Strinidhi Funding
-
స్త్రీనిధి రుణాలతో స్వయం ఉపాధికి బాటలు
మహిళా సాధికారతే లక్ష్యంగా.. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుని జీవనం గడుపుతున్నాము. జగనన్న తోడు కింద రూ.10 వేలు రుణం ఇచ్చారు. దాంతో చిన్నపాటి మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నాను. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి ఇచ్చిన సలహా మేరకు స్త్రీనిధి రుణం రూ.50 వేలు తీసుకుని చీరలు, రవికలు, వాటికి సంబంధించిన మ్యాచింగ్ మెటీరియల్ తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నాను. దీనివలన కుటుంబ పరిస్థితి కుదుట పడింది. మహిళలకు సీఎం జగనన్న ఇస్తున్న సహకారం మరువలేము. – దాసు ఝాన్సీ, లావణ్య గ్రూపు సభ్యురాలు జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీ లేని రుణంతో ఇంట్లోనే దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాను. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి స్త్రీనిధి రుణం రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.30 వేలు తీసుకుని బ్యాంకుకు దగ్గరలో షాపును అద్దెకు తీసుకుని ఫ్యాన్సీ, గిఫ్ట్ ఐటమ్స్ విక్రయిస్తున్నాను. వ్యాపారం బాగానే జరుగుతోంది. గతంలో కుటుంబం జరగడమే కష్టంగా ఉండేది. ప్రస్తుతం జగనన్న మా కుటుంబానికి తోడుగా ఉండి నాతో వ్యాపారం చేయిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి బాగుంది. జగనన్నకు రుణపడి ఉంటాము. – షేక్ ఆయేషా, అల్లాహ్ గ్రూపు సభ్యురాలు యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): జిల్లాలోని 38 మండలాల్లో డీఆర్డీఏ పరిధిలో 47,275 గ్రూపుల్లో 4,90,250 మంది సభ్యులున్నారు. మెప్మా పరిధిలో 4,210 గ్రూపుల్లో 44,215 మంది సభ్యులున్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికారులు గడిచిన రెండేళ్లలో లక్ష్యానికి మించి రుణాలు అందజేశారు. 2020–21 సంవత్సరంలో 4,808 సంఘాలకు చెందిన 20,132 మందికి రూ.103.35 కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 6,343 గ్రూపులకు చెందిన 22,466 మంది సభ్యులకు రూ.113.52 కోట్లు ఇచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలు అందజేశారు. 2021–22 సంవత్సరంలో 5,185 గ్రూపులకు చెందిన 31,070 మందికి రూ.155.18 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 12,755 గ్రూపులకు చెందిన 43,863 మంది సభ్యులకు రూ.158.07 కోట్ల రుణాలిఇచ్చారు. దీని ద్వారా 102.27 శాతం పంపిణీ చేసినట్లయింది. ఈ ఏడాది 7 నెలల్లో... 2022–23 ఆర్థిక సంవత్సరంలో 10,075 గ్రూపులకు చెందిన 40,336 మంది సభ్యులకు రూ.201.68 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడిచిన 7 నెలల్లో 7,373 గ్రూపులకు చెందిన 23,735 మంది స్వయం సహాయక సభ్యులకు రూ.80.19 కోట్ల రుణాలు అందజేశారు. రానున్న కాలంలో మిగిలిన రుణాలు అందజేసి లక్ష్యాన్ని దాటాలని అధికారులు యత్నాలు చేస్తున్నారు. గ్రేడ్ల వారీగా రుణాల పెంపు... స్త్రీనిధిలో ప్రస్తుతం ఉన్న గ్రామ సమాఖ్య (వీవో)ల క్రెడిట్ లిమిట్‌ను ఏ గ్రేడ్ వీవోకి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు. బీ గ్రేడ్ వీవోకి రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షలకు, సీ గ్రేడ్ వీవోకి రూ.30 లక్షల నుంచి రూ.55 లక్షలకు, డీ గ్రేడ్ వీవోకి రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు పెంచారు. 10 మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)కు రూ.3 లక్షల వరకు రుణం అర్హతగా ఉండేది. ప్రస్తుతం దానిని రూ.4 లక్షలకు పెంచారు. 11 మంది అంతకంటే ఎక్కువ సభ్యులున్న ఎస్‌హెచ్‌జీ రుణ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు పెంచారు. గతంలో ఎస్‌హెచ్‌జీలో ఐదుగురు సభ్యుల వరకు రూ.50 వేలు రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం దానికి కూడా రూ.75 వేలకు పెంచారు. ఒక సభ్యురాలు రూ.లక్ష వరకు గరిష్టంగా రుణం పొందవచ్చు. యూనిట్లను బట్టి రూ.10 వేలు (జగనన్నతోడు), రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష ప్రకారం రుణం పొందే అవకాశం ఉంది. -
ఆర్థిక పురోగతికి ‘స్త్రీనిధి’ అండ
►మహిళలకు కోరిన వెంటనే రుణాలు ►జీవనోపాధి కోసం ఈ ఏడాది ప్రత్యేక రుణ సదుపాయం ►సద్వినియోగం చేసుకుంటే స్వయం సహాయక సంఘాలకు వరం ►జిల్లాలో స్త్రీనిధికి కోట్ల రూపాయల కేటాయింపు ►అవగాహన లేమితో మూలుగుతున్న నిధులు ►నాలుగో వంతుకు కూడా చేరని రుణ లక్ష్యం పిడుగురాళ్ళ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ‘స్త్రీనిధి’ అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2010లో ప్రారంభించిన స్త్రీనిధి బ్యాంకు ద్వారా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవం వల్ల జిల్లాలో స్త్రీనిధి ఖాతాలో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. స్త్రీనిధి బ్యాంకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.122 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు సుమారు 22 శాతం మాత్రమే పంపిణీ జరిగినట్టు సమాచారం. జిల్లాలోని 57 మండలాల్లో 2052 గ్రామ సమాఖ్యలు ఉండగా 478 సమాఖ్యల ద్వారా 2253 సంఘాల సభ్యులు సుమారు రూ.23 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన 78 శాతం నిధులు ఎప్పటికి సద్వినియోగం చేసుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. నిధులు మూలుగుతున్నా, పొదుపు సంఘ సభ్యులు పూర్తి స్థాయిలో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చిరువ్యాపారాలకూ అవకాశం.. స్త్రీనిధి బ్యాంకు ఈ ఏడాది మహిళల జీవనోపాధి కోసంప్రత్యేక రుణ సదుపాయాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గ్రూపు ఎంపిక చేసిన సభ్యురాలికి సుమారు రూ.70 వేల రుణం మంజూరు చేస్తారు. ప్రతిపాదన అందిన వారం లేదా పది రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వాటితో బ్యాంకు సూచించిన 300 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ప్రతి మండలంలో ఐదు సంఘాలకు ఈ ఏడాది అవకాశం కల్పించారు. తీసుకున్న రుణం మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. రుణం మంజూరు విధానమిదీ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును 2010లో {పారంభించింది.స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరిన రెండు రోజుల్లోనే సాధారణ రుణం మంజూరు చేస్తుంది. వ్యాపారం, చదువు, పిల్లల వివాహాలతో పాటు వ్యవసాయ పెట్టుబడుల కోసం పొదుపు గ్రూపులోని ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు. రుణం కోసం గ్రామ సమాఖ్య ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. సంఘంలో పది మంది ఉంటే అందులో ఆరుగురికి మాత్రమే రుణం మంజూరు చేస్తారు. అవసరమైతే జీవనోపాధి కోసం మిగిలిన వారికి కూడా ఇస్తారు. మొదటి సారిగా ఒక్కో గ్రూపునకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తారు. రుణం తీసుకునే ముందుకు సంఘం సభ్యులు నెలకు రూ.10 చొప్పున ఏడాది కాలం పొదుపు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండాలి. బ్యాంకు పొదుపు చేసిన డబ్బులకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. సంఘం సభ్యులు తీసుకున్న రుణం 14 శాతం వడ్డీతో కలుపుకుని రెండేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ బాధలు లేకుండా వ్యాపారం అభివృద్ధి చేసుకున్నా.. నాలుగేళ్లుగా చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాను. పొదుపు గ్రూపులో ఏడేళ్లుగా ఉన్నాను. మొదట రూ.50 వేలు రుణం తీసుకుని చీరెల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు రూ.1.50 లక్షలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాను. స్త్రీనిధిలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల తీర్చుకోవడానికి కూడా సులభంగా ఉంది. తీసుకున్న రుణాలను నిదానంగా చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. అధిక వడ్డీల బాధ లేకుండా పొదుపు సంఘాల ద్వారా డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటున్నాను. - వి.మల్లేశ్వరి, శ్రీలక్ష్మి మహిళా పొదుపు సంఘం, పిడుగురాళ్ళ ఆర్థికంగా వెసులుబాటు కలిగింది.. 2006 నుంచి పొదుపు గ్రూపులో ఉన్నాను. నా గ్రూపులో పది మంది ఉన్నారు. వారిలో కొంతమందికి స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకున్నాం. లోను డబ్బులతో నాలుగేళ్లుగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాను. దీంతో కుటుంబం గడుస్తుంది. వ్యాపారంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఇబ్బంది లేకుండా స్వతంత్య్రంగా నలుగురితో పాటు జీవించగలుగుతున్నాను. - గంధం కుమారి, కల్యాణి పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు.. స్త్రీ నిధి ద్వారా వ్యక్తిగత లోను రూ.70 వేలు తీసుకుని కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ రుణం పొందడంతో వ్యాపారం పెట్టుకోగలిగాను. తద్వారా వచ్చే ఆదాయంతో పొదుపు, లోను డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా లేకుండా చేసుకుంటున్నాను. శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపులో ఆరేళ్లుగా సభ్యురాలిగా ఉన్నాను. ఈ ఏడాది లోను తీసుకుని కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను. - యక్కల దేవి హేమలత, నేతాజీనగర్, శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ