సరుకులు నిండుకున్నాయ్!
Published Thu, Jan 23 2014 6:29 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
సీతంపేట, న్యూస్‌లైన్: ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే సరుకులు అందాలి.. ఈ నెల 22వ తేదీ వచ్చేసినా.. అవి అందలేదు..
బియ్యం మాత్రం వచ్చాయి.. కానీ ఇంకా పంపిణీ కాలేదు.. సరుకులు నిండుకోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఆకలితో అలమటిస్తున్నాయి. సీతంపేట ఏజెన్సీలో మాతాశిశు సంరక్షణ ఈ తీరున ఉంది. అసలే మాతాశిశు మరణాలతో అల్లాడిపోతున్న గిరిజనానికి పోషకాహారం అందించడంలో అధికారులు ఇప్పటికీ విఫలమవుతున్నారు. పర్యవేక్షణ లోపం కారణంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణు లు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం మాటెలా ఉన్నా.. సరైన తిండికీ నోచుకోవడంలేదు. ప్రతి నెలా ఒకటో తేదీనాటికే కేంద్రాలకు అందాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు ఈ నెలలో 22 రోజులు గడిచిపోయినా అందలేదు. నాలుగైదు రోజుల క్రితం బియ్యం వచ్చినా.. ఇంకా కేంద్రాలకు పంపకుండా తాత్సారం చేస్తున్నారు. ఈ విషయం బయటకు చెబితే అధికారులు పనిష్మెంట్లు విధిస్తారేమోనన్న భయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు లోలోపలే మధనపడుతున్నారు. అసలు క్షేత్రస్థాయిలో పోషకాహారం అందుతోందా లేదా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకులు ఉన్నాయా లేదా.. ఏ సరుకు ఎంత వచ్చిం దన్న విషయం పట్టించుకునే వారు గానీ, సమాధానం చెప్పేవారు గానీ కనిపించడం లేదు.
మెనూ మృగ్యం
సీతంపేట ఏజె న్సీలో మెయిన్, మినీ కలిపి 231 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఉన్న సుమారు 6,500 మంది చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సమయానుకూలంగా పోషకాహారం అందించాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. సరుకులు నిండుకోవడం, మెనూ పాటించడంలో నిర్లక్ష్యం కారణంగా అవి ఎక్కడా సక్రమంగా అమలు కావడంలేదు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్న బోజనం అమలు చేయాలి. వారంలో నాలుగు రోజులు భోజనంతో కోడిగుడ్లు ఇవ్వాలి. చాలా కేంద్రాలకు గుడ్లు అందలేదు. కందిపప్పు, కూరగాయలు, నూనెలు కూడా సరఫరా కాలేదు. ఫలితంగా ఆయా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అరకొరగానే అందుతోంది.
ప్రతి పిల్లవాడికి వారంలో నాలుగు రోజులు 20 గ్రాముల కురుకురే ప్యాకెట్లు, చనాదాల్ ఇవ్వాలి. ఇవి ఏ ఒక్క కేంద్రంలోనూ లేవు. బాలామృతం పథకం కింద 7 నెలల నుంచి 3ఏళ్లలోపు పసిపిల్లలకు నెలకు రెండున్నర కిలోల పాలపొడి ఇవ్వాలి. అది కూడా సరఫరా కాలేదు. ఇందిరమ్మ అమృత హస్తం పథకం కింద గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడం కూడా గగనంగా మారుతోంది. ఈ విషయమై సీడీపీవో టి.విమలారాణీ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఇంకా స్టాక్ రాలేదని చెప్పారు. స్టాక్ వచ్చిన వెంటనే కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు.
Advertisement