శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటు విలువను తెలుసుకుని ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడంలో మహిళలు ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఓటర్ల అవగాహన సదస్సుకు కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారన్నారు. ప్రలోభాలకు లొంగి అసమర్ధులను ఎన్నుకుంటే ఐదేళ్లు తిరోగమనానికి గురికావాల్సి ఉంటుందన్న విషయం గుర్తించాలన్నారు.
ప్రతి మహిళా ఓటు విషయమై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్య అతిథి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లాలాలజపతిరాయ్ మాట్లాడుతూ 50 శాతానికిపైగా మహిళా ఓటర్లున్న జిల్లాలో వారు చైతన్యవంతులై మంచి నాయకులను ఎన్నుకోవడంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. రాజకీయ చైతన్యంతో వచ్చే ఐదు సంవత్సరాల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. అనంతరం ఓటరు సంకల్ప ప్రమాణ పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించి మహిళా సంఘ సభ్యులతో ఓటుపై ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఆకాశంలోకి బెలూన్లు ఎగరవేసి స్టేడియం నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఓటరు చైతన్యంపై ధనుంజయ బుర్రకథ దళం ప్రదర్శన, ఐకేపీ సిబ్బంది స్వీయ రచనలో కల్యాణ్ బృందం ప్రదర్శించిన లఘు నాటికను కలెక్టర్ ప్రసంశించారు. డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేసీ జి. వీరపాండియన్, ఏజేసీ షరీఫ్, డీఆర్‌వో నూర్‌బాషా ఖాసీం, ఆర్డీవో గణేష్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ర్యాలీకి స్పందన అంతంతమాత్రం
అవగాహన సదస్సుకు స్పందన బాగున్నా ర్యాలీ మాత్రం మొక్కుబడిగా సాగింది. మహిళలకు భోజనం, తాగునీటితోపాటు ఇతర ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు. మహిళలు ఉదయం 9.30 గంటలకే ఆశించినదానికంటే అధికంగానే వచ్చారు. దీంతో వారు సుమారు 4 గంటలు ఎండలో కూర్చోవాల్సి వచ్చింది. వీరి ఇబ్బందిని చూసిన జేసీ షామియాల కిందకు వెళ్లమని సూచించారు. అయితే షామియానాలు వారికి సరిపోలేదు. కార్యక్రమం స్టేడియంలో జరిగితే తాగునీరు, మజ్జిగ సమీపంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఒంటి గంట వరకూ కార్యక్రమం సాగిన అనంతరం ర్యాలీ చేపట్టడంతో చాలామంది మహిళలు అప్పటికే విసిగిపోయి డుమ్మా కొట్టారు. ఆహార పొట్లాల కోసం అంబేద్కర్ ఆడిటోరియంకి పరుగులు తీశారు. దీంతో ర్యాలీ వెలవెలబోయింది. బుర్రకథ, లఘునాటకంతో కాలయాపన జరగడంతో వయస్సుమీరిన మహిళలు మరింత ఇబ్బంది పడ్డారు. ఇక భోజనం పొట్లాలు సరిపడినంతగా లేవు. సంగం మందికి మాత్రమే అందాయి. మిగిలిన వారు తీవ్ర అసంతృప్తితో తిరుగుముఖం పట్టారు.
భోజనం ప్యాకెట్ల పంపిణీ వద్ద సీసీలు, ఏపీఎంలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారు. భోజనం పొట్లాలు అందక బూర్జ మండల సీడివలస, శ్రీకాకుళం మండలం నైర, రణస్థలం మండలం సీతారంపురం, పాలకొండలోని ఎరకరాయునిపురం, ఎచ్చెర్ల మండలం బట్నవానిపేట, సంతకవిటి మండలం మామిడిపల్లి, రేగిడి, వంగర మండలాలకు చెందిన మహిళలు ఆకలితోనే తిరుగుముఖం పట్టారు. ఆధికారుల వైఫల్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో మహిళా శక్తి చాటాలి
Published Sat, Apr 5 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement