
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఈ నెల నుంచి సార్టెక్స్ బియ్యానికి బదులు పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో సూక్ష్మపోషక విలువలతో పాటు రక్తహీనతను నివారించే ఐరన్, గర్భస్థ శిశువు వికాసానికి ఉపకరించే ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్యవస్ధ బలోపేతానికి అవసరమైన విటమిన్ బి–12 వంటివి ఉంటాయని వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.15 లక్షల గర్భిణులు, బాలింతలు, 9.66 లక్షల పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై క్షేత్ర స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్స్, సీడీపీవోలకు తగిన సూచనలు ఇచ్చి విస్తృత ప్రచారం చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానమైన లబ్ధిదారులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కృతికా శుక్లా గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment