జనవరి నుంచే రేషన్ షాపులకు సన్నబియ్యం అని ప్రకటించిన ప్రభుత్వం
ప్రస్తుతం సర్కార్ గోడౌన్‌లలో సన్న బియ్యం నిల్వలు స్వల్పమే
పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న ధాన్యంలో 95 శాతం దొడ్డు వడ్లే
ఈ ఖరీఫ్‌లో సన్న ధాన్యం మార్కెట్‌కు వస్తుందని సర్కార్ భావన
రూ.500 బోనస్ ప్రకటనతో పంట పెరుగుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లలో సన్నబియ్యం నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నులు కూడా లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి అవసరమయ్యే సన్న బియ్యాన్ని ఎలా సేకరించాలనే విషయమై సంస్థ తర్జన భర్జన పడుతోంది. ఖరీఫ్ పంట అక్టోబర్ నుంచి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఎంత మేరకు ధాన్యం వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. వచి్చన సన్నాలను మరాడించి సన్న బియ్యంగా జనవరి నుంచి రేషన్ దుకాణాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
24 ఎల్‌ఎంటీల బియ్యం అవసరం
రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రేషన్‌కార్డులు 89.96 లక్షలున్నాయి. ఈ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నెలకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 21.60 ఎల్‌ఎంటీల సన్నబియ్యం కావాలి. ఇవికాకుండా ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి కలిపి ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా సన్నబియ్యం 24 ఎల్‌ఎంటీలు అవసరమవుతుంది.
ఇందుకోసం 36 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు గత ప్రభుత్వ హయాం నుంచే సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం కొరత ఏర్పడటంతో గత మే నెలలో 2.2 ఎల్‌ఎంటీ సన్న బియ్యం కొనుగోలు కోసం టెండర్లను ఆహా్వనించిన ప్రభుత్వం తరువాత వెనకడుగు వేసింది.
ఖరీఫ్‌లో వచ్చే సన్న ధాన్యం 5 ఎల్‌ఎంటీ లోపే..
రాష్ట్రంలో సగటున ఏటా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. ఇందులో ఖరీఫ్‌లో మాత్రమే రైతులు సన్నాలను పండిస్తున్నారు. ఈ సీజన్‌లో పౌరసరఫరాల శాఖ 50 నుంచి 60 ఎల్‌ఎంటీల ధాన్యం మాత్రమే సేకరించగలుగుతోంది. ఇందులో 5 ఎల్‌ఎంటీలే సన్నాలు ఉంటున్నాయి. రైతులు ఈ సీజన్‌లో సన్నాలను పండించినప్పటికీ, తమ అవసరాలకు నిల్వ చేసుకుంటుండటంతో మార్కెట్‌కు రావట్లేదు.
నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో పండే మేలు రకం సన్న ధాన్యం నేరుగా మిల్లులకు వెళ్లడం లేదంటే బియ్యంగా మార్చి విక్రయించడం జరుగుతోంది. రబీలో వచ్చే మరో 70 ఎల్‌ఎంటీల ధాన్యంలో సన్నాలు నిల్. రాష్ట్ర వాతావరణం రీత్యా రబీలో సన్న ధాన్యం పండిస్తే, నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాల పంట పంట కావడంతో రైతులు దొడ్డు ధాన్యాన్నే పండిస్తున్నారు.
ఈ ఖరీఫ్‌సీజన్‌పై సర్కార్ ఆశ
రూ.500 బోనస్ ప్రకటనతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సన్నాలను రైతులు అధికంగా పండించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,320 ఉండగా, ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తే ఆ మొత్తం రూ. 2,820 అవుతుంది. కాగా 30 రకాలను రూ. 500 బోనస్ ఇచ్చే ఫైన్ వెరైటీలుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఫైన్ వెరైటీల్లో అధిక డిమాండ్ ఉన్న హెచ్‌ఎంటీ, సోనా మసూరి, జైశ్రీరాం వంటి రకాలు అధిక ధరలకు అమ్ముడుపోయినా, మిగతా వెరైటీలకు డిమాండ్ లేకపోవడంతో అవి మార్కెట్‌కు వస్తాయని భావిస్తోంది. అక్టోబర్ చివరి నుంచి ధాన్యం సేకరణ చేపట్టి, సన్నాలను వెంటవెంటనే మిల్లింగ్ చేస్తే జనవరి నాటికి రేషన్ దుకాణాలకు పంపవచ్చని ఓ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment