(సీతంపేట నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు)
అడవుల నడుమ నేల.. నింగి.. నీటిపై సాహస విన్యాసాలు పులకింపజేస్తాయి. ప్రకృతి ధర్మాలకు ఆలవాలమైన మెరుపులు.. వర్షం.. గాలి దుమారం.. పొగ మంచు.. మంచు కురవడం వంటి అనుభూతులన్నీ కృత్రిమంగా ఒకేసారి సాక్షాత్కరించి మనసుల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన తొలి గిరిజన గ్రామీణ అడ్వెంచర్ పార్కులో ఫైవ్ డీ థియేటర్‌లోకి వెళితే ప్రకృతి అనుభూతులు ఒకేచోట దొరుకుతాయి. సీతంపేట ఏజెన్సీలో లోయలు, కొండలు, జలపాతాలు, నీటి వనరులు పర్యాటక ప్రదేశాలకు అనువైన ప్రాంతాలు. వీటిని దృష్టిలో పెటు్టకుని అడ్వెంచర్ థీమ్‌గా పర్యాటకులకు విహారంతోపాటు వినోదాన్ని పంచేలా పార్కును నిర్మించారు. ఇది 2019 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో బోటింగ్ కోసమే ఈ పార్కు ఉపయోగపడేది. ఇప్పుడు అందరి వినోద, విహార యాత్రకు నెలవైంది.
పార్కులో ప్రత్యేకతలివీ
అడ్వెంచర్ పార్కులో 5డీ థియేటర్ ప్రధాన ఆకర్షణ. రూ.79 లక్షలతో నిర్మించిన ఈ థియేటర్ వద్ద కృత్రిమ జలపాతం, థియేటర్ ముందు భాగం అంతా అడవి జంతువుల బొమ్మలతో తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లే గది, పక్కన విభాగాలన్నీ ఫైబర్ మెటీరియల్‌తో అందంగా మలిచారు. 5డీ థియేటర్‌లో మెరుపులు, వర్షం, గాలి, బుడగలు, పొగమంచు, మంచు వంటివి వెంటవెంటనే వచ్చేలా 5 నిముషాల నిడివితో సినిమా ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అడ్వెంచర్ పార్కులో నేల, నింగి, నీటిపై సాహస విన్యాసాలతో వినోదం పొందేలా అభివృద్ధి చేశారు. చిన్నారులకు మెర్రీ గ్రో రౌండ్, క్యాట్ వాక్, క్లైంబింగ్ వాల్, బర్మా బ్రిడ్జి, కమాండో నెట్ వంటి వాటితో బాల విహార్ విభాగం ఉంది.
యువతకు కమాండో నెట్, బంగీ జంప్, రాపెల్లింగ్ వాల్ వంటి విన్యాసాలతో కూడిన సాహస విహార్. ఆట పాటలతోపాటు కళలు, నృత్య ప్రదర్శనలకు వేదికగా ఆనంద విహార్. బోటింగ్, వాటర్ రోలర్ వంటి వాటితో జల విహార్. ఎతైన కొండలు, అవరోధాలను దాటుకుని టెర్రైన్ వెహికల్ రైడ్‌కు వైవిధ్య విహార్. నీటిపై తాళ్ల సాయంతో వేలాడే బ్రిడ్జిపై నడిచి వెళ్లే విస్మయ విహార్. నీటిపై గాలిలో తేలుతూ వెళ్లే స్కై సైక్లింగ్ వినూత్న విహార్. బుల్‌రైడ్స్, సుమో ఫైటింగ్, బంగీ రన్నింగ్, టార్పలిన్ వంటి వినోద విహార్. షూటింగ్, ఆర్చరీ, బాస్కెట్ బాల్‌తో సౌర్య విహార్. గుర్రాలపై స్వారీ ఆశ్వవిహార్. పారాచూట్‌తో చిన్నపాటి ఎగిరే యంత్రాలతో గగన విహార్ విభాగాలను ఏర్పాటు చేశారు. రోజుకు 600 మంది సందర్శకులు వస్తున్నారు. వారాంతంలో అయితే 3 వేల మంది వస్తున్నారు. అడ్వెంచర్ పార్కు ద్వారా నెలకు రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తోంది.
తొలి అడ్వెంచర్ పార్కు
మన్యం జిల్లా సీతంపేటలో ‘రావెకలబండ’ పేరుతో సహజసిద్ధమైన పురాతన చెరువు ఉంది. 3.70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీనిని అభివృద్ధి చేశాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఫైవ్ డీ థియేటర్ ప్రారంభించి అడ్వెంచర్ పార్కులోని అన్ని విభాగాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని అభివృద్ధి చేయడంతో గిరిజన ప్రాంతంలో తొలి అడ్వెంచర్ పార్కుగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 57 గిరిజన కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరిన్ని కుటుంబాలకు పరోక్షంగా ఈ పార్కు వల్ల ఉపాధి లభిస్తోంది.
– పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి
పర్యాటక కేంద్రంగా మారింది
సుమారు పదెకరాల్లో విస్తరించిన సీతంపేట అడ్వెంచర్ పార్కును రూ.2.53 కోట్లతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంతోపాటు సరిహద్దు జిల్లాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారు. పర్యాటకులతో రాకతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పరోక్ష ఉపాధి లభిస్తుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
– కల్పనా కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్, సీతంపేట ఐటీడీఏ
Comments
Please login to add a commentAdd a comment