వాబలో 8 పూరిళ్లు దగ్ధం
Published Sat, Aug 24 2013 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
వాబ (సీతంపేట),న్యూస్‌లైన్: సీతంపేట మండలంలోని వాబ గ్రామంలో శుక్రవారం సాయింత్రం అగ్ని ప్రమాదంలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ గ్రామంలో ఎనిమిది కుటుంబాలే ఉండగా, వీరికి చెందిన ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో ఇది జరిగింది. పొలం పనుల్లో ఉన్న గిరిజనులు సమాచారం తెలసుకుని గ్రామానికి వచ్చేసరికి ఇళ్లు కాలిపోయాయి. దీంతో గిరిజనులు కట్టుబట్టలతో మిగిలారు. బాధితులది కుశిమి పంచాయతీ జజ్జువ గ్రామం. ఏటా వ్యవసాయ పనులు చేయడానికి ఈ ఖరీఫ్ సీజన్లో వీరంతా వాబ వచ్చి వరి పండించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుంటారు. ఈ పనుల కోసమే తాత్కాలికంగా పూరిళ్లు నిర్మించుకున్నారు. వరి ఊబాలు చేయడానికి వచ్చిన తరుణంలో ఇళ్లన్నీ కాలిపోయాయి.
దీంతో సవర బెన్నయ్య, సవర అప్పన్న, చెంచయ్య, బాలేషు, జగ్గయ్య, వెంకయ్య, మంగయ్య, సుక్కయ్యలకు చెందిన ఇళ్లు బూడిదయ్యాయి. వండుకోవడానికి ఉంచిన బియ్యం, వ్యవసాయ పెట్టుబడుల కోసం తెచ్చిన నగదు, నిత్యావసర సరకులు, దుస్తులు, ఇతర అటవీ ఉత్పత్తులు కాలిపోవడంతో గిరిజనులు లబోదిబో మంటున్నారు. సవర అప్పన్నకు చెందిన రూ.15 వేలు కాలిపోయాయి. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. కుశిమిలో శనివారం వారపు సంత జరగనుండడంతో అక్కడకు కొంతమంది గిరిజనులు తమ అటవీఉత్పత్తులు విక్రయించడానికి తీసుకువెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేరు.
స్పందించిన ఐటీడీఏ
రెవెన్యూ యంత్రాగం సమైక్యాంధ్ర సమ్మెలో ఉండడంతో ఐటీడీఏ పీవో కె.సునీల్‌రాజ్‌కుమార్ వెంటనే స్పందించారు. సహాయక చర్యల కోసం సిబ్బందిని గ్రామానికి పంపారు. డిప్యూటీ డీఈవో సుబ్బారావు, ఐకేపీ ఏపీఎం నీలాచలం, డీపీఎం సత్యంనాయుడు, ఏటీడబ్ల్యూవో తిరుపతిరావులు గ్రామాన్ని సందర్శించారు. రాత్రికి అందరకీ భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం గ్రాామాన్ని సందర్శించి మిగతా సహాయక చర్యలు చేపడతామని పీవో తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement