‘లెహర్’ గండం గడిచింది | cyclone Lehar hits coast and weakens | Sakshi
Sakshi News home page

‘లెహర్’ గండం గడిచింది

Published Fri, Nov 29 2013 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

‘లెహర్’ గండం గడిచింది

‘లెహర్’ గండం గడిచింది

*వాయుగుండంగా బలహీనపడి మచిలీపట్నం వద్ద తీరం దాటిన లెహర్
* ఊపిరి పీల్చుకున్న కోస్తా జిల్లాలు
* కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు
* సముద్రంలో అల్లకల్లోలంగా ఉండే అవకాశం
* తెలంగాణకు భారీ వర్ష సూచన

 
 సాక్షి, విశాఖపట్నం, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు:
గండం గడిచింది. రాష్ట్రం ఊపిరిపీల్చుకుంది. నాలుగు రోజుల నుంచి ప్రజలను భయాందోళనకు గురిచేసిన లెహర్ తుపాను వాయుగుండంగా బలహీనపడి గురువారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరం దాటేసింది. పెను తుపానుగా మారి అల్లకల్లోలం సృష్టిస్తుందనుకున్న లెహర్  శాంతించడంతో కోస్తా జిల్లాలకు ముప్పు తప్పినట్టయింది. తుపాను తీరం దాటినా దాని ప్రభావం మాత్రం కనీసం 36 గంటల వరకు ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.
 
 12 గంటలపాటు అల్పపీడనం ఉంటుందని, 24 గంటల పాటు గంటకు 45 కి.మీ. నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు పుదుచ్చేరిలోని యానాం ప్రాంతాల్లోనూ భారీ గాలులతోపాటు వర్షాలుంటాయని సూచించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ  జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కోస్తాలోని విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
 
 కోస్తాకు పెను నష్టం తప్పింది..
 లెహర్ గండం గడిచిపోవడంతో కోస్తా తీర ప్రాంత జిల్లాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పటికే పై-లీన్, హెలెన్‌తో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే భయపడినంత తీవ్రత లేకుండానే లెహర్ వెళ్లిపోవడంతో వారు ఊరట చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం కారణంగా తీరం వెంబడి స్వల్పంగా గాలులు వీచాయి. అమలాపురంలో గురువారం కొద్దిసేపు భారీ వర్షం కురిసింది. ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు ఐదడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. పునరావాస కేంద్రాలకు వచ్చిన లోతట్టు ప్రాంత ప్రజలు తమతమ ప్రాంతాలకు వెళ్తున్నారు.
 
 పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పాలకొల్లు, మొగల్తూరు, వీరవాసరం, యలమంచిలి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మచిలీపట్నంలోనే లెహర్ తీరం దాటనుందన్న వార్తలతో కృష్ణా జిల్లా ప్రజలు కలవరపడ్డా చివరికి పెద్దగా నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లాలో వర్షం మినహా గాలులు కూడా పెద్దగా లేవు. బందరు మండలం బుద్దాలపాలెంలో చలిగాలులకు తాడంకి ఆదిశేషమ్మ (75) అనే వృద్ధురాలు మృతి చెందింది.
 
 గురువారం రాత్రి పునరావాస కేంద్రాల్లోని వారిని ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపించి వేశారు. ప్రకాశం జిల్లాలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తుపాను ఉత్కంఠకు తెరపడటంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఎక్కడిక్కడే ట్రాఫిక్ స్తంభించింది.
 
 కృష్ణాలో కౌలు రైతు మృతి
 పెడన, న్యూస్‌లైన్: హెలెన్ దెబ్బకు వరి పంట దెబ్బతినడంతో కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన జన్ను తాతయ్య (65) అనే రైతు గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఈయనకు మూడు ఎకరాల పొలం ఉంది. మరో పదెకరాలను కౌలుకు తీసుకుని కొడుకు సాయంతో సాగు చేస్తున్నాడు. వీరు పంట కోసం సుమారు రూ.1.5 లక్షల అప్పు చేశారు. హెలెన్ కారణంగా పంటంతా నేలవాలింది. దీంతో తాతయ్య మానసికంగా కుంగిపోయాడు.
 
 ‘హెలెన్’ నష్టాన్ని మదింపు చేయండి: సీఎం

 సాక్షి, హైదరాబాద్: హెలెన్ తుపాను నష్టాలపై తక్షణమే గణాంకాల సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హెలెన్ తుపాను నష్టాలు, లెహర్ తుపాను పరిస్థితిపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  లెహర్ తుపాను తీవ్రత తగ్గిపోయిన నేపథ్యంలో పంటలకు, ఇళ్లకు జరిగిన నష్టాలపై త్వరితగతిన, పక్కాగా గణాంకాలు సేకరించాలని సీఎం సూచించారు. తుపానువల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించారు. తుపానువల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంపట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
 
  తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్న, సహాయక చర్యల్లో పాల్గొన వివిధ ప్రభుత్వ విభాగాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తుపాను తీరం దాటినా మరో 12 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి,  వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement