బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. కనీసం వడ్డించే అన్నం కూడా సరిగా లేక అంగన్‌వాడీ కేంద్రాల వైపు చూసేందుకే ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండడంతో చిన్నారులకు ముద్ద దిగడం లేదు. అర్ధాకలితోనే ఉండాల్సి వస్తోంది. సగం మంది కూడా భోజనం కోసం కేంద్రాలకు రాని పరిస్థితి నెలకొంది. వచ్చిన వారు సైతం కడుపునిండా తినడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు కార్యరూపం దాల్చ లేదు. –వట్‌పల్లి(అందోల్)
బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా దొడ్డు బియ్యం పంపిణీ చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,344 ప్రధాన కేంద్రాలు, 160 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో బాలింతలు 11,359 మంది, గర్భిణులు 10,398 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 53 వేల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 48,108 మంది చిన్నారులు ఉన్నారు. ఆయా కేంద్రాలన్నింటికీ దొడ్డు రకం బియ్యం సరఫరా కావడంతో నిర్వాహకులు చేసేది లేక వాటినే వండి పెడుతున్నారు. అన్నం దొడ్డుగా, ముద్దలు ముద్దలుగా ఉండడంతో తినేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన భోజనాన్ని అందించడం లేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి.
నీరుగారుతున్న పథకం..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు బాలింతలకు గుడ్డుతో పాటు కూరగాయలతో భోజనం వండిపెడతారు. రోజూ కోడి గుడ్డు ఇస్తుండగా మిగతా రోజుల్లో ఆహార పట్టిక ప్రకారం సాంబారు, కూరగాయలు వండివడ్డిస్తారు. వీటికి అవసరమైన బియ్యంతో పాటు పప్పులు, కోడిగుడ్లు ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇవన్నీ బాగానే ఉన్నా దొడ్డుబియ్యం సరఫరా చేస్తుండడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఇళ్లలోనే సన్నబియ్యంతో కూడిన భోజనం తింటున్నారు. అలాంటిది అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి దొడ్డు బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇష్టపడడం లేదు. చిన్నారులు కడుపు నిండా తినడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చిన్నారులను దృష్టిలో ఉంచుకొనైనా సన్నబియ్యం సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
అటు సన్నబియ్యం.. ఇటు దొడ్డు బియ్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మ ధ్యాహ్న భోజనానికి సన్నరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు వసతిగృహాల్లోనూ సన్నబియ్యం అందిస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం దొడ్డు రకం పంపిణీ చేస్తున్నారు. పలు చోట్ల పాఠశాలల ఆవరణలోనే అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అరగంట తేడాతో మధ్యాహ్న భోజనా న్ని అందరికీ వడ్డిస్తారు. పక్కనే ఉన్న పాఠశాలల్లో సన్నరకం బియ్యంతో తృప్తిగా భోజనం చేస్తుండగా తాము మాత్రం దొడ్డు బియ్యంతో అన్నం తినలేక తింటున్నామని అంగ్‌వాడీ కేంద్రాలకు వచ్చేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం వదిలేస్తున్నాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో పెడుతున్న దొడ్డు బియ్యం అన్నాన్ని సరిగ్గా తినలేక సగం వదిలేస్తున్నాం. కడుపునిండా తినలేక అర్ధాకలితో ఇంటికి వస్తున్నాం. కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడితే బాగుంటుంది. – లక్ష్మి, గర్భిణి, కేరూర్
ఎలాంటి ఆదేశాలు రాలేదు
అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీచేసే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పటికీ గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాం. – మోతి, ఐసీడీఎస్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment