జిల్లాకు కొత్త జట్టు! | Changes Collector, SP reday for tdp government | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్త జట్టు!

Published Thu, May 22 2014 1:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

జిల్లాకు కొత్త జట్టు! - Sakshi

జిల్లాకు కొత్త జట్టు!

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్త ప్రభుత్వం.. కొత్త మంత్రు లు.. కొత్త అధికారులు.. ప్రస్తుతం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఉన్నతాధికార యంత్రాంగంలో సమూల మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అంశం ఇప్పటికే ఉన్నతాధికారుల మార్పునకు బీజం వేసింది. దీనికి తోడు కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టనుండటంతో అధికార యం త్రాంగంలో సమూల మార్పులు జరగనున్నాయి. కలెక్టర్, ఎస్పీ స్థాయి ఉన్నతాధికారుల మార్పు ల్లో జిల్లాలోని అధికార పార్టీ నేతల ప్రమేయం ఏమీ ఉండనప్పటికీ.. వివిధ శాఖల ఉన్నతాధికార పోస్టులపై కన్నేసినవారు మాత్రం టీడీపీ పెద్దల ఆశీర్వాదం కోసం వారి చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలంతా మార్పులు చేర్పులతో కోలాహలం నెలకొననుంది.
 
 ప్రస్తుతానికి ఏపీ.. అసలు టార్గెట్ సెంట్రల్‌కలెక్టర్ సౌరభ్ గౌర్ అభిమతమిదీ!
 రాష్ట్ర విభజన నేపథ్యంలో కలెక్టర్ సౌరభ్ గౌర్ ఏపీ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారు. హర్యానాకు చెందిన ఆయన రాష్ట్ర విభజనానంతరం ఏపీ క్యాడర్‌లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆయన అసలు లక్ష్యం మాత్రం కేంద్ర సర్వీసులకు వెళ్లడమని.. అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో కూడా ఆయన ఓసారి కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రస్తుతం ఏపీ క్యాడర్‌లోనే కొనసాగి కొంతకాలం తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు వెళ్లి ఢిల్లీలో పని చేస్తే సొంత రాష్ట్రం హర్యానాకు సమీపంలో ఉండొచ్చన్నది గౌర్ ఉద్దేశంగా ఉంది.
 
 తెలంగాణ  క్యాడర్‌కు ఎస్పీ నవీన్ గులాఠీ!
 జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ తెలంగాణ  క్యాడర్‌కు మారనున్నారని సమాచారం. ఈ మేరకు ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన గులాఠీ ఏపీ క్యాడర్‌లో ఐపీఎస్ అధికారిగా చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ  క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారు. బహుశా హైదరాబాద్‌లో కొంత కాలం పని చేసిన తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన తెలంగాణ  క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నారు. దాంతో జూన్2 తరువాత జరిగే మార్పు ల్లో భాగంగా ఆయన తెలంగాణాకు మారడ ం ఖాయమైంది.
 
 ఏపీ క్యాడర్‌లోనే జేసీ
 విభజన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ జి. వీరపాండ్యన్ ఏపీ క్యాడర్‌నే ఎంపిక చేసుకున్నారని సమాచారం. తమిళనాడుకు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు మొగ్గు చూపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి తన ఆప్షన్ ఇచ్చారు.
 
 జూన్‌లో మార్పులు చేర్పులు
 కాగా క్యాడర్‌తో నిమిత్తం లేకుండా జిల్లా ఉన్నతాధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా కొత్త ప్రభుత్వం పాత అధికారులను మార్చి తమ అభీష్టం మేరకు కొత్త వారిని నియమించడం రివాజు. అదే విధంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఉన్నతాధికారుల బదిలీ తప్పదని స్పష్టమవుతోంది. కలెక్టర్ సౌరభ్ గౌర్ దాదాపు రెండేళ్లుగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో కొత్త ప్రభుత్వం ఆయన్ను మార్చడం ఖాయమని తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌ను ఎంపిక చేసుకున్న ఆయనకు రాష్ట్రంలోనే మరో జిల్లాకుగానీ హైదరాబాద్‌కుగానీ బదిలీ చేయొచ్చు. జేసీ వీరపాండ్యన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు బదిలీపై వచ్చారు. కొత్త ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేయాలని ఆనుకున్నా కొంతకాలం వేచి చూడవచ్చు. మొదట కలెక్టర్‌ను బదిలీ చేసి ఆ తరువాత కొంతకాలానికి జేసీని బదిలీ చేయొచ్చని భావిస్తున్నారు.
 
 ఎస్పీ నవీన్ గులాఠీ గత  ఏడాది జూలైలో జిల్లాకు వచ్చారు. ఆయన ఎలాగూ తెలంగాణ  క్యాడర్‌ను ఎంపిక చేసుకున్నందున ఆయన బదిలీ ఖాయమైనట్లే. ఈ  నేపథ్యంలో జిల్లా కొత్త ఉన్నతాధికారులు ఎవరన్నది అధికారవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కలెక్టర్, ఎస్పీ స్థాయి ఉన్నతాధికారుల నియామకంలో జిల్లాలోని రాజకీయ ప్రముఖల పాత్ర ఏమీ ఉండదు. కానీ జిల్లాస్థాయిలో వివిధ శాఖల ఉన్నతాధికారుల మార్పుల్లో మాత్రం అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటుంది. అందుకే పలువురు ఆశావాహులు ఇప్పటికే జిల్లా టీడీపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారి ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాబోయే నెలరోజులు జిల్లా అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులతో హడావుడిగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement