సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతకు సూచికగా ఓ సంబరంలా సాగింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఆరంభమైన బస్సు యాత్ర పార్వతీపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశించింది. మోటారు బైకు ర్యాలీతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు.
మహిళల కోలాటం, తప్పిటగుళ్ల కళాకారుల ప్రదర్శనలు, తీన్‌మార్ వాయిద్యాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జై జగన్ నినాదాలతో పార్వతీపురం పట్టణం హోరెత్తింది. పార్వతీపురం బస్టాండ్ వద్ద జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ అలరించింది. సభకు తరలివచ్చిన జనంతో పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారి కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మంత్రులు, నేతలు ప్రసంగించారు.
రాజ్యాంగం ఆశయాలు ఇన్నాళ్లకు సాకారమయ్యాయి: మంత్రి ధర్మాన
భారత రాజ్యాంగ ఆశయాలను స్వాతంత్య్రం వచ్చి న ఇన్నాళ్లకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదవారు సైతం పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి, ఉచిత వైద్యం పొందడానికి, సొంత ఇంటిలో ఉండటానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లభించిందన్నారు. ధనిక వర్గాలకే పరిమితమైన ఆంగ్ల విద్యను అందరికీ అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు.
జగన్‌తోనే బడుగులకు మేలు: మంత్రి రాజన్నదొర
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌తోనే మేలు జరిగిందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఎస్సీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ రూ.61 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పోడు, బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు.
దశాబ్దాల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే అలజంగి జోగారావు
ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంనాటి సమస్యలను సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. అరి్టకల్ 11, 17, 1 5(సి)ని పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ విజయనగరం, పారీ్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment