తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహర్
విశాఖ : లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడనున్నాయి.
ఈ రోజు రాత్రికి మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. దక్షిణ దిశగా పయనిస్తున్న తుపాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. మరోవైపు అన్ని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఇక లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు.