seethampeta
-
ఆకట్టుకుంటున్న ఫైవ్ డీ థియేటర్
(సీతంపేట నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు) అడవుల నడుమ నేల.. నింగి.. నీటిపై సాహస విన్యాసాలు పులకింపజేస్తాయి. ప్రకృతి ధర్మాలకు ఆలవాలమైన మెరుపులు.. వర్షం.. గాలి దుమారం.. పొగ మంచు.. మంచు కురవడం వంటి అనుభూతులన్నీ కృత్రిమంగా ఒకేసారి సాక్షాత్కరించి మనసుల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన తొలి గిరిజన గ్రామీణ అడ్వెంచర్ పార్కులో ఫైవ్ డీ థియేటర్లోకి వెళితే ప్రకృతి అనుభూతులు ఒకేచోట దొరుకుతాయి. సీతంపేట ఏజెన్సీలో లోయలు, కొండలు, జలపాతాలు, నీటి వనరులు పర్యాటక ప్రదేశాలకు అనువైన ప్రాంతాలు. వీటిని దృష్టిలో పెటు్టకుని అడ్వెంచర్ థీమ్‌గా పర్యాటకులకు విహారంతోపాటు వినోదాన్ని పంచేలా పార్కును నిర్మించారు. ఇది 2019 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో బోటింగ్ కోసమే ఈ పార్కు ఉపయోగపడేది. ఇప్పుడు అందరి వినోద, విహార యాత్రకు నెలవైంది. పార్కులో ప్రత్యేకతలివీ అడ్వెంచర్ పార్కులో 5డీ థియేటర్ ప్రధాన ఆకర్షణ. రూ.79 లక్షలతో నిర్మించిన ఈ థియేటర్ వద్ద కృత్రిమ జలపాతం, థియేటర్ ముందు భాగం అంతా అడవి జంతువుల బొమ్మలతో తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లే గది, పక్కన విభాగాలన్నీ ఫైబర్ మెటీరియల్‌తో అందంగా మలిచారు. 5డీ థియేటర్లో మెరుపులు, వర్షం, గాలి, బుడగలు, పొగమంచు, మంచు వంటివి వెంటవెంటనే వచ్చేలా 5 నిముషాల నిడివితో సినిమా ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అడ్వెంచర్ పార్కులో నేల, నింగి, నీటిపై సాహస విన్యాసాలతో వినోదం పొందేలా అభివృద్ధి చేశారు. చిన్నారులకు మెర్రీ గ్రో రౌండ్, క్యాట్ వాక్, క్లైంబింగ్ వాల్, బర్మా బ్రిడ్జి, కమాండో నెట్ వంటి వాటితో బాల విహార్ విభాగం ఉంది. యువతకు కమాండో నెట్, బంగీ జంప్, రాపెల్లింగ్ వాల్ వంటి విన్యాసాలతో కూడిన సాహస విహార్. ఆట పాటలతోపాటు కళలు, నృత్య ప్రదర్శనలకు వేదికగా ఆనంద విహార్. బోటింగ్, వాటర్ రోలర్ వంటి వాటితో జల విహార్. ఎతైన కొండలు, అవరోధాలను దాటుకుని టెర్రైన్ వెహికల్ రైడ్‌కు వైవిధ్య విహార్. నీటిపై తాళ్ల సాయంతో వేలాడే బ్రిడ్జిపై నడిచి వెళ్లే విస్మయ విహార్. నీటిపై గాలిలో తేలుతూ వెళ్లే స్కై సైక్లింగ్ వినూత్న విహార్. బుల్రైడ్స్, సుమో ఫైటింగ్, బంగీ రన్నింగ్, టార్పలిన్ వంటి వినోద విహార్. షూటింగ్, ఆర్చరీ, బాస్కెట్ బాల్‌తో సౌర్య విహార్. గుర్రాలపై స్వారీ ఆశ్వవిహార్. పారాచూట్‌తో చిన్నపాటి ఎగిరే యంత్రాలతో గగన విహార్ విభాగాలను ఏర్పాటు చేశారు. రోజుకు 600 మంది సందర్శకులు వస్తున్నారు. వారాంతంలో అయితే 3 వేల మంది వస్తున్నారు. అడ్వెంచర్ పార్కు ద్వారా నెలకు రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తోంది. తొలి అడ్వెంచర్ పార్కు మన్యం జిల్లా సీతంపేటలో ‘రావెకలబండ’ పేరుతో సహజసిద్ధమైన పురాతన చెరువు ఉంది. 3.70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీనిని అభివృద్ధి చేశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఫైవ్ డీ థియేటర్ ప్రారంభించి అడ్వెంచర్ పార్కులోని అన్ని విభాగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేయడంతో గిరిజన ప్రాంతంలో తొలి అడ్వెంచర్ పార్కుగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 57 గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరిన్ని కుటుంబాలకు పరోక్షంగా ఈ పార్కు వల్ల ఉపాధి లభిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి పర్యాటక కేంద్రంగా మారింది సుమారు పదెకరాల్లో విస్తరించిన సీతంపేట అడ్వెంచర్ పార్కును రూ.2.53 కోట్లతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారు. పర్యాటకులతో రాకతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పరోక్ష ఉపాధి లభిస్తుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. – కల్పనా కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీతంపేట ఐటీడీఏ -
మండే కాలం
సీతంపేట: ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణపాయం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఎండల్లో తిరిగితే సన్(హీట్) స్ట్రోక్ (వడదెబ్బ), హీట్ సింకోప్(తల తిరగడం), హీట్ ఎక్సాషన్( అలసట), హీట్ క్రాంప్స్(కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు పలు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదకరం.. ప్రజలు వేసవిలో ఎక్కువగా వడదెబ్బ బారిన పడతా రు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగి, తగినంత లవణాలున్న నీరు తీసుకోకపోతే అపస్మారక స్థితికి చేరుతారు. తీవ్ర జ్వరం, మూత్రం రాకపోవ డం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు తొలుత గుర్తించాలి. కొందరిలో ఫిట్స్ లక్షణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం. పార్కిన్సన్(తల ఊపడం) వ్యాధికి సంబంధించి మందులు వాడే వా రు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారం తీసుకోవడం ద్వారా డయేరియా సోకే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. శరీరమంతా యాసిడ్ ఏర్పడి అవయవాలపై ప్రభా వం చూపుతాయి. అధిక వేడిమితో చమట కాయలు రావడం, గడ్డలు కట్టడం, సన్‌బర్న్ (చర్మం కమిలిపోవడం) వంటి సమస్యలు వస్తాయి. శరీరంపై దద్దుర్లు సైతం ఏర్పడతాయి. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి.. ఎండ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయిన వ్యక్తులకు చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ లేక కూలర్ ముందు సేదతీరేలా చేయాలి. తడిగుడ్డతో శరీరం తుడవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ప్లూయిడ్స్ ఇవ్వడంతో పాటు ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. దీని ద్వారా మనిషి ప్రాణాపా య స్థితి నుంచి గట్టెక్కుతాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ♦సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ♦ఎటువంటి కార్యక్రమాలనైనా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో చేసుకోవాలి. ♦కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ♦జీన్స్, బ్లాక్ షర్టులు వేసుకోకపోవడం మంచిది. ♦బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగును వెంట తీసుకెళ్లాలి. ♦శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి. ♦సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం మంచిది. ♦తరచుగా నీరు, లవణాలు తీసుకోవాలి. ♦నీటితో పాటు కొబ్బరి బొండాలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. ♦కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦రోడ్లపై విక్రయించే, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ♦ఆయిల్ ఫుడ్, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి.. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో తిరగకూడ దు. ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించడం చాలా మంచిది. –బి. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, సీతంపేట, ఐటీడీఏ -
వివాహం జరిగి ఏడాది నిండలేదు.. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని..
సాక్షి, సీతంపేట/పాడేరు రూరల్: విహారయాత్రలో విషాదం నెలకొంది. వివాహం జరిగి ఏడాది కూడా నిండని దంపతులపై విధి కన్నెర్ర చేసింది. వారి అన్యోన్యతను, ప్రేమానురాగాలను చూసి ఓర్వ లేకపోయింది. భార్యతో కలిసి బైకుపై విహారయాత్రకు వెళ్లగా.. రోడ్డు ప్రమాద రూపంలో వారిని విడదీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ... సీతంపేట కనకమ్మ వీధిలో నివసిస్తున్న జోగా తరుణ్, అతని భార్య హేమలత, మరో నలుగురు స్నేహితులతో కలిసి వంజంగి హిల్స్ చూడటానికి శనివారం బైకులపై బయలుదేరారు. మరో అరగంటలో వారు అందాలను తిలకించే ప్రదేశానికి చేరుకుంటారనగా... పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని వంతాడపల్లి చెక్‌పోస్టు సమీపంలో మలుపు వద్ద తరుణ్ ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారు ఆ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్ వెనుక కూర్చున్న హేమ రోడ్డుపై పడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. బైక్ నడుపుతున్న తరుణ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని కాలర్ బోన్, వెన్నెముక విరిగినట్లు తెలిసింది. ముందుగా తరుణ్‌ను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్సల కోసం కేజీహెచ్‌కు తరలించారు. చదవండి: (2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు) సీతంపేటలో విషాదచాయలు ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సీతంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. వచ్చే నెలలో మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి ఇలా బలితీసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తరుణ్ ల్యాబ్ టెక్నీషియన్. పెదవాల్తేర్‌లో సొంతంగా క్లినికల్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. గతేడాది డిసెంబర్లో గాజువాకకు చెందిన హేమతో వివాహం జరిగింది. ఇటీవల వంజంగి హిల్స్ అందాలపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆకర్షితులయ్యారు. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరో నలుగురు స్నేహితులతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బైకులపై బయలుదేరారు. వర్షంలో తడుస్తూ.. అక్కడక్కడా ఆగుతూ పాడేరు సమీపంలోకి చేరుకున్నారు. ఇంతలో ప్రమాదం జరిగింది. వంజంగి వెళ్తున్నట్టు తరుణ్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఉదయం 8 గంటల సమయంలో పాడేరు నుంచి ఫోన్ వచ్చాక విషయం తెలిసి.. వారంతా షాక్‌కు గురయ్యారు. హేమ మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే కుటుంబ సభ్యులు పాడేరు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదంలోనే..వలంటీర్ ఇంటర్వ్యూకు హాజరు
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : ఓ వైపు భార్య చనిపోయిందన్న విషాదం, మరోవైపు ఇంటర్వ్యూకు హాజరు కాకపోతే ఉద్యోగం రాదేమోనన్న ఆందోళన మధ్య గురువారం గ్రామ వలంటీర్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఓ నిరుద్యోగి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని దిగువసార గ్రామానికి చెందిన బి.తులసి అనే బాలింత బుధవారం మృతి చెందింది. 40 రోజుల కిందట సీతంపేట సామాజిక ఆస్పత్రిలో ఆడ బిడ్డను కన్న ఆమె తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు గురువారం గ్రామ వలంటీర్ పోస్టు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తన దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటర్వ్యూ చేసిన ఎంపీడీవో రాధాకృష్ణన్‌తో కూడిన కమిటీకి సమాధానాలు చెప్పారు. -
అక్రమాల వెలుగు!
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండాల్సిన వెలుగు శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు వెలికితీస్తే రూ.కోట్లలో కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. గతంలో న్యూట్రీషియన్, బాలబడుల కేంద్రాల్లో రూ.కోటి పైనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇతర జిల్లాలకు బదిలీతో సరిపెట్టేశారు. అప్పట్లో విచారణ పేరుతో కాలం గడిపేశారు తప్ప ఫలితం లేదు. తాజాగా ఒక మండల మహిళా సమాఖ్యకు చెందిన సీసీయే రూ.31లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడ్డారంటే పర్యవేక్షణ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. రెండు, మూడేళ్లుగా ఈ అక్రమాలు గుట్టుగా చేస్తుంటే ఎందుకు పట్టించుకోకుండా సంబంధిత అధికారులు వదిలేశారనేది ప్రశ్నగా మారింది. దీనిలో పనిచేస్తున్న వారెవ్వరూ పర్మినెంట్ ఉద్యోగులు కాదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పరిధిలో పనిచేస్తున్న 80 శాతం మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులే. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఏ పథకాలు అమలు చేస్తున్నారు, అసలు నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా? లేదా అనేది వెలుగు ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. కేవలం ఐటీడీఏ స్థాయిలో ఉన్నతాధికారులు పెట్టిన సమావేశాలకు హాజరు కావడం, వారికి కాకి లెక్కలు చూపించేసి మమ అనిపించేయడం పరిపాటిగా మారిపోయింది. కొద్ది రోజులకే పరిమితమైన పుట్టగొడుగుల పెంపకం.. ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, భామిని, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస మండలాల్లో 2015–16లో పుట్టగొడుగుల పెంపకం అని చెప్పి హడావుడి చేసిన అధికారులు కొద్దిరోజులకే మంగళం పాడేశారు. 171 పంచాయతీల్లో 107 మహిళా సంఘాలతో 107 గ్రామాల్లో 228 మంది మహిళా సభ్యులతో పుట్టగొడుగులు పెంపకం అనిచెప్పి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు జరిగిన దాఖలాలు లేవు. బంతి మొక్కలు పెంపకం చేపట్టడం ద్వారా ఆర్థికంగా చేయూత ఇస్తామని తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఆ పథకం కూడా మూతపడింది. ఇందుకు సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించినట్టు చూపి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణే లేదు. తాజాగా స్త్రీనిధి రుణాలు, పసుపుకుంకుమ, గ్రామైఖ్య సంఘం నిధులు రూ.31 లక్షలు వివిధ ఖాతాలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారు. గత అక్రమాలు పరిశీలిస్తే... గతంలో సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లో 2014వ సంవత్సరంలో 110 బాలబడులను ఏర్పాటు చేశారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య ఉన్న చిన్నారులను బాలబడుల్లో చేర్పించి వారికి ఆటపాటల ద్వారా విద్యనందించాలనేది లక్ష్యం. ఎంపిక చేసిన పీవీటీజీ (ప్రిలిమినరీ వలనర్బుల్ ట్రైబుల్ గ్రూప్) గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో చాలా గ్రామాల్లో సరిగా పనిచేయ లేదు. దీంతో పాఠశాలలను పూర్తిగా ఎత్తివేశారు. ఈ బాలబడులకు ఆటవస్తువులు, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.50 లక్షల వరకు వెచ్చించినట్టు రికార్డుల్లో చూపించి, ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకుండా రూ.50 లక్షల వరకు కైంకర్యం చేశారు. ఆరోగ్యం, పోషణ కేంద్రాల ఏర్పాటులో.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి పీవీటీజీ గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. కొత్తూరు, సీతంపేట మండలాల్లో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మధ్యాహ్నం భోజనం, ఉదయం పాలు, కోడి గుడ్లు అందించాలి. చాలా గ్రామాల్లో ఈ పథకం అంటే ఎవరికీ తెలియని పరిస్థితి. వీటికి సంబంధించిన వంట పాత్రలు, ఇతర సామగ్రితో పాటు రూ.30 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కుంభకోణాలు నాకు తెలి యదు. లబ్ధిదారుడు తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే తప్ప..నేనేమి చేయలేను. ప్రస్తుతం తాము రుణాల రికవరీకి గ్రామాలకు వెళితే ఈ తరహా కుంభకోణం బయటపడింది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు నిధుల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. – డైజీ, వెలుగు ఏపీడీ, సీతంపేట అక్రమార్కులపై చర్యలు తప్పవు అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు. వెలుగు అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించడానికి చర్యలు తీసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలపై ముఖ్యమంత్రి కృష్టికి తీసుకువెళ్లి ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వంలో అక్రమార్కులకు కొంతమంది అధికారులు కొమ్ముకాసారు. ఎవరికి దొరికింది వారు దోచుకున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తాం. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
ఎస్బీఐ చోరి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఎస్బీఐ బ్రాంచిలో గతేడాది చోరీ జరిగింది. సుమారు రూ.42 వేలు నగదును దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు అనుకాన్ సబర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పాలకొండలో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు ఒడిశాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఈ చోరీలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇటీవల ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇప్పుడు ప్రధాన నిందితుడిని పట్టుకున్నామన్నారు. దొంగతనానికి వినియోగించిన కారును, వాడిన సామగ్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. గతేడాది డిసెంబర్ 22న చోరీ జరగగా.. సీసీపుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
అంధకారంలో వెలుగు పథకాలు
మూతపడిన న్యూట్రిషన్, బాలబడి కేంద్రాలు ఆదుకోని మార్కెటింగ్ అందని మా ఇంటి మహాలక్ష్మి సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు పథకాలను ఒక్కొక్కటి తుంగలోకి తొక్కేసింది. వెలుగు అంథకారంలోకి వెళ్లిపోతుంది. గిరిజనోద్దరణకు ఏర్పాటు చేసిన టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానటరింగ్ యూనిట్) అటు సిబ్బంది లేక ఇటు పథకాలకు నోచుకోక అంథకారంలోకి వెళ్లిపోయింది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మందస, మెళియాపుట్టి మండలాల్లోని గిరిజనులను ఉద్దరించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. ఒక్కో పథకానికి మంగళం పాడేయడం పరిపాటిగా మారిపోయింది. మొన్న న్యూట్రిషిన్ కేంద్రాలు మూతపడ్డాయి. నిన్న బాలబడులు కూడా మూసివేశారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు పోషకాహారం ఎండమావిగా మారింది. అలాగే చిన్నారులకు ఆటపాటల ద్వారా అందించే బాలబడులు విద్యాకార్యక్రమాలు మూలనపడినట్టయింది. మాఇంటి మహాలక్ష్మికి గ్రహణం మాఇంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుత ప్రభుత్వం నిలుపు చేసింది. ఈ పథకాన్ని వెలుగు నుంచి ఐసీడీఎస్‌కు బదిలీ చేసినా అక్కడ కూడా చిరునామా కరువైంది. ఏడు మండలాల్లో 2,400 మంది గిరిజన బాలికల పేర్లు అప్పట్లో నమోదయ్యాయి. వాటిలో తొలివిడతగా 1,190 మందికి మాత్రమే నగదు బ్యాంకు ఖాతాలో వేశారు. ఐటీడీఏ పరిధిలో మరో 1,210 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రెండేళ్లుగా వీటిపై స్పందన లేదు. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఈ పథకం కొనసాగుతుందా లేదాననే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తి చేసేవరకు ఏటా కొంతమెుత్తాన్ని చెల్లిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, మరో రూ.2,500 ఒకటి, రెండు సంవత్సరాల్లో ఏడాదికి వెయ్యి, 3, 4, 5 ఏళ్లలో సంవత్సరానికి రూ.1,500లు ఇస్తారు. అయిదేళ్ల తర్వాత పాఠశాలకు బాలికను పంపింతే ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు రూ.2,500లు, 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చెల్లించనున్నారు. ఇంటర్ వరకు చదివితే నెలకు రూ.3,500లు, ఇంటర్ పూర్తిచేస్తే రూ.50వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అందించాలి. ఈ పథకం కానరాకుండా పోయింది. అంతంత మాత్రంగానే మార్కెటింగ్ గిరిజనుల ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నడిపి వారికి అన్ని విదాలా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్ధేశంతో పసుపు, చింతపండు, జీడి ప్రొసెసింగ్ కేంద్రాలు గతంలో అయిదు చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక మూత పడ్డాయి. ఐటీడీఏ ప్రాంగణంలో జీడి, పసుపు, చింతపండు కేంద్రాల కోసం నూతనంగా భవనాలు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాలు తెరవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా చింతపండు, పసుపు వంటివాటికి సీజన్ కాకపోవడంతో అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్కెటింగ్ కేంద్రాలు కూడా నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. కొండచీపుర్లు, పినాయిల్ తయారీ జరుగుతుంది. ప్రస్తుతానికి బాలబడి, న్యూట్రిషియన్ కేంద్రాలను మూసివేయడం జరిగింది. – కె.సావిత్రి, ఏపీడీ, వెలుగు. వెలుగు పథకాలన్నీ నిర్వీర్యమే వెలుగు పథకాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పథకాలన్నీ మూతపడ్డాయి. మహిళా సంఘాలకు వెలుగు పథకాలు ఏవీ అక్కరకు రావడం లేదు. ఉన్నవాటిని మూసివేయడం తగదు. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెలే, పాలకొండ. -
తీరు మారలేదు!
తూతూ మంత్రంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ముగ్గురు ఎమ్మెల్యేలు, అరుకు ఎంపీ గైర్హాజర్ మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి 16 శాఖలపై జరగని చర్చ సమస్యలపై నిలదీసిన విపక్ష ఎమెల్యే కళావతి సీతంపేట: మళ్లీ అదే తీరు.. అదే పద్ధతి.. ఏమాత్రం మార్పులేదు. కొంతమంది ప్రజాప్రతినిధుల గైర్హాజర్, ఎనిమిది శాఖలపై చర్చలతోనే సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం సుమారు నాలుగు గంటల్లో తూతూ మంత్రంగా ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలతో పాటు అరుకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు సమావేశానికి హాజరైనప్పటకీ శుక్రవారం కేబినెట్ సమావేశానికి వెళ్లాలంటూ మధ్యలోనే వెళ్లిపోగా.. ఆయనతో పాటే ఎమ్మెల్సీ ప్రతిభాభారతీ పలాయనం చిత్తగించారు. సమస్యలపై తనదైన శైలిలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధికారులను నిలదీశారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, నరసన్నపేట ఎమ్మెల్యే బి.లక్ష్మణరావు, ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి హాజరయ్యారు. మొత్తం 24 శాఖలపై చర్చ జరాగాల్సి ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది శాఖలపై మాత్రమే చర్చ జరిపి 16 శాఖలను వదిలేశారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. కీలకమైన గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, ఎస్ఎంఐ, వెలుగు, గృహనిర్మాణం, గిరిజన సహకార సంస్థ, సమగ్రనీటి యాజమాన్య కార్యక్రమం, మలేరియా, జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక చిన్ననీటి వనరుల శాఖ, ఆర్థిక చేయూతనిచ్చే పథకం, మత్స్యశాఖ తదితర శాఖలపై చర్చ జరగలేదు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాత్రం పలు శాఖల లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో సరైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ పథకాలపై అధికారులను నిలదీస్తుంటే ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అడ్డుతగిలారు. గత సమావేశంలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎజెండా రూపొందించినప్పటకీ వాటిని చదువ లేదు. అలాగే వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, పట్టుపరిశ్రమ, అటవీహక్కుల గుర్తింపు చట్టం వంటి శాఖలపై ముందు చర్చ జరిగింది. కేవలం కీలకశాఖలైన గిరిజన సంక్షేమశాఖ విద్య, వైద్య శాఖలపై మాత్రమే ఆఖరున చర్చ జరగడం గమానార్హం. ప్రతీ సమావేశంలో గిరిజన విద్య, ఇంజినీరింగ్ వంటి శాఖలు ముందు చర్చజరిగేది. ఈ దఫా అంతగా ప్రాధాన్యం లేని శాఖలపై తొలుత చర్చించడంతో ప్రజాప్రతినిధులు అసహనం చెందారు. అలాగే సమావేశంలో సబ్‌ప్లాన్ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు సైతం సమావేశంలో మాట్లాడే అవకాశం లభించలేదు. -
గౌరవం ఫుల్.. వేతనం నిల్
సీతంపేట: గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలకు, చిన్న చిన్న జ్వరాలకు ైవె ద్యం చేస్తూ పల్లెల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వారికిచ్చే గౌరవ వేతనమే అరకొర అరుునా వారికి పద్నాలుగు నెలలుగా అదీ అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కష్టపడి గ్రామాల్లో తిరుగుతూ పనిచేస్తున్న మాకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 398 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు ( సీహెచ్డబ్ల్యూవో) పనిచేస్తున్నారు. నెలకు రూ. 400 గౌరవ వేతనంగా అందిస్తున్నారు. కానీ 14 నెలలుగా అదీ సక్రమంగా అందడంలేదు సరికదా ఉన్న ఉద్యోగం నుంచి కూడా తొలిగిస్తారనే ప్రచారం సాగుతుండడంతో వీరు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తూ ఎండనకా వాననకా గ్రామాల్లో తిరుగుతూ జ్వరం, డయేరియా, మలేరియా వంటి వ్యాధులకు గురైతే ప్రథమ చికిత్స చేసి మందులు అందిస్తుంటారు. గర్భిణీలు, బాలింతలకు అవసరమైన సేవలు చేస్తుంటారు. ఇంత చేసినా వీరికి నెలకు దక్కేది కేవలం రూ. 400 మాత్రమే. సుమారు వీరు పదేళ్లు నుంచి ఈ ఉద్యోగాలు చే స్తున్నారు. అయితే ప్రతి ఏటా వీరు జీతాలు కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తుండడమే తప్ప వీరిని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామాల్లో పనిచేస్తారు కాబట్టి వీరిని గుర్తించే విధంగా ప్రత్యేక యూనిఫారం, టార్చ్‌లైట్, మందుల కిట్ వంటివి ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జె.కృష్ణమోహన్ వద్ద సాక్షి విలేకరి ప్రస్తావించగా నిధులు మంజూరు కాగానే వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఆందోళన చేపడతాం గ్రామ ఆరోగ్య కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళన చేపడతాం. 14 జీతాలు లేక అల్లాడుతున్నారు. వీరికి ఇచ్చేది స్వల్పమే అరుునా సకాలంలో అందించ డంలేదు. వీరికి ఒక గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. - కె.నాగమణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వేతనం ఎలా సరిపోతుంది రూ. 400తో మేం ఎలా బతకాలి. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామాల్లో తిరుగుతూ కష్టపడి పనిచేస్తున్న మాకు పనికి తగ్గ వేతనం అందడంలేదు. గ్రామాల్లో ఎవ రికి వ్యాధులు ప్రభలినా ముందుగా మేమే ప్రథమ చికిత్స చేస్తాం. మాత్రలు ఇస్తాం. అయినా మమ్మల్ని గుర్తించడం లేదు. - కె.భారతి, ఆరోగ్య కార్యకర్త -
గ్రామంపై విరుచుకుపడ్డ ఏనుగులు: రైతు మృతి
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని బుధవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పాడలి గ్రామంపై ఏనుగులు ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేశాయి. ఆ దాడిలో మురళి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. దాంతో ఏనుగులు గ్రామమంతా కలియ దిరుగుతూ హల్చల్ సృష్టించాయి. పాడలి పరిసర ప్రాంతాలలోని పంటపోలాలన్ని పూర్తిగా నాశనమైనాయి. గ్రామస్తులు గ్రామంలోకి వచ్చేందుకు తీవ్రంగా భయపడుతున్నారు. ఏనుగులు గ్రామంలోకి దూసుకువచ్చి దాడి చేయడంతో గ్రామస్తులు సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. -
108లో ఆక్సిజన్ లేక బాలింత మృతి
సీతంపేట, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ మరణానంతరం 108 సేవలు అంతంతమాత్రంగా ఉండటంతో ఎందరి ప్రాణాలో గాలిలో కలిసిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో శనివారం రాత్రి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సీతంపేట మండలం మర్రిపాడు కు చెందిన గొర్లె ఉషారాణి రాత్రి ఇంటి వద్దే ఆడబిడ్డను ప్రసవించింది. అయితే.. శిశువు పుట్టిన వెంటనే ఏడవకపోవడం, చలనం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. ఈలోగా తల్లి స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చినప్పటికీ అందులో ఆక్సిజన్, సెలైన్ ఏమీ లేకపోవడంతో బాధితురాలికి ప్రథమ చికిత్స కూడా అందలేదు. కుటుంబ సభ్యులు వెంటనే మరోసారి 108లో సీతంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సెలైన్ ఎక్కిస్తుండగా ఆమె కన్నుమూసింది. బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. 108 వాహనంలో ఆక్సిజన్, సెలైన్ ఉండి ఉంటే తన భార్య ప్రాణాలు దక్కేవని మృతురాలి భర్త శివ రోదించారు. -
సరుకులు నిండుకున్నాయ్!
సీతంపేట, న్యూస్‌లైన్: ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే సరుకులు అందాలి.. ఈ నెల 22వ తేదీ వచ్చేసినా.. అవి అందలేదు.. బియ్యం మాత్రం వచ్చాయి.. కానీ ఇంకా పంపిణీ కాలేదు.. సరుకులు నిండుకోవడంతో అంగన్వాడీ కేంద్రాలు ఆకలితో అలమటిస్తున్నాయి. సీతంపేట ఏజెన్సీలో మాతాశిశు సంరక్షణ ఈ తీరున ఉంది. అసలే మాతాశిశు మరణాలతో అల్లాడిపోతున్న గిరిజనానికి పోషకాహారం అందించడంలో అధికారులు ఇప్పటికీ విఫలమవుతున్నారు. పర్యవేక్షణ లోపం కారణంతో అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణు లు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం మాటెలా ఉన్నా.. సరైన తిండికీ నోచుకోవడంలేదు. ప్రతి నెలా ఒకటో తేదీనాటికే కేంద్రాలకు అందాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు ఈ నెలలో 22 రోజులు గడిచిపోయినా అందలేదు. నాలుగైదు రోజుల క్రితం బియ్యం వచ్చినా.. ఇంకా కేంద్రాలకు పంపకుండా తాత్సారం చేస్తున్నారు. ఈ విషయం బయటకు చెబితే అధికారులు పనిష్మెంట్లు విధిస్తారేమోనన్న భయంతో అంగన్వాడీ కార్యకర్తలు లోలోపలే మధనపడుతున్నారు. అసలు క్షేత్రస్థాయిలో పోషకాహారం అందుతోందా లేదా.. అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు ఉన్నాయా లేదా.. ఏ సరుకు ఎంత వచ్చిం దన్న విషయం పట్టించుకునే వారు గానీ, సమాధానం చెప్పేవారు గానీ కనిపించడం లేదు. మెనూ మృగ్యం సీతంపేట ఏజె న్సీలో మెయిన్, మినీ కలిపి 231 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఉన్న సుమారు 6,500 మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సమయానుకూలంగా పోషకాహారం అందించాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. సరుకులు నిండుకోవడం, మెనూ పాటించడంలో నిర్లక్ష్యం కారణంగా అవి ఎక్కడా సక్రమంగా అమలు కావడంలేదు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్న బోజనం అమలు చేయాలి. వారంలో నాలుగు రోజులు భోజనంతో కోడిగుడ్లు ఇవ్వాలి. చాలా కేంద్రాలకు గుడ్లు అందలేదు. కందిపప్పు, కూరగాయలు, నూనెలు కూడా సరఫరా కాలేదు. ఫలితంగా ఆయా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అరకొరగానే అందుతోంది. ప్రతి పిల్లవాడికి వారంలో నాలుగు రోజులు 20 గ్రాముల కురుకురే ప్యాకెట్లు, చనాదాల్ ఇవ్వాలి. ఇవి ఏ ఒక్క కేంద్రంలోనూ లేవు. బాలామృతం పథకం కింద 7 నెలల నుంచి 3ఏళ్లలోపు పసిపిల్లలకు నెలకు రెండున్నర కిలోల పాలపొడి ఇవ్వాలి. అది కూడా సరఫరా కాలేదు. ఇందిరమ్మ అమృత హస్తం పథకం కింద గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడం కూడా గగనంగా మారుతోంది. ఈ విషయమై సీడీపీవో టి.విమలారాణీ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఇంకా స్టాక్ రాలేదని చెప్పారు. స్టాక్ వచ్చిన వెంటనే కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు. -
ఐకేపీ ఏపీడీ ఆకస్మిక బదిలీ!
సీతంపేట, న్యూస్‌లైన్ : సీతంపేట ఐటీడీఏలో ఐకేపీ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్(ఏపీడీ)గా పనిచేస్తున్న కె.సావిత్రిని ఆకస్మికంగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో డ్వామా ఏపీడీ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సావిత్రిని శ్రీకాకుళంలో ల్యాండ్ ఏపీడీగా నియమించారు. 11వ తేదీతో జారీ అయిన ఈ ఉత్తర్వులు బుధవారం ఇక్కడకు అందాయి. అధికారులను బదిలీ చేయటం సాధారణమే అయినా.. పనితీరు బాగోలేదన్న కారణంగా సావిత్రిని బదిలీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొనటం ఉద్యోగ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఐకేపీ కార్యకలాపాల నిర్వహణలో సీతంపేట ఐటీడీఏ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇందుకోసం సావిత్రి ఎంతో కృషి చేశారు. వాస్తవానికి, పనితీరు బాగోకపోతే తొలుత సంజాయిషీ అడుగుతారు. కింది స్థాయి ఉద్యోగులను సైతం ఇందుకు బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తారు. అవేమీ లేకుండా ఏపీడీని ఏకంగా బదిలీ చేయడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం డీఆర్డీఏలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సావిత్రి ఈ ఏడాది జనవరి ఒకటిన ఇక్కడకు బదిలీపై వచ్చారు. స్వయంశక్తి సంఘాల జమాఖర్చులను సకాలంలో ఆడిట్ చేయించడం, బ్యాంకు లింకేజీ, పీవోపీ లబ్ధిదారులకు రుణాల మంజూరు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాంటిది ఆమెను పనితీరు బాగోలేదంటూ బదిలీ చేయటం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదని ఉద్యోగులు అంటున్నారు. -
వాబలో 8 పూరిళ్లు దగ్ధం
వాబ (సీతంపేట),న్యూస్‌లైన్: సీతంపేట మండలంలోని వాబ గ్రామంలో శుక్రవారం సాయింత్రం అగ్ని ప్రమాదంలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ గ్రామంలో ఎనిమిది కుటుంబాలే ఉండగా, వీరికి చెందిన ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో ఇది జరిగింది. పొలం పనుల్లో ఉన్న గిరిజనులు సమాచారం తెలసుకుని గ్రామానికి వచ్చేసరికి ఇళ్లు కాలిపోయాయి. దీంతో గిరిజనులు కట్టుబట్టలతో మిగిలారు. బాధితులది కుశిమి పంచాయతీ జజ్జువ గ్రామం. ఏటా వ్యవసాయ పనులు చేయడానికి ఈ ఖరీఫ్ సీజన్లో వీరంతా వాబ వచ్చి వరి పండించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుంటారు. ఈ పనుల కోసమే తాత్కాలికంగా పూరిళ్లు నిర్మించుకున్నారు. వరి ఊబాలు చేయడానికి వచ్చిన తరుణంలో ఇళ్లన్నీ కాలిపోయాయి. దీంతో సవర బెన్నయ్య, సవర అప్పన్న, చెంచయ్య, బాలేషు, జగ్గయ్య, వెంకయ్య, మంగయ్య, సుక్కయ్యలకు చెందిన ఇళ్లు బూడిదయ్యాయి. వండుకోవడానికి ఉంచిన బియ్యం, వ్యవసాయ పెట్టుబడుల కోసం తెచ్చిన నగదు, నిత్యావసర సరకులు, దుస్తులు, ఇతర అటవీ ఉత్పత్తులు కాలిపోవడంతో గిరిజనులు లబోదిబో మంటున్నారు. సవర అప్పన్నకు చెందిన రూ.15 వేలు కాలిపోయాయి. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. కుశిమిలో శనివారం వారపు సంత జరగనుండడంతో అక్కడకు కొంతమంది గిరిజనులు తమ అటవీఉత్పత్తులు విక్రయించడానికి తీసుకువెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేరు. స్పందించిన ఐటీడీఏ రెవెన్యూ యంత్రాగం సమైక్యాంధ్ర సమ్మెలో ఉండడంతో ఐటీడీఏ పీవో కె.సునీల్‌రాజ్‌కుమార్ వెంటనే స్పందించారు. సహాయక చర్యల కోసం సిబ్బందిని గ్రామానికి పంపారు. డిప్యూటీ డీఈవో సుబ్బారావు, ఐకేపీ ఏపీఎం నీలాచలం, డీపీఎం సత్యంనాయుడు, ఏటీడబ్ల్యూవో తిరుపతిరావులు గ్రామాన్ని సందర్శించారు. రాత్రికి అందరకీ భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం గ్రాామాన్ని సందర్శించి మిగతా సహాయక చర్యలు చేపడతామని పీవో తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.