- తూతూ మంత్రంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
- ముగ్గురు ఎమ్మెల్యేలు, అరుకు ఎంపీ గైర్హాజర్
- మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి
- 16 శాఖలపై జరగని చర్చ
- సమస్యలపై నిలదీసిన విపక్ష ఎమెల్యే కళావతి
సీతంపేట: మళ్లీ అదే తీరు.. అదే పద్ధతి.. ఏమాత్రం మార్పులేదు. కొంతమంది ప్రజాప్రతినిధుల గైర్హాజర్, ఎనిమిది శాఖలపై చర్చలతోనే సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం సుమారు నాలుగు గంటల్లో తూతూ మంత్రంగా ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలతో పాటు అరుకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు.
మంత్రి అచ్చెన్నాయుడు సమావేశానికి హాజరైనప్పటకీ శుక్రవారం కేబినెట్ సమావేశానికి వెళ్లాలంటూ మధ్యలోనే వెళ్లిపోగా.. ఆయనతో పాటే ఎమ్మెల్సీ ప్రతిభాభారతీ పలాయనం చిత్తగించారు. సమస్యలపై తనదైన శైలిలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధికారులను నిలదీశారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, నరసన్నపేట ఎమ్మెల్యే బి.లక్ష్మణరావు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జెడ్‌పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి హాజరయ్యారు.
మొత్తం 24 శాఖలపై చర్చ జరాగాల్సి ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది శాఖలపై మాత్రమే చర్చ జరిపి 16 శాఖలను వదిలేశారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. కీలకమైన గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, ఎస్‌ఎంఐ, వెలుగు, గృహనిర్మాణం, గిరిజన సహకార సంస్థ, సమగ్రనీటి యాజమాన్య కార్యక్రమం, మలేరియా, జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక చిన్ననీటి వనరుల శాఖ, ఆర్థిక చేయూతనిచ్చే పథకం, మత్స్యశాఖ తదితర శాఖలపై చర్చ జరగలేదు.
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాత్రం పలు శాఖల లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో సరైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ పథకాలపై అధికారులను నిలదీస్తుంటే ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అడ్డుతగిలారు. గత సమావేశంలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎజెండా రూపొందించినప్పటకీ వాటిని చదువ లేదు. అలాగే వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, పట్టుపరిశ్రమ, అటవీహక్కుల గుర్తింపు చట్టం వంటి శాఖలపై ముందు చర్చ జరిగింది.
కేవలం కీలకశాఖలైన గిరిజన సంక్షేమశాఖ విద్య, వైద్య శాఖలపై మాత్రమే ఆఖరున చర్చ జరగడం గమానార్హం. ప్రతీ సమావేశంలో గిరిజన విద్య, ఇంజినీరింగ్ వంటి శాఖలు ముందు చర్చజరిగేది. ఈ దఫా అంతగా ప్రాధాన్యం లేని శాఖలపై తొలుత చర్చించడంతో ప్రజాప్రతినిధులు అసహనం చెందారు. అలాగే సమావేశంలో సబ్‌ప్లాన్ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీ, జెడ్‌పీటీసీ సభ్యులకు సైతం సమావేశంలో మాట్లాడే అవకాశం లభించలేదు.