మత్స్యకారుల సంక్షేమానికి కృషి
Published Fri, Nov 22 2013 4:04 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
ఎకువూరు(సోంపేట), న్యూస్‌లైన్: జిల్లాలోని 104 తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చారు. గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఎకువూరు గ్రామంలో తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు మడ్డు రాజారావు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్‌ను మత్స్యకారులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేకువజామున వేటకెళ్లి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా.. రోజంతా కష్టపడి పనిచేసే వారిలో మత్స్యకారులే ముందుంటారన్నారు. ప్రభుత్వం వీరి అభివృద్ధికి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తక్కువేనన్నారు.
జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులకు కూడా అదేస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శాశ్వత ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొంటే మంజూరు చేస్తామని వెల్లడించారు. రూ. 2.5 కోట్ల వ్యయంతో తీరప్రాంత గ్రామాల్లో తుపాను షెల్టరు భవనాలు నిర్మించటానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఫిషరీస్ డీడీ హెచ్.బాషా మాట్లాడుతూ జాతీయ మత్స్యకారుల అభివృద్ధి బోర్డు ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను జిల్లాకు ఎక్కువగా రప్పించటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షుడు, ఆప్‌కాబ్ మాజీ చైర్మన్ ఎ.ఎల్.మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ చట్ట సభల్లోకి తగినంతమంది వెళ్లలేపోతున్నామని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 42 మంది ఎమ్మెల్యే, పది ఎంపీ స్థానాలు గెలుచుకొనే సత్తా, అవకాశం ఉన్నా రాజకీయ పార్టీలు గుర్తించటం లేదని అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యతిరేక ఉద్యమంలో ఈ ప్రాంత మత్స్యకారులు పాత్ర మరువలేనిదని కొనియాడారు. స్థానిక నేతలు మడ్డు రాజారావు, వాసుపల్లి కృష్ణారావు, ఎస్.చంద్రమోహన్ మాట్లాడుతూ సబ్సిడీపై డీజిల్ ఇప్పించాలని, తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడిన ఇద్దివానిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుని కుటుంబనికి ఐక్యవేదిక తరపున రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఎ.వీరన్న, డి.జి.శ్రీహరి, మెరైన్ సీఐ.ఆర్. అప్పలనాయుడు, పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై.కృష్ణమూర్తి, బడే తమ్మారావు, మాదా సోమయ్య, పండయ్య మాస్టారు, జి. దండాసి, బి. బాబూరావు, రామారావులు పాల్గొన్నారు.
Advertisement