రాష్ట్రం దిశగా కదులుతున్నపెను తుపాను లెహర్
విశాఖ: రాష్ట్రం దిశగా పెను తుపాను లెహర్ కదులుతోంది. పై-లిన్ , హెలెన్ తుపాను అనంతరం ఏర్పడిన ఈ లెహర్ తుపాను గంటకు 15 కి.మీ వేగంతో కదులుతోంది. మచిలీపట్నంకు 960 కి.మీ, కాకినాడకు 920కి.మీ, విశాఖపట్నంకు 870 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమయ్యింది. 28వ తేదీ మధ్యాహ్నం తీరందాటే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ వద్ద తీరందాటే సమయంలో ఉత్తరకోస్తా, ఒరిస్సాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలుల వేగం గంటకు 200కి.మీ వరకూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముంచుకొస్తున్న లెహర్ తుపాన్ విశాఖ మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరుస తుఫానులతో వేట అతలాకుతలమైంది. తాజా పెను తుఫాను ఏ కొంప ముంచుతుందోననే భయం మత్స్యకారులను వెంటాడుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 6వందల బోట్లకుపైగా వేట సాగిస్తున్నాయి. ఒక్కో బోటుపై 9మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. వందలాది మత్స్యకార కుటుంబాలు వీరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి 45 రోజులు నిషేధం గడువు ముగిసిన తర్వాత.. వేట ప్రారంభించిన మత్స్యకారులకు ఆది నుంచి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తుఫానులు, అల్పపీడనాలతో వేట నామమాత్రంగానే సాగుతోంది. ఐతే గతంలో ఎన్నడూలేని విధంగా వరుసగా వస్తున్న పెను తుపానులతో కోలుకోలేని విధంగా దెబ్బతగులుతోంది.
అక్టోబర్‌లో ఫై-లీన్ తుఫాను మత్స్యకార బతుకులను చిన్నా భిన్నం చేసేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే హెలెన్. ఇది తీరం దాటకుండానే అండమాన్ నుంచి పెను తుఫాను లెహర్ తరుముకొస్తుందన్న వార్త.. మత్స్యకారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.15 రోజులకు సరిపడా రేషన్ సరుకులు, చేపలు నిల్వ ఉంచేందుకు ఐస్‌తో వేటకు సిద్ధమవుతోన్న సమయంలో ఈ వార్త వారిని దిక్కుతోచని స్థితిలో పడేసింది. బోట్లన్నింటిని జెట్టీలకే పరిమితం చేశారు. సముద్రంలో అలల ఉధృతి, ఆటు పోట్లతో వేట సాగించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరుస తుపాన్‌లతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.