలిపారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. -
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ఎకువూరు(సోంపేట), న్యూస్‌లైన్: జిల్లాలోని 104 తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చారు. గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఎకువూరు గ్రామంలో తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు మడ్డు రాజారావు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్‌ను మత్స్యకారులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేకువజామున వేటకెళ్లి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా.. రోజంతా కష్టపడి పనిచేసే వారిలో మత్స్యకారులే ముందుంటారన్నారు. ప్రభుత్వం వీరి అభివృద్ధికి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తక్కువేనన్నారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులకు కూడా అదేస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శాశ్వత ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొంటే మంజూరు చేస్తామని వెల్లడించారు. రూ. 2.5 కోట్ల వ్యయంతో తీరప్రాంత గ్రామాల్లో తుపాను షెల్టరు భవనాలు నిర్మించటానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఫిషరీస్ డీడీ హెచ్.బాషా మాట్లాడుతూ జాతీయ మత్స్యకారుల అభివృద్ధి బోర్డు ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను జిల్లాకు ఎక్కువగా రప్పించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎ.ఎల్.మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ చట్ట సభల్లోకి తగినంతమంది వెళ్లలేపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 42 మంది ఎమ్మెల్యే, పది ఎంపీ స్థానాలు గెలుచుకొనే సత్తా, అవకాశం ఉన్నా రాజకీయ పార్టీలు గుర్తించటం లేదని అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యతిరేక ఉద్యమంలో ఈ ప్రాంత మత్స్యకారులు పాత్ర మరువలేనిదని కొనియాడారు. స్థానిక నేతలు మడ్డు రాజారావు, వాసుపల్లి కృష్ణారావు, ఎస్.చంద్రమోహన్ మాట్లాడుతూ సబ్సిడీపై డీజిల్ ఇప్పించాలని, తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఇద్దివానిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుని కుటుంబనికి ఐక్యవేదిక తరపున రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఎ.వీరన్న, డి.జి.శ్రీహరి, మెరైన్ సీఐ.ఆర్. అప్పలనాయుడు, పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై.కృష్ణమూర్తి, బడే తమ్మారావు, మాదా సోమయ్య, పండయ్య మాస్టారు, జి. దండాసి, బి. బాబూరావు, రామారావులు పాల్గొన్నారు. -
ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ!
సీతంపేట, న్యూస్‌లైన్ : సీతంపేట ఐటీడీఏలో ఐకేపీ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్(ఏపీడీ)గా పనిచేస్తున్న కె.సావిత్రిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో డ్వామా ఏపీడీ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సావిత్రిని శ్రీకాకుళంలో ల్యాండ్ ఏపీడీగా నియమించారు. 11వ తేదీతో జారీ అయిన ఈ ఉత్తర్వులు బుధవారం ఇక్కడకు అందాయి. అధికారులను బదిలీ చేయటం సాధారణమే అయినా.. పనితీరు బాగోలేదన్న కారణంగా సావిత్రిని బదిలీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొనటం ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఐకేపీ కార్యకలాపాల నిర్వహణలో సీతంపేట ఐటీడీఏ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇందుకోసం సావిత్రి ఎంతో కృషి చేశారు. వాస్తవానికి, పనితీరు బాగోకపోతే తొలుత సంజాయిషీ అడుగుతారు. కింది స్థాయి ఉద్యోగులను సైతం ఇందుకు బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తారు. అవేమీ లేకుండా ఏపీడీని ఏకంగా బదిలీ చేయడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం డీఆర్డీఏలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సావిత్రి ఈ ఏడాది జనవరి ఒకటిన ఇక్కడకు బదిలీపై వచ్చారు. స్వయంశక్తి సంఘాల జమాఖర్చులను సకాలంలో ఆడిట్ చేయించడం, బ్యాంకు లింకేజీ, పీవోపీ లబ్ధిదారులకు రుణాల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటిది ఆమెను పనితీరు బాగోలేదంటూ బదిలీ చేయటం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు. -
శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగావళి నది వరద పోటెత్తింది, ఈ నేపథ్యంలో ఆ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదివారం తెలిపారు. జిల్లాలో 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 30 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. దాంతో శ్రీకాకుళం పట్టణవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గడిచిన 24 గంటల కాలంలో 300 మి. మీ వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ వివరించారు. -
సిక్కోలులో 4లక్షల మందిపై పై-లిన్ ప్రభావం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ నాలుగు లక్షల మందిపై ప్రభావం చూపిందని జిల్లా కలక్టర్ సౌరభ్ గౌర్ ప్రకటించారు. పైలిన్ తుఫాన్ వెలిసిన వారం రోజుల తరువాత అధికార్లు నష్టం అంచనాలను ప్రకటించడం విశేషం. ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకపోగా, ఎనభై నాలుగు పశువులు మృతి చెందాయన్నారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 వందల ఇళ్లు పాక్షికంగా , పన్నెండు వందల విద్యుత్ స్థంబాలు ధ్వంసం అయ్యాయన్నారు. 442 గ్రామాలు తుఫాన్ ధాటికి గురి అయ్యాయని, 9వేల హెక్టార్లలో పంట పొలాలు, 8 వేల హెక్టార్లలో ఇతర పంటలు నాశనం అయ్యాయని తెలిపారు. తుఫాన్ పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు.