తీరం గజగజ
Published Tue, Nov 26 2013 3:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
రేపల్లె, న్యూస్‌లైన్ :‘హెలెన్’ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగుకాకముందే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో జిల్లాలోని తీర మండలాలు వణికిపోతున్నాయి. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుం డంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహెర్’గా నామకరణం చేసిన ఈ తుపాను గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద తీరం దాటనుందని అధికారులు వెల్లడించడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొద్ది రోజుల కిందట పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పంటలు దాదాపు దెబ్బతిన్నాయి. తాజాగా లెహెర్ ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే మిగిలివున్న కొద్ది పాటి పంటలు కూడా దక్కవని రైతులు దిగులు చెందుతున్నారు. మరో వైపు తీరంలో ‘అలజడి’ నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం వరకు నిజాంపట్నం హార్బర్‌లో ప్రమాద హెచ్చరికలు కొనసాగాయి.
సముద్రుడు కాస్తంత శాంతించటంతో ఆదివారం మత్స్యకారులు బోట్లు, పడవలతో తిరిగి సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఇంతలో ‘లెెహ ర్’ రూపంలో మరో తుపాను ముంచుకువస్తోందని తెలియడంతో తీరంలో అలజడి ప్రారంభమైంది. ఇప్పటికే నిజాంపట్నం ఓడరేవులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి ఒడ్డుకు రావాలని అధికారులు సెల్‌ఫోన్ సమాచారం పంపారు.తల్లడిల్లుతున్న రైతులు .. ‘లెహెర్’ పెను తుపానుగా మారి తీరప్రాంతంపై విరుచుకుపడుతుందని వాతవరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే అధిక వర్షాలు, హెలెన్ తుపాను తాకిడికి తల్లడిల్లిన రైతులు మరో ముప్పు ముంచుకొస్తుండటంతో మరింత దిగాలు పడిపోతున్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, చెరుకుపల్లి, నగరం,
నిజాంపట్నం మండలాల్లో సుమారు లక్ష ఎకరాలలో వరి సాగు చేశారు.పై-లీన్,హెలెన్ తుపానుల ప్రభావంతో ఇప్పటికే 55 శాతం పంట దెబ్బతిన్నది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎకరాకు సుమారు రూ. 20 వేల వరకు కౌలు చెల్లించి వరిసాగు చేశారు. తుపానుల తాకిడికి దెబ్బతిన్న కౌలు రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టు కుంటున్నారు. కౌలు కాకుండా ఇప్పటికే ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖర్చు చేసిన రైతులు పంట నేలకొరిగి నీటిలో నానుతుండటంతో కంట తడిపెడుతున్నారు. కంకిమీద, పొట్టమీద ఉన్న వరిపంట నీటిలో నానడం వల్ల పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది. పడిన వరి పంటను కట్టలుగా కట్టేందుకు సుమారు రూ. 7వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం లెహర్ రూపంలో వస్తున్న మరో ముప్పును తలచుకుని కుమిలిపోతున్నారు.
మత్స్యకారులకు గడ్డుకాలం.. వరుస విపత్తులతో మత్స్యకారులు కుంగిపోతున్నారు. పై-లీన్,హెలెన్ తుపానుల కారణంగా కొద్ది రోజులుగా సముద్ర వేటకు అంతరాయం కలుగుతూనే ఉంది. ఒకసారి బోటులో వేటకు బయలు దేరితే సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. అందులో ఎక్కువ భాగం డీజిల్‌కే ఖర్చు అవుతుంది. వేటకు వెళ్లడం, తిరిగి వెంటనే తిరుగుముఖం పట్టడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. సముద్ర జలాలు కలుషితం కావటంతో తీరంలో ఎక్కువ దూరం వెళితేకాని మత్స్య సంపద దొరకని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు వరుస విపత్తులతో మరింత దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement