జెడ్పీలో పదోన్నతులకు బ్రేక్!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్‌లోని ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియ ర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేం దుకు కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆమోదం తెలి పినా జెడ్పీ అధికారులు ఉత్తర్వులు వెలువరించకుండా జాప్యం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జిల్లా పరిషత్ బాధ్యతలు చేపట్టనున్న ప్రజాప్రతినిధి బంధువు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఉత్తర్వుల జారీ నిలిచిపోవటానికి కారణమని సమాచారం.
వాస్తవానికి, ఈ పదోన్నతుల ఫైల్ ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కారణంగా దీని పరిశీలన వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికల హడావుడి ముగియటంతో రెండు రోజుల క్రితం కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఈ ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ పదోన్నతులు పొందినవారికి సీట్లను సైతం కేటాయించినట్టు తెలిసింది. అయితే ఉత్తర్వులు ఇంకా జారీ కాకపోవటంతో పదోన్నతులు పొందనున్న ఉద్యోగులు శుక్రవారం జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు.
పదోన్నతులు పొందనున్నవారిలో కొందరు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి తమ స్థానాలకు మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బాధ్యతలు చేపట్టకముందే ప్రజాప్రతినిధి తరపు బంధువులు అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని వారు తప్పుపట్టారు. కలెక్టర్ ఆమోదించిన మేరకు స్థానాలను కేటాయించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా పదోన్నతుల ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామన్నారు. పదోన్నతులు, బదిలీలపై ఆంక్షలు విధించారని తెలియడంతో నిలుపుదల చేశామని చెప్పారు. తమపై ఎవరు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాను మార్చలేమని పేర్కొన్నారు.