ఆకలి తీర్చాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు.. అరకొర వసతులతో అలమటిస్తున్నాయి. నాణ్యమైన సరుకులు అందక పౌష్టికాహార కేంద్రాలు నిస్సారంగా మారాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ.. మాతాశిశు మరణాలను నివారించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు అవస్థలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో కొనసాగుతున్న సెంటర్ల నిర్వహణపై మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన విజిట్‌లో పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. వీటికి సరఫరా అవుతున్న సరుకుల్లో ముక్కిన బియ్యం.. కుళ్లిన కోడి గుడ్లు కనిపించాయి. అనేక చోట్ల ఆయాలే కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని కేంద్రాలు రెగ్యులర్‌గా తెరుచుకోవడం లేదు.
టీచర్లు కూడా మొక్కుబడిగానే హాజరవుతున్నారు. మెనూ పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. పాలు, ఆకు కూరల జాడే లేదు. రికార్డుల్లో ఉన్న సంఖ్యకు.. సెంటర్లలో ఉన్న చిన్నారులకు పొంతన లేకుండా ఉంది. చాలా కేంద్రాల్లో ఐదుగురికి మించి లేకున్నా.. ఇరవై మందికిపైగా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. బాలింత లు, గర్భిణులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో బాలామృతాన్ని పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. అరకొరగా సరఫరా అవుతున్న సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా కార్యకర్తలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. సెంటర్లకు సొంత భవనాలు లేక అద్దెకొంపల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా శిథిలమై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వేతనాలు, భవనాల అద్దెల చెల్లింపుల్లో చోటు చేసుకుంటున్న జాప్యం వల్ల సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని కార్యకర్తలు, ఆయాలు ఆవేదన వ్యక్తం చేశారు.
‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూసిన నిజాలు..
నో ఫుడ్డు, నో గుడ్డు
నర్సాపూర్:అంగన్‌వాడీ కేంద్రాలలో రెండు నెలలుగా ఫుడ్డు లేదు, గుడ్డు లేదు. మూడేళ్ల లోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాల్సి ఉండగా సరకుల సరఫరానే అస్తవ్యస్తంగా తయారయింది. కొల్చారం, హత్నూర మండలాల్లోని పలు కేంద్రాల్లో ముక్కిన బియ్యం ఉండగా పలు చోట్ల కుళ్లిన కోడిగుడ్లు కన్పించాయి. నియోజకవర్గ పరిధిలో 384 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో 266 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె భవనాలన్నీ ఇరుకుగా ఉండడంతో పిల్లలకు ఇబ్బందులు కల్గుతున్నాయి. భవనాలకు ప్రభుత్వం నుంచి అద్దె నామమాత్రంగా రావడంతో చిన్న గదులు తీసుకుని కేంద్రం నడపడంతో ఒకే గదిలో ఒక పక్క పిల్లలు, మరో పక్క వంట చేయడంతో కట్టెల పొయ్యితో వచ్చే పొగతో పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా లేదు. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఇళ్లకు మళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
కిరాయి..కేంద్రాలే
గజ్వేల్: నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో 341 అంగన్‌వాడీ కేంద్రాలకుగానూ 240కిపైగా అద్దె ఇళ్లల్లో కొనసాగుతున్నాయి. చాలా చోట్లా పాడుబడిన ఇళ్లల్లో కేంద్రాలు కొనసాగడం వల్ల పిల్లలు, అంగన్‌వాడీ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు మెనూ ప్రకారం అందాల్సిన పోషకాహారం అందడంలేదు. చిన్నారులకు కుర్‌కురే ప్యాకెట్ల సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ అందడంలేదు. ఇళ్లకు అద్దె ఆరునెలలుగా రావటం లేదు. నిజానికి అద్దె రూ.750 చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఇస్తున్న రూ.200కూడా ఇవ్వడంలేదు. పౌష్టికాహార ‘బాలమృతం’ ప్యాకెట్లపై అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ సిబ్బంది విఫలమవుతున్నారు.
ఆయాలే టీచర్లు
రామచంద్రాపురం/పటాన్‌చెరు రూరల్/జిన్నారం: పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో సిలిండర్లు లేక వంట చేయక పోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు టిఫిన్‌బాక్సులు తీసుకు వచ్చి చిన్నారులకు తినిపించే పరిస్థితి నెలకొంది. అంగన్‌వాడి కేంద్రాల్లో సరుకులు ఆలస్యంగా రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారులు, సిబ్బంది బిక్కు బిక్కుమంటూ గడపారు. అంగన్‌వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తె లియని చందంగా తయారయింది.
పటాన్‌చెరు మండలంలోని బీరంగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు అక్షయపాత్ర భోజనం వడ్డించారు. మరో అంగన్‌వాడీ కేంద్రం మూసివేశారు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయాలే నిర్వహిస్తున్నారు. గడ్డపోతారం, బొంతపల్లి, వావిలాల తదితర గ్రామాల్లోనూ అదే దుస్థితి. సరైన సరకులు లేకపోవడంతో విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు తగిన పౌష్టికాహారం అందటం లేదు. ప్రస్తుతం సరుకులు అందుబాటులో ఉండకపోవటంతో అదీ నిలిపివేశారు.
ఆకలి తీర్చాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు..
Published Tue, Dec 2 2014 10:56 PM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement