స్త్రీనిధి రుణాలతో అభివృద్ధి ప్రాజెక్టులు
Published Tue, Dec 3 2013 3:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్త్రీనిధి పథకం ద్వారా అందజేస్తున్న రుణాలను అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ స్వయంశక్తి సంఘాలను ఆదేశించారు. వీటిని పంటల సాగుకు ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే మహిళా రైతులకు ప్రత్యేకంగా పంట రుణాలు అందజేయాలన్నారు. స్త్రీనిధి పథకంపై పట్టణ, గ్రామీణ స్వయంశక్తి సంఘాల సభ్యులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్త్రీనిధి పథకం ద్వారా రూ.23.43 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.11.82 కోట్లు మాత్రమే పొందారని చెప్పారు. స్త్రీనిధి పథకంపై సభ్యులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 4.10 లక్షల మంది రైతుల్లో 2.80 లక్షల మంది మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్నారు.
పై-లీన్ తుపాను వల్ల పంట నష్టపోయినట్టు 2.52 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 1.60 లక్షల మందికి మాత్రమే బ్యాంకు రుణాలు ఉన్నాయని వెల్లడించారు. బ్యాంకు రుణాలు పొందే దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రుణం పొందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రుణం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా 1.50 లక్షల మంది పంట రుణాలు పొందేలా చూడాలన్నారు. రుణాలు పొందనివారి జాబితాను ఈ నెల 31 నాటికల్లా తనకు అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో రూ.1,076 కోట్ల మేర పంట రుణాలు అందించామన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన రూ.370 కోట్లలో అధిక శాతం పంటల కోసం వినియోగించారని తెలిపారు. వరి పంట సాగుకు ఎకరాకు రూ.23,500 చొప్పున రుణం అందిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో స్వయంశక్తి సంఘాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల రుణ చెల్లింపులు పెరుగుతాయన్నారు.
ఎ-గ్రేడ్‌కు రాకుంటే పథకాల వర్తింపు నిలుపుదల
ప్రతి స్వయంశక్తి సంఘం పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే ప్రభుత్వ పథకాల వర్తింపును నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సీతంపేట మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12 కోట్లకుపైగా నిధులతో పనులు చేపడితే సీఐఎఫ్ కింద రూ.84 లక్షలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఏజెన్సీలో 30 వేల కుటుంబాలు 150 పని దినాలను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న పొదుపు నిల్వను తీసేందుకు బ్యాంకు అధికారులు అడ్డుచెబుతున్నారని స్వయంశక్తి సంఘాల సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఆర్‌డీఏ పీడీ పి.రజనీకాంతరావు, మెప్మా పీడీ సత్యనారాయ ణ, ఏపీడీ ధర్మారావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆర్.గున్నమ్మ, ఎంఎం ఎస్ అధ్యక్షులు, ఏసీలు, డీపీఎంలు పాల్గొన్నారు.
Advertisement