ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ! | IKP APD abrupt transfer! | Sakshi
Sakshi News home page

ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ!

Published Thu, Nov 14 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

IKP APD abrupt transfer!

సీతంపేట, న్యూస్‌లైన్ : సీతంపేట ఐటీడీఏలో ఐకేపీ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్(ఏపీడీ)గా పనిచేస్తున్న కె.సావిత్రిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో డ్వామా ఏపీడీ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సావిత్రిని శ్రీకాకుళంలో ల్యాండ్ ఏపీడీగా నియమించారు. 11వ తేదీతో జారీ అయిన ఈ ఉత్తర్వులు బుధవారం ఇక్కడకు అందాయి. అధికారులను బదిలీ చేయటం సాధారణమే అయినా.. పనితీరు బాగోలేదన్న కారణంగా సావిత్రిని బదిలీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొనటం ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఐకేపీ కార్యకలాపాల నిర్వహణలో సీతంపేట ఐటీడీఏ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇందుకోసం సావిత్రి ఎంతో కృషి చేశారు.

వాస్తవానికి, పనితీరు బాగోకపోతే తొలుత సంజాయిషీ అడుగుతారు. కింది స్థాయి ఉద్యోగులను సైతం ఇందుకు బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తారు. అవేమీ లేకుండా ఏపీడీని ఏకంగా బదిలీ చేయడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం డీఆర్‌డీఏలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సావిత్రి ఈ ఏడాది జనవరి ఒకటిన ఇక్కడకు బదిలీపై వచ్చారు. స్వయంశక్తి సంఘాల జమాఖర్చులను సకాలంలో ఆడిట్ చేయించడం, బ్యాంకు లింకేజీ, పీవోపీ లబ్ధిదారులకు రుణాల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటిది ఆమెను పనితీరు బాగోలేదంటూ బదిలీ చేయటం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement