మహిళా సాధికారతే లక్ష్యంగా.. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.
ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుని జీవనం గడుపుతున్నాము. జగనన్న తోడు కింద రూ.10 వేలు రుణం ఇచ్చారు. దాంతో చిన్నపాటి మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డీఆర్‌డీఏ ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి ఇచ్చిన సలహా మేరకు స్త్రీనిధి రుణం రూ.50 వేలు తీసుకుని చీరలు, రవికలు, వాటికి సంబంధించిన మ్యాచింగ్ మెటీరియల్ తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నాను. దీనివలన కుటుంబ పరిస్థితి కుదుట పడింది. మహిళలకు సీఎం జగనన్న ఇస్తున్న సహకారం మరువలేము.
– దాసు ఝాన్సీ, లావణ్య గ్రూపు సభ్యురాలు
జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణంతో ఇంట్లోనే దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాను. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి స్త్రీనిధి రుణం రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.30 వేలు తీసుకుని బ్యాంకుకు దగ్గరలో షాపును అద్దెకు తీసుకుని ఫ్యాన్సీ, గిఫ్ట్ ఐటమ్స్ విక్రయిస్తున్నాను. వ్యాపారం బాగానే జరుగుతోంది. గతంలో కుటుంబం జరగడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం జగనన్న మా కుటుంబానికి తోడుగా ఉండి నాతో వ్యాపారం చేయిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగుంది. జగనన్నకు రుణపడి ఉంటాము.
– షేక్ ఆయేషా, అల్లాహ్ గ్రూపు సభ్యురాలు
యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): జిల్లాలోని 38 మండలాల్లో డీఆర్‌డీఏ పరిధిలో 47,275 గ్రూపుల్లో 4,90,250 మంది సభ్యులున్నారు. మెప్మా పరిధిలో 4,210 గ్రూపుల్లో 44,215 మంది సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికారులు గడిచిన రెండేళ్లలో లక్ష్యానికి మించి రుణాలు అందజేశారు. 2020–21 సంవత్సరంలో 4,808 సంఘాలకు చెందిన 20,132 మందికి రూ.103.35 కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 6,343 గ్రూపులకు చెందిన 22,466 మంది సభ్యులకు రూ.113.52 కోట్లు ఇచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు అందజేశారు. 2021–22 సంవత్సరంలో 5,185 గ్రూపులకు చెందిన 31,070 మందికి రూ.155.18 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 12,755 గ్రూపులకు చెందిన 43,863 మంది సభ్యులకు రూ.158.07 కోట్ల రుణాలిఇచ్చారు. దీని ద్వారా 102.27 శాతం పంపిణీ చేసినట్లయింది.
ఈ ఏడాది 7 నెలల్లో...
2022–23 ఆర్థిక సంవత్సరంలో 10,075 గ్రూపులకు చెందిన 40,336 మంది సభ్యులకు రూ.201.68 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన 7 నెలల్లో 7,373 గ్రూపులకు చెందిన 23,735 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.80.19 కోట్ల రుణాలు అందజేశారు. రానున్న కాలంలో మిగిలిన రుణాలు అందజేసి లక్ష్యాన్ని దాటాలని అధికారులు యత్నాలు చేస్తున్నారు.
గ్రేడ్ల వారీగా రుణాల పెంపు...
స్త్రీనిధిలో ప్రస్తుతం ఉన్న గ్రామ సమాఖ్య (వీవో)ల క్రెడిట్ లిమిట్‌ను ఏ గ్రేడ్ వీవోకి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు. బీ గ్రేడ్ వీవోకి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షలకు, సీ గ్రేడ్ వీవోకి రూ.30 లక్షల నుంచి రూ.55 లక్షలకు, డీ గ్రేడ్ వీవోకి రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పెంచారు. 10 మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)కు రూ.3 లక్షల వరకు రుణం అర్హతగా ఉండేది. ప్రస్తుతం దానిని రూ.4 లక్షలకు పెంచారు.
11 మంది అంతకంటే ఎక్కువ సభ్యులున్న ఎస్‌హెచ్‌జీ రుణ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు పెంచారు. గతంలో ఎస్‌హెచ్‌జీలో ఐదుగురు సభ్యుల వరకు రూ.50 వేలు రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం దానికి కూడా రూ.75 వేలకు పెంచారు. ఒక సభ్యురాలు రూ.లక్ష వరకు గరిష్టంగా రుణం పొందవచ్చు. యూనిట్లను బట్టి రూ.10 వేలు (జగనన్నతోడు), రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష ప్రకారం రుణం పొందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment