ముంచుకొస్తున్న ‘మాదీ’
సాక్షి, విశాఖపట్నం: మరో ముప్పు ముంచుకువస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న వాయుగుండం శనివారం ఉదయం నాటికి తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణశాఖ అధికారులు ‘మాదీ’గా నామకరణం చేశారు. మాల్దీవుల వాతావరణ విభాగం ఈ పేరును నిర్ణయించింది. రానున్న 24గంటల్లో మాదీ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఐదు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల క్రితం వరకూ వాయుగుండంగానే ఉంది. శుక్రవారం రాత్రి నాటికి తీవ్రవాయుగుండంగా మారి 24 గంటలు దాటక ముందే తుపానుగా మారింది.
‘మాదీ’ బలపడితే..
మాదీ తుపాను శనివారం సాయంత్రానికి చెన్నైకు ఆగ్నేయంగా 500 కి.మీ. దూరంలో ఉంది. కోస్తా తీరానికి మాత్రం 300 నుంచి 400కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో ఇది కదలడం లేదని, అందువల్లే ఎక్కడ తీరం దాటుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు తీవ్ర గాలులు వీస్తాయంటున్నారు.
దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మాదీ తుపాను ప్రస్తుతం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో ఉంది.
మత్స్యకారులు సముద్రం లోతు వరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
ఉత్తర దిశగా, మెల్లగా పయనిస్తున్నట్టు అంచనా వేశారు.