
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం సోమవారం నివేదిక సమర్పించింది. మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వరద నష్టాలపై ఇంకా సర్వే నడుస్తోందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. గత వారం ఇచ్చిన ఆదేశాల మేరకు నివేదిక సమర్పించామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ తెలిపారు. అయితే, ఈ నివేదికపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించాక తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
చదవండి: HYD: గుడ్‌న్యూస్.. ఐటీ కారిడార్‌కు లేడీస్ స్పెషల్ బస్సులు
Comments
Please login to add a commentAdd a comment