సాక్షి, అమరావతి: సబ్సిడీ బియ్యం నిల్వ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్లు ఖర్చు చేసి 8 జిల్లాల్లో కొత్తగా గోదాముల నిర్మాణాలు చేపడుతోంది. ఇవి పూర్తయితే దాదాపు 43 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా నిల్వ చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో పేదలకు పంపిణీ కోసం సేకరించనున్న బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు నిల్వ చేసేందుకు పౌరసరఫరాల సంస్థకు చెందిన 183 మండల స్థాయి గోదాముల్లో 81,750 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో మిగిలిన చోట్ల ప్రైవేటు గోదాములను అద్దెకు తీసుకుంటున్నారు. వీటి లీజుల రూపేణా ఏడాదికి రూ.50 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా అద్దె రూపంలో చెల్లిస్తున్న డబ్బులతోనే సొంతంగా గోదాములు నిర్మిస్తే మున్ముందు ప్రైవేటు గోదాములను తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఏడాదికి కొన్ని గోదాముల చొప్పున నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పౌరసరఫరాల సంస్థకు సొంతంగా ఉన్న గోదాములు..
రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 7, విశాఖపట్నం 24, తూర్పు గోదావరి 7, పశ్చిమ గోదావరి 11, కృష్ణా 6, గుంటూరు 11, ప్రకాశం 13, నెల్లూరు 15, అనంతపురం 40, వైఎస్సార్ 27, కర్నూలు 7, చిత్తూరులో 11 చోట్ల గోదాములు ఉన్నాయి.
కొత్తగా నిర్మించే గోదాముల వివరాలు..
- శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి, గొట్టిపల్లి, జలుమూరు, భామిని, కొత్తూరు, వెన్నెలవలస, బెండి, దేవనపల్లి, రామచంద్రాపురం, జి.సిగడం, గోపాలపురం, తాళ్లవలస, టెక్కలి ప్రాంతాల్లో 12,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మాణం.
- విశాఖపట్నం జిల్లాలోని వడ్లపూడి, కె.కొత్తపాడు, ఆనందపురంలలో 5,500 మెట్రిక్ టన్నులు..
- విజయనగరం జిల్లా బొబ్బిలిలో 1,000 మెట్రిక్ టన్నులు..
- తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, కాపవరం, మేములపల్లిలో 9,000 మెట్రిక్ టన్నులు..
- వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, ముద్దనూరు, ప్రొద్దుటూరులో 3,500 మెట్రిక్ టన్నులు..
- అనంతపురం జిల్లా కదిరి, దొరిగల్లులో 3,000 మెట్రిక్ టన్నులు..
- చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట, తంబళ్లపల్లి, వి.కోట, నలగంపల్లి, నోరువోయి, గుడరేవలపల్లి, విట్టలం గ్రామాల్లో 8,000 మెట్రిక్ టన్నులు..
- నెల్లూరు జిల్లా గుడాలి గ్రామంలో 1,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మాణాలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment