గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ :
ఖరీఫ్‌లో పైలీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లతో జిల్లాలోని కౌలు రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. కానీ వారికి ఎలాంటి నష్ట పరిహారం అందే అవకాశం లేదు. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడి పెట్టిన కౌలురైతుకు పంటచేతికిరాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. రబీ సాగు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రుణ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించకపోతే సాగు ప్రశ్నార్ధకమే. అయితే కౌలుదారులకు ఈ రబీలోనూ పంట రుణాలు అందే అవకాశం కనబడటం లేదు. జిల్లాలో 1.60లక్షల మంది కౌలుదారులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే కేవలం 20వేల మందికే గుర్తింపు కార్డుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది.
2010లో 68వేల మందికి గుర్తింపుకార్డులిచ్చిన ప్రభుత్వం 2011లో 35వేల మందికి, ఈ ఏడు 20వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులందజేశారు. ఖరీఫ్‌లోనే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పంట రుణాలు ఇవ్వలేదని కౌలుదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా కౌలు కార్డులు పొందాలనుకున్నా పొలాలు కట్టుబడికి ఇచ్చిన రైతులు తమకు కార్డులు వస్తే, ఎక్కడ వారి పొలాలు కాకుండా పోతాయోనని తమకు కౌలుకు ఇచ్చినట్లుగా కాగితం రాసి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుపాన్ల దెబ్బకు ఖరీఫ్ సాగులో నష్టపోయి, మళ్లీ బయట అప్పులు చేయాలంటే అధిక వడ్డీలు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని కౌలుదారులు వాపోతున్నారు.
కౌలుదారులకు రబీ రుణాలందేనా?
Published Wed, Jan 1 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement