strinidhi
-
స్త్రీనిధి రుణాలతో స్వయం ఉపాధికి బాటలు
మహిళా సాధికారతే లక్ష్యంగా.. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుని జీవనం గడుపుతున్నాము. జగనన్న తోడు కింద రూ.10 వేలు రుణం ఇచ్చారు. దాంతో చిన్నపాటి మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి ఇచ్చిన సలహా మేరకు స్త్రీనిధి రుణం రూ.50 వేలు తీసుకుని చీరలు, రవికలు, వాటికి సంబంధించిన మ్యాచింగ్ మెటీరియల్ తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నాను. దీనివలన కుటుంబ పరిస్థితి కుదుట పడింది. మహిళలకు సీఎం జగనన్న ఇస్తున్న సహకారం మరువలేము. – దాసు ఝాన్సీ, లావణ్య గ్రూపు సభ్యురాలు జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణంతో ఇంట్లోనే దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాను. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి స్త్రీనిధి రుణం రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.30 వేలు తీసుకుని బ్యాంకుకు దగ్గరలో షాపును అద్దెకు తీసుకుని ఫ్యాన్సీ, గిఫ్ట్ ఐటమ్స్ విక్రయిస్తున్నాను. వ్యాపారం బాగానే జరుగుతోంది. గతంలో కుటుంబం జరగడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం జగనన్న మా కుటుంబానికి తోడుగా ఉండి నాతో వ్యాపారం చేయిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగుంది. జగనన్నకు రుణపడి ఉంటాము. – షేక్ ఆయేషా, అల్లాహ్ గ్రూపు సభ్యురాలు యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): జిల్లాలోని 38 మండలాల్లో డీఆర్డీఏ పరిధిలో 47,275 గ్రూపుల్లో 4,90,250 మంది సభ్యులున్నారు. మెప్మా పరిధిలో 4,210 గ్రూపుల్లో 44,215 మంది సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికారులు గడిచిన రెండేళ్లలో లక్ష్యానికి మించి రుణాలు అందజేశారు. 2020–21 సంవత్సరంలో 4,808 సంఘాలకు చెందిన 20,132 మందికి రూ.103.35 కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 6,343 గ్రూపులకు చెందిన 22,466 మంది సభ్యులకు రూ.113.52 కోట్లు ఇచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు అందజేశారు. 2021–22 సంవత్సరంలో 5,185 గ్రూపులకు చెందిన 31,070 మందికి రూ.155.18 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 12,755 గ్రూపులకు చెందిన 43,863 మంది సభ్యులకు రూ.158.07 కోట్ల రుణాలిఇచ్చారు. దీని ద్వారా 102.27 శాతం పంపిణీ చేసినట్లయింది. ఈ ఏడాది 7 నెలల్లో... 2022–23 ఆర్థిక సంవత్సరంలో 10,075 గ్రూపులకు చెందిన 40,336 మంది సభ్యులకు రూ.201.68 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన 7 నెలల్లో 7,373 గ్రూపులకు చెందిన 23,735 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.80.19 కోట్ల రుణాలు అందజేశారు. రానున్న కాలంలో మిగిలిన రుణాలు అందజేసి లక్ష్యాన్ని దాటాలని అధికారులు యత్నాలు చేస్తున్నారు. గ్రేడ్ల వారీగా రుణాల పెంపు... స్త్రీనిధిలో ప్రస్తుతం ఉన్న గ్రామ సమాఖ్య (వీవో)ల క్రెడిట్ లిమిట్‌ను ఏ గ్రేడ్ వీవోకి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు. బీ గ్రేడ్ వీవోకి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షలకు, సీ గ్రేడ్ వీవోకి రూ.30 లక్షల నుంచి రూ.55 లక్షలకు, డీ గ్రేడ్ వీవోకి రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పెంచారు. 10 మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)కు రూ.3 లక్షల వరకు రుణం అర్హతగా ఉండేది. ప్రస్తుతం దానిని రూ.4 లక్షలకు పెంచారు. 11 మంది అంతకంటే ఎక్కువ సభ్యులున్న ఎస్‌హెచ్‌జీ రుణ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు పెంచారు. గతంలో ఎస్‌హెచ్‌జీలో ఐదుగురు సభ్యుల వరకు రూ.50 వేలు రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం దానికి కూడా రూ.75 వేలకు పెంచారు. ఒక సభ్యురాలు రూ.లక్ష వరకు గరిష్టంగా రుణం పొందవచ్చు. యూనిట్లను బట్టి రూ.10 వేలు (జగనన్నతోడు), రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష ప్రకారం రుణం పొందే అవకాశం ఉంది. -
స్త్రీనిధి రుణాలతో అభివృద్ధి ప్రాజెక్టులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్త్రీనిధి పథకం ద్వారా అందజేస్తున్న రుణాలను అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ స్వయంశక్తి సంఘాలను ఆదేశించారు. వీటిని పంటల సాగుకు ఉపయోగించుకోకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే మహిళా రైతులకు ప్రత్యేకంగా పంట రుణాలు అందజేయాలన్నారు. స్త్రీనిధి పథకంపై పట్టణ, గ్రామీణ స్వయంశక్తి సంఘాల సభ్యులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్త్రీనిధి పథకం ద్వారా రూ.23.43 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.11.82 కోట్లు మాత్రమే పొందారని చెప్పారు. స్త్రీనిధి పథకంపై సభ్యులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న 4.10 లక్షల మంది రైతుల్లో 2.80 లక్షల మంది మాత్రమే బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్నారు. పై-లీన్ తుపాను వల్ల పంట నష్టపోయినట్టు 2.52 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 1.60 లక్షల మందికి మాత్రమే బ్యాంకు రుణాలు ఉన్నాయని వెల్లడించారు. బ్యాంకు రుణాలు పొందే దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు రుణం పొందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రుణం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా 1.50 లక్షల మంది పంట రుణాలు పొందేలా చూడాలన్నారు. రుణాలు పొందనివారి జాబితాను ఈ నెల 31 నాటికల్లా తనకు అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్‌లో రూ.1,076 కోట్ల మేర పంట రుణాలు అందించామన్నారు. మహిళా సంఘాలకు అందజేసిన రూ.370 కోట్లలో అధిక శాతం పంటల కోసం వినియోగించారని తెలిపారు. వరి పంట సాగుకు ఎకరాకు రూ.23,500 చొప్పున రుణం అందిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో స్వయంశక్తి సంఘాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు. దీనివల్ల రుణ చెల్లింపులు పెరుగుతాయన్నారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే పథకాల వర్తింపు నిలుపుదల ప్రతి స్వయంశక్తి సంఘం పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎ-గ్రేడ్‌కు రాకుంటే ప్రభుత్వ పథకాల వర్తింపును నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. సీతంపేట మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.12 కోట్లకుపైగా నిధులతో పనులు చేపడితే సీఐఎఫ్ కింద రూ.84 లక్షలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఏజెన్సీలో 30 వేల కుటుంబాలు 150 పని దినాలను పూర్తి చేసుకున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో ఉన్న పొదుపు నిల్వను తీసేందుకు బ్యాంకు అధికారులు అడ్డుచెబుతున్నారని స్వయంశక్తి సంఘాల సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఆర్డీఏ పీడీ పి.రజనీకాంతరావు, మెప్మా పీడీ సత్యనారాయ ణ, ఏపీడీ ధర్మారావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆర్.గున్నమ్మ, ఎంఎం ఎస్ అధ్యక్షులు, ఏసీలు, డీపీఎంలు పాల్గొన్నారు. -
స్త్రీనిధిని బొక్కేశారు !
గుడివాడ, న్యూస్‌లైన్ : మహిళల వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిధి సొమ్మును గ్రామైక్య సంఘం నిర్వాహకులు బొక్కేశారు. రూ.2లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది తెలుసుకున్న డ్వాక్రా మహిళలు లబోదిబోమంటూ డీఆర్డీఏ అధికారుల్ని ఆశ్రయించగా స్వాహా చేసిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు శివారు గంగాధరపురం గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రామైక్య సంఘానికి ఈఏడాది జూలై16న స్త్రీనిధి మంజూరు అయ్యింది. 26 గ్రూపులున్న ఈ గ్రామైక్య సంఘంలో గంగాధరపురానికి చెందిన సాయి స్వశక్తి సంఘంలో రూ.90వేలు, శ్రీహర్షా స్వశక్తి సంఘంలో రూ.70వేలు, వర్షిత స్వశక్తి సంఘంలో రూ.15వేలు... ఇలా మొత్తం రూ.1.75 లక్షలు స్వాహాకు గురయినట్లు అధికారులు గుర్తించారు. ఇవిగాక గ్రామైక్య సంఘంలో ఉన్న 36మందికి మంజూరైన స్కాలర్‌షిప్పుల సొమ్మునీ దిగమింగినట్లు తెలుస్తుంది. దాదాపు ఇదో రూ. 25వేల వరకు ఉంటుందని అంచనా. అధ్యక్షురాలు, బుక్కీపర్లే స్వాహారాణులు... గ్రామైక్య సంఘం స్త్రీనిధి ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు జల్లా విజయశ్రీ, బుక్‌కీపర్ నేలపాటి లక్ష్మీ తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. జూలై 16న మూడు గ్రూపులకు స్త్రీనిధి మంజూరు కాగా ఆ మొత్తాన్ని రెండవ రోజే వారి ఖాతాల్లోకి మార్చుకున్నట్లు బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన నివేదికలో తేలింది. రుణం తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా గ్రూపు సభ్యుల నుంచి రికవరీ రాకపోవటంతో బ్యాంకు అధికారులు డీఆర్డీఏ అధికారులను వివరణ అడిగారు. సంబంధిత గ్రూపులకు నోటీసులు పంపారు. దీంతో తాము రుణం తీసుకోకుండా నోటీసులు ఏమిటని లబోదిబోమంటూ అధికారుల్ని కలువగా కూపీ లాగితే వచ్చిన సొమ్మును గ్రామైక్యసంఘం అధ్యక్షురాలు, బుక్‌కీపర్ తమ సొంత ఖాతాలోకి మార్చుకున్నారని తేలింది. మూడు రోజుల క్రితం డీఆర్డీఏ ఏపీఎం మూర్తి, మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ అరుణ కలిసి గ్రామైక్య సంఘాన్ని సమావేశపరచి వారిని నిలదీశారు. దీంతో తాము ఆ సొమ్ము వాడుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. స్కాలర్‌షిప్పుల సొమ్మునూ నొక్కేశారు... గ్రామైక్య సంఘం పరిధిలో ఉన్న సభ్యులు ఆమ్‌ఆద్మీయోజన, అభయహస్తం చెల్లించిన సభ్యుల కుటుంబంలో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్పులు మంజూరయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ. 1200 చొప్పున గ్రామైక్య సంఘంలోని 36మందికి రూ.43,200 మంజూరుకాగా వాటిలో దాదాపు రూ.25వేలు వరకు స్వాహా చేసినట్లు తెలుస్తుంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు... గుడివాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా గుడివాడ ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నందున వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పటంతో గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. గ్రామైక్య సంఘంలో గతంలో కోశాధికారిగా పనిచేసిన సుజాత స్థానిక ఎంపీడీవోకు సొమ్ము స్వాహా జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఐకేపీకి చెందిన మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ సీ.అరుణను వివరణ కోరగా సొమ్ము దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమేనని , చర్యలు తీసుకుంటామని అన్నారు.